అప్పుడు టెన్షన్... ఇప్పుడు కూల్!

16 May, 2016 00:13 IST|Sakshi
అప్పుడు టెన్షన్... ఇప్పుడు కూల్!

మనకెంతో ఇచ్చిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం.. ఇది ‘శ్రీమంతుడు’ డైలాగ్. రీల్ కోసం ఈ డైలాగ్ మాట్లాడిన మహేశ్‌బాబు రియల్‌గా కూడా ఇదే పాటిస్తారు. తెరపై తనని చూసి, ఇష్టపడటంతో పాటు, తన సినిమాలను హిట్ చేస్తున్న ప్రేక్షకులకుమంచి సినిమాలు ఇవ్వాలనుకుంటారు. ‘శ్రీమంతుడు’ ఇచ్చారు. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ కూడా మంచి సినిమానే అంటున్నారు. వరుసగా మంచి సినిమాలిస్తే.. ఇక మహేశ్‌బాబు లావు ఎందుకు అవుతారు. ఈ హ్యాండ్‌సమ్ హీరోతో ‘సాక్షి’ స్పెషల్ టాక్...
 
‘బ్రహ్మోత్సవం’ కారణంగా వ్యక్తిగా ఎదిగానని ఆడియో ఫంక్షన్లో అన్నారు. ఒక సినిమా అంత ప్రభావితం చేస్తుందా?
డెఫినెట్‌గా చేస్తుంది. ఎందుకంటే, ఒక సినిమాకి దాదాపు ఏడెనిమిది నెలలు పని చేస్తాం. ఆ ట్రావెల్‌లో ఆ సినిమాలో ఉన్న మంచి విషయాలు మనల్ని వెంటాడతాయి. శ్రీకాంత్‌గారి సినిమాల్లో చిన్న చిన్న విలువలు ఉంటాయి. అలాంటి చిన్న విలువలను మోడ్రన్ డే లైఫ్‌లో మనం మర్చిపోతుంటాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవి గుర్తొచ్చాయి. చూసే ప్రేక్షకులకు కూడా గుర్తొస్తాయి.
 
మీకు గుర్తొచ్చిన రెండు, మూడు విషయాలను షేర్ చేసుకుంటారా?
మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెగ్యులర్‌గా లంచ్‌కి కలుస్తుంటాం. ఆ సమయంలో హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. ‘బ్రహ్మోత్సవం’లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అందరం కలిసి టూర్‌కి వెళతాం. ఆ టూర్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంజాయ్‌మెంట్‌లో ఒక పాట కూడా పాడుకుంటాం. రియల్ లైఫ్‌లో అలా పాటలు పాడుకోలేం కానీ, ఆ టూర్ తాలూకు సన్నివేశాలు చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా చాలా చాలా గుర్తొచ్చాయి.
 
‘శ్రీమంతుడు’ మంచి ఎమోషనల్ మూవీ... ‘బ్రహ్మోత్సవం’ కూడా అలానే ఉంటుందేమో అనిపిస్తోంది..
‘శ్రీమంతుడు’ లార్జర్ దేన్ లైఫ్. అందుకు పూర్తిగా భిన్నంగా ఉండే సినిమా ‘బ్రహ్మోత్సవం’. ఏ సినిమా వేల్యూ దానికి ఉంటుంది. ‘శ్రీమంతుడు’తో దీనికి పోలిక లేదు.
 
‘శ్రీమంతుడు’తో మీ ఇమేజ్ ఒక్కసారిగా స్కై హై అయ్యింది.. దాంతో నెక్ట్స్ సినిమా ఏం చేయాలా? అనే  భయం ఏర్పడిందా?
‘పోకిరి’ అప్పుడు భయం వేసింది. మళ్లీ నెక్ట్స్ సినిమా ఏంటి? అని. అప్పుడు నా వయసూ తక్కువ. కెరీర్ వయసూ తక్కువే. దాంతో కొంచెం టెన్షన్ అనిపించింది. ‘శ్రీమంతుడు’ తర్వాత భయం అనిపించలేదు. వ్యక్తిగా, నటుడిగా పరిణతి వచ్చింది. జెన్యూన్‌గా చేసిన సినిమా అందరి కితాబులు అందుకున్నందుకు హ్యాపీ అనిపించింది. ‘శ్రీమంతుడు’ తర్వాతి సినిమా ఏంటి? అని ఆలోచించాను. కాన్‌సన్‌ట్రేషన్ ‘బ్రహ్మోత్సవం’ పై పెట్టా. టెన్షన్ పడకుండా కూల్‌గా చేశా.
 
‘శ్రీమంతుడు’ అందరి హార్ట్‌ని టచ్ చేసింది కాబట్టి, మళ్లీ అలానే అవ్వాలని ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని కావాలనే అంగీకరించారా?
‘శ్రీమంతుడు’ అండర్ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడే చెప్పారు. ఆయన కథలు రియలిస్టిక్‌గా ఉంటాయి. అలా ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథతో నేను సినిమా చేయలేదు.
 
వసూళ్ల పరంగా ‘శ్రీమంతుడు’ని ‘బ్రహ్మోత్సవం’ దాటేస్తుందనిపిస్తోందా?
అసలు వసూళ్ల గురించి నేను ఆలోచించలేదు. అది మన చేతుల్లో లేదు. మన బాధ్యత అంతా మంచి సినిమా చేయడం వరకే. కష్టపడి చేయాలి. మిగతాదంతా ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది.
 
టాలీవుడ్‌లో నంబర్ వన్ ప్లేస్‌కి సంబంధించిన స్పేస్ అలా ఉండిపోయింది. కొంతమంది మీరే ‘నంబర్ వన్’ అంటారు..
లేదండి. నేను దాని గురించి ఆలోచించను. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు నాకు ముఖ్యం. నా సినిమాలను వాళ్లు ఆదరిస్తే ఆనందపడతాను. వాళ్లకు గ్రేట్‌ఫుల్‌గా ఉండాలనుకుంటాను. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు చేయాలని అనుకుంటాను. నా దృష్టంతా ఎప్పుడూ మంచి సినిమా మీదే ఉంటుంది. నంబర్ మీద ఉండదు.
 
ఈ మధ్య సొంతూరు బుర్రిపాలెం వెళ్లారు.. అంతకుముందెప్పుడు వెళ్లారు?
నా మొదటి సినిమా ‘రాజకుమారుడు’కి వెళ్లాను. ఆ తర్వాత ఇదే వెళ్లడం. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వెళ్లినప్పటికీ ప్రజలు రిసీవ్ చేసుకున్న విధానం ఆశ్చర్యపరిచింది. ఎండని లెక్క చేయకుండా పిల్లలు, పెద్దవాళ్లందరూ నన్ను చూడ్డానికి గంటలు గంటలు నిలబడటం ఏదో చెప్పలేని ఫీలింగ్‌ని కలిగించింది. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది.
 
సెలబ్రిటీలు మనుషులే అయినప్పటికీ మిమ్మల్ని చూడ్డానికి మిగతా మనుషులు వెయిట్ చేస్తుంటారు ? ఆ సమయంలో ఓ స్టార్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది?
‘దటీజ్ ది పవర్ ఆఫ్ సినిమా’. సినిమా ఆర్టిస్ట్ కావడం నా లక్. నిజంగానే మాతో ప్రేక్షకులకు ఏ బంధమూ ఉండదు. కానీ, విపరీతంగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ చూసినప్పుడు బాధ్యత బాగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. మంచి సినిమా చేసి, వాళ్లని ఆనందపరచాలనిపిస్తుంది.
 
వ్యక్తిగా, నటుడిగా మీ నాన్నగారు సాధించిన దాంట్లో మీరెంత ఎచీవ