మహేశ్‌బాబు రఫ్‌ ఆడేశారు

23 Nov, 2019 00:17 IST|Sakshi
దర్శకుడు అనిల్‌ రావిపూడి

హిట్‌ ట్రాక్‌లో దూసుకెళుతున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. మంచి దూకుడు మీద ఉన్న హీరో మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు అనిల్‌ చేసింది నాలుగు సినిమాలే. ఐదో సినిమాకే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ కాంబినేషన్‌ కుదరడం అంటే చిన్న విషయం కాదు. ‘ఇంత పెద్ద స్టార్‌ని ఎలా డీల్‌ చేస్తాం?’ అనే కన్‌ఫ్యూజన్‌ లేకుండా తాను నమ్మిన ఫార్ములాతో ‘సరిలేరు నీకెవ్వరు’ని తెరకెక్కిస్తున్నారు. నేడు అనిల్‌ రావిపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.

► ఐదేళ్లలో నాలుగు సక్సెస్‌ఫుల్‌ సినిమాలు (పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్‌2) అందించారు. మీ సక్సెస్‌ ఫార్ములా ఏంటి?
ప్రతి సినిమా ఫస్ట్‌ సినిమాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక సినిమా చేస్తున్నప్పుడు నా గత సినిమాలను మర్చిపోతాను. ప్రస్తుతం ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యం. గత సినిమా తాలూకు ప్రభావం ప్రస్తుత సినిమా మీద పడకూడదు. అది హిట్‌ అయినా ఫ్లాఫ్‌ అయినా.. మనం ఏం చేస్తున్నాం? అనే ఆలోచన, విశ్లేషణ ఉన్నప్పుడు మనకి మనం బోర్‌ కొట్టం. ఆడియన్స్‌కి కూడా బోర్‌ కొట్టం అని నేను నమ్ముతాను. అది నా ఫిలాసఫీ అనుకోవచ్చు.. స్ట్రాటజీ అనుకోవచ్చు.

► ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఎలా స్టార్ట్‌ అయింది?
ఈ సినిమా ‘ఎఫ్‌ 2’ తర్వాత స్టార్ట్‌ అయిందని అందరూ అనుకుంటున్నారు. కాదు. ‘ఎఫ్‌ 2’ పూర్తయ్యేసరికే మహేశ్‌గారు ఈ కథను ఓకే చేశారు. ‘ఎఫ్‌ 2’ సమయంలో నిర్మాత అనిల్‌ సుంకరగారు మహేశ్‌గారికి నన్ను రిఫర్‌ చేశారు. నా దగ్గర ఉన్న పాయింట్‌ను 45 నిమిషాలు మహేశ్‌గారితో చెప్పాను. సినిమా ఓకే అయింది. సుకుమార్‌గారితో చేయబోయే సినిమా తర్వాత స్టార్ట్‌ చేయాలనుకున్నాం. అనుకోకుండా నా సినిమా ముందుకు రావడం జరిగింది.

► ఈ మధ్య మహేశ్‌ సినిమాలు సోషల్‌ మెసేజ్‌ చుట్టూ తిరిగాయి. మరి ఈ సినిమాలో?
మహేశ్‌ లాంటి సూపర్‌ స్టార్‌ చేసే సినిమాలో ఎక్కడో ఒక చోట బాధ్యతాయుతమైన పాయింట్‌ను కచ్చితంగా చెప్పాలి. అలాగే  ఆయన మాస్‌ లుక్‌లో కనబడి, పూర్తి స్థాయిలో కామెడీ చేసి చాలా రోజులైంది.  ప్రేక్షకులు మహేశ్‌గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమా ఉంటుంది. మహేశ్‌బాబుగారు వెరైటీగా కనిపించబోతున్నారు, బాధ్యతాయుతంగా ఉంటారు. విపరీతంగా ఎంటర్‌టైన్‌ చేస్తారు. కథకు అవసరమైన యాక్షన్, ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. మిలటరీ ఆఫీసర్‌  ‘అజయ్‌ కృష్ణ’ పాత్రలో మహేశ్‌గారు కనిపిస్తారు. ఆయన పాత్ర గురించి కచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు. ఇది కచ్చితంగా స్పెషల్‌ సినిమా అవుతుంది.

► కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ కాన్ఫిడెన్స్‌ అంచనాలను మరింత పెంచుతుంది కదా?
పూర్తయినంతవరకు సినిమా చూశాం. ఈ సినిమా చూసిన ఏ ఒక్కరూ నిరుత్సాహపడరు అని చెప్పగలను. మహేశ్‌బాబుగారు ఉన్నారు కదా అని ఆడుతూపాడుతూ సినిమా చేసేయలేదు. ఇప్పటివరకూ ఏ సినిమాకీ నేనలా చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్‌బాబుగారు రఫ్‌ ఆడేశారు.  కేవలం ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం లేదు. ఫ్యాన్స్‌కి కావాల్సినవన్నీ ఉన్నాయి. అది వాళ్లకు కిక్‌ ఇస్తుంది. అలాగే పండక్కి ఫ్యామిలీతో కలసి సినిమా చూడాలనుకునేవాళ్లు కూడా ఎంజాయ్‌ చేస్తారు.

