ఎట్టకేలకు మౌనం వీడిన హీరో

17 Jan, 2017 13:44 IST|Sakshi
ఎట్టకేలకు మౌనం వీడిన హీరో

ముంబై: బాలీవుడ్‌ దంపతులు కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ల కుమారుడు పుట్టగానే పాపులర్ అయ్యాడు. నెలరోజుల పసికందును బయటి ప్రపంచం పెద్దగా చూడలేదు కానీ పేరుతో వార్తల్లోకెక్కాడు. ఈ బాలుడికి తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అనే పేరు పెట్టడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన టర్కీ రాజు తైమూర్‌ పేరును ఎందుకు పెట్టారంటూ సైఫ్‌-కరీనా దంపతులపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ విషయంపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సైఫ్‌ ఎట్టకేలకు స్పందించాడు.  

‘చరిత్ర గురించి నాకు అవగాహన ఉంది. దేశంపై దాడి చేసింది టర్కీ రాజు తైమూర్‌ (Timur). నా కొడుకు పేరు తాయ్‌మూర్‌ (Taimur). ఇది పర్సియన్‌ పేరు. దీని అర్థం ఉక్కు. ఈ పేరన్నా, దీని అర్థమన్నా నాకు, నా భార్య కరీనాకు ఇష్టం’ అని సైఫ్‌ చెప్పాడు. ఇక సోషల్‌ మీడియాలో వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. వారికి నచ్చినట్టుగా కామెంట్లు చేస్తారని, అయితే కొందరు ద్వేషిస్తూ పోస్టులు చేయడం తప్పని అన్నాడు. ఈ విషయంలో చాలామంది తనకు మద్దతుగా నిలిచారని చెప్పాడు.