'సాహో'రే డబురువారిపల్లి బుల్లోడు

28 Aug, 2019 12:32 IST|Sakshi

సీఏ కాబోయి ఫిలిం టెక్నాలజీ చేసి..

లఘు చిత్రాల నుంచి హాలీవుడ్‌ చిత్ర దర్శకుని స్థాయికి ఎదిగిన డబురువారిపల్లి బుల్లోడు

సాహో దర్శకుడు సుజీత్‌రెడ్డి ప్రస్థానం

కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టాడాయన. తండ్రికి వారసునిగా చార్టెడ్‌ అకౌంటెంట్‌ కావాలనుకున్న ఆయన అనూహ్యంగా సినీ రంగంవైపు మళ్లీ హాలీవుడ్‌ స్థాయి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయనే  రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘సాహో’ సినిమాకు దర్శకత్వం వహించిన ఎద్దుల సుజీత్‌ రెడ్డి.సుజీత్‌ సినీ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

కుగ్రామం నుంచి...
అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన పుట్టపర్తి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతంలో డబురువారిపల్లి ఓ కుగ్రామం. ఇక్కడ 150 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ మొత్తం జనాభా 350. ఈ గ్రామంలో ఎద్దుల వారి కుటుంబానికి చెందిన వారే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నింటా ఉన్నత స్థానంలో ఉన్నారు. సాహో చిత్ర దర్శకుడు సుజీత్‌రెడ్డి తండ్రి ఎద్దుల గోపీనాథ్‌రెడ్డి వృత్తిరీత్యా చార్టెడ్‌ అకౌంటెంట్‌. అనంతపురం, ఆ తర్వాత హైదరాబాద్‌లో పనిచేసి అక్కడే స్థిరపడ్డారు. గోపీనాథ్‌రెడ్డి, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు వినీత్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు.  

అనూహ్యంగా సినీరంగంవైపు
సుజీత్‌రెడ్డి 1990, అక్టోబర్‌ 10న జన్మించారు. అప్పట్లో వారి కుటుంబం అనంతపురంలో ఉండేది. అక్కడే ఎల్‌ఆర్‌జీ స్కూల్‌లో 1 నుంచి 3వ తరగతి వరకూ చదువు. ఇంతలో తండ్రికి బదిలీ కావడంతో చెన్నైలో 4 నుంచి పదో తరగతి వరకు చదివి, ఇంటర్మీడియట్‌ కోసం తిరిగి అనంతపురానికి వచ్చారు. తన తండ్రి బాటలోనే తాను కూడా సీఏ చేయాలని భావించి ఇంటర్‌లో ఎంఈసీ పూర్తి చేశారు. తర్వాత విజయవాడ సూపర్‌విజ్‌ కళాశాలలో సీఏ విద్య కోసం చేరారు. దాన్ని వదిలి బీకాం ఆనర్స్‌ పూర్తి చేసి, తల్లిదండ్రుల అనుమతితో 2012–13లో చెన్నైలోని ఎల్‌వీ ప్రసాద్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో పీజీడీఎఫ్‌టీ (పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ ఫిలిం టెక్నాలజీ) చేశారు.

తల్లిదండ్రులు ఎద్దుల గోపీనాథ్‌రెడ్డి, నాగమణి,అన్న వినీత్‌రెడ్డిలతో సుజీత్‌

లఘు చిత్రాల ద్వారా తొలి అడుగు
పీజీడీఎఫ్‌టీ పూర్తి చేసిన తర్వాత 2014 నుంచి షార్ట్‌ ఫిలిమ్స్‌(లఘు చిత్రాలు)పై సుజీత్‌ దృష్టిసారించారు. లఘు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే ప్రముఖ సినీ హీరోలతో పరిచయాలు పెంచుకున్నారు. 23ఏళ్ల వయస్సులోనే ‘రన్‌ రాజా రన్‌’ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ నవ్వులు పూయించిన ఆ చిత్రం సుజీత్‌కు మంచి పేరు తెచ్చింది.

ప్రభాస్‌ ఆశీస్సులతో...
సుజీత్‌ వయస్సు ఇప్పుడు 28 ఏళ్లు. అతనిలోని దర్శకత్వ ప్రతిభను యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ గుర్తించారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో  తీసిన ‘సాహో’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు. హాలీవుడ్‌ చిత్రాలను మరిపించేలా చిత్రాన్ని రూపొందించి యావత్‌ ప్రపంచ దృష్టిని సుజీత్‌ ఆకర్షించారు. అందరి అంచనాలను మించి చిత్రం విజయవంతమవుతుందని ఇప్పటికే ‘సాహో’ టీజర్లు చూసిన నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంతటి ఖ్యాతి గడించిన సుజీత్‌ తమ గ్రామ వాసి కావడంతో డబురువారిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 30 సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది.

సుజీత్‌ స్వగ్రామం ఇదే

మరిన్ని వార్తలు