► విజయశాంతిగారిని మళ్లీ స్క్రీన్‌ మీదకు తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు?
నా చిన్నప్పుడు చూసిన ‘కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్‌ రాములమ్మ’ లాంటి సినిమాల్లో విజయశాంతిగారి డైనమిజమ్‌కి పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను. అలాంటి యాక్టర్‌తో వర్క్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. కమ్‌బ్యాక్‌కి తగ్గ పాత్ర కూడా ఉండాలి. అలాంటి పాత్ర ఉంటే కచ్చితంగా చేస్తాను అని ఆవిడ అన్నారు. ‘రాజా ది గ్రేట్‌’ సినిమాను మొదట రామ్‌తో అనుకున్నప్పుడు రామ్‌ తల్లి పాత్రలో విజయశాంతిగారిని తీసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత అది రవితేజగారితో చేశాను. ఆమెని అడగలేదు. ఈ సినిమాలో ప్రొఫెసర్‌ భారతి పాత్ర రాసుకున్నాక ఆమెని తప్ప మరెవ్వరినీ ఊహించలేదు. కథ విని, పాత్రతో పాటు కథ కూడా నచ్చి ఆమె ఒప్పుకున్నారు.

► దర్శకుడిగా మీ ప్లస్‌ పాయింట్‌ కామెడీ. దాన్ని ఈ సినిమాలో ఎంతవర కూ ఉపయోగించారు?
నా సినిమాలో ఏం ఉంటాయో అవి కోరుకొని ఆడియన్స్‌ థియేటర్‌కి వస్తారు. అవి కచ్చితంగా అందించాలి. ప్రస్తుతం కమర్షియల్‌ ఎలిమెంట్స్, కామెడీ సినిమాలు చేస్తున్న దర్శకులం కొందరే ఉన్నాం. నేను శేఖర్‌ కమ్ముల స్టయిల్లో సినిమా చేయలేను. నేను నమ్ముకున్నదాన్ని ఎంత కొత్తగా చేస్తాను అన్నది ముఖ్యం.  అన్ని జానర్లలో సినిమాలు చేయాలని ఉంది.

► బర్త్‌డే ప్లాన్స్‌ ఏంటి?
ప్రతీసారి కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఉండేవాణ్ణి. ఈసారి మహేశ్‌గారితో ఉండబోతున్నా. అదో కిక్కు. ఆయనతో సరదాగా టైమ్‌ స్పెండ్‌ చేసే అవకాశం వచ్చింది. మంచి కిక్‌ ఇచ్చే బర్త్‌డే ఇది.

► నెక్ట్స్‌ సినిమా?
ఇంకా ఏం ఆలోచించలేదు. కానీ ఏం చేయాలనే ఐడియా మాత్రం ఉంది.

► ‘అల.. వెకుంఠపురములో.., సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో విడుదలవుతున్నాయి. అదేమైనా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుందా?
 ఈ రెండూ డిఫరెంట్‌ సినిమాలు. పండగ సమయాల్లో మూడు సినిమాలు రిలీజ్‌ అయినా ప్రాబ్లమ్‌ ఉండదు. ఇవాళ ఓ సినిమా చూస్తే రేపు మరో సినిమా చూస్తారు.

► ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఎఫ్‌2’ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. తెలుగు నుంచి ఎంపికైన సినిమా అదొక్కటే. ఎలా అనిపిస్తోంది?
చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. షూటింగ్‌ ఉండి ఆ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి వెళ్లలేకపోయాను. మా టీమ్‌ తరఫున ‘దిల్‌’రాజుగారు హాజరయ్యారు.

► ప్రస్తుతం ఉన్న యంగ్‌ కమర్షియల్‌ డైరెక్టర్స్‌లో ఫ్లాప్స్‌ని చూడని దర్శకుడు మీరు. హిట్‌ స్ట్రీక్‌ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు?
రాజమౌళిగారు అంత సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు ఎలా అయ్యారు? ఒక్క సినిమా కూడా మిస్‌ అవ్వకుండా ఎలా హిట్‌ కొడుతున్నారు? అని గమనిస్తే, తెలిసింది ఏంటంటే ఆయన తన బలాన్ని వదిలి ఎప్పుడూ సినిమా చేయలేదు. ఆయన బలం ఎమోషన్‌. ‘ఈగ’ లాంటి ప్రయోగం అయినా, ‘బాహుబలి’ లాంటి ఫ్యాంటసీ అయినా ఆ బలాన్ని వదల్లేదు. ఆయనలా మన బలాన్ని మనం వదలకూడదు. అప్పుడు సినిమా మిస్‌ఫైర్‌ అయ్యే అవకాశం తక్కువ ఉంటుందనుకుంటున్నాను. కథ రాసుకునే దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

బేరాల్లేవ్‌!
‘భయపడే వాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాల్లేవమ్మా!’ అంటున్నారు మహేశ్‌బాబు. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ శుక్రవారం రిలీజ్‌ అయింది. ‘మీరెవరో మాకు తెలియదు. మీకు, మాకూ ఏ రక్తసంబంధం లేదు. కానీ, మీ పిల్లల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత. గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్, సంక్రాంతికి అల్లుళ్లు వస్తారనుకుంటే మొగుడు వచ్చాడేంట్రా’ అనే డైలాగ్స్‌తో ఈ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే జనవరి 11న రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు