‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేయాలని అనుకున్నా..

15 May, 2019 10:03 IST|Sakshi

‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి ఇచ్చేయాలని అనుకున్నానని బాలీవుడ్‌ కథానాయకుడు సైఫ్‌ అలీ ఖాన్‌ అన్నారు. చిత్ర పరిశ్రమలో నైపుణ్యం ఉన్న నటులు చాలా మంది ఉన్నారని.. కానీ వారికి ఇంకా పద్మశ్రీ రాలేదన్నారు సైఫ్‌. అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పించ్‌ షోలో సైఫ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో నెటిజన్లు చేసిన కామెంట్లను సైఫ్‌ గుర్తు చేసుకున్నారు.

‘తైమూర్‌ తండ్రి పద్మశ్రీ కొనుక్కున్నారు.. రెస్టారెంట్‌లో కొంత మందిని కొట్టారు.. ‘సేక్రేడ్‌ గేమ్స్‌’లో నటించే అవకాశం ఆయనకు ఎలా ఇచ్చారు.. ఆయనకు నటన రాదు.. అసలు ఆయన నవాబ్‌ ఏంటి’ అని నెటిజన్లు తనను కామెంట్‌ చేశారని సైఫ్‌ గుర్తు చేసుకున్నారు.ఈ విమర్శలపై సైఫ్‌ స్పందిస్తూ.. ‘పరిశ్రమలో నాకన్నా ఎంతో ప్రతిభ ఉన్న సీనియర్‌ నటులు ఎందరో ఉన్నారు. వారికి దక్కని పద్మశ్రీ నాకు రావడం పట్ల నేను కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యాను. ఈ అవార్డును తీసుకోవాలని నేను అనుకోలేద’ని ఆయన తెలిపారు.

అయితే ‘నటన, టాలెంట్‌లో నాకన్నా తక్కువ స్థాయిలో ఉండి అవార్డు అందుకున్న వారు కూడా ఉన్నారు కదా అనిపించింది. అయినా కూడా ఈ అవార్డును తీసుకోవాలంటే నా మనసు ఒప్పుకోలేదు. కానీ మా నాన్న ‘నువ్వు భారత ప్రభుత్వం నిర్ణయాన్ని తిరస్కరించకూడదు’ అని అన్నారు. దాంతో అవార్డును స్వీకరించాను. ప్రస్తుతానికి నా నటనను నేను ఆస్వాధిస్తున్నా. భవిష్యత్తులో మరింత ఉత్తమ ప్రతిభ కనబర్చడానికి ప్రయత్నిస్తా. చూద్దాం అప్పుడైనా జనాలు నన్ను చూసి.. ఈయన పద్మశ్రీకి అర్హుడు అంటారేమో’ అని సైఫ్‌ చెప్పుకొచ్చారు. అంతేకాక జనాలు అనుకుంటున్నట్లు నవాబ్‌ అనే బిరుదు తనకు కూడా ఇష్టం ఉండదని.. కానీ కబాబులను మాత్రం చాలా ఇష్టంగా తింటాన’ని పేర్కొన్నారు సైఫ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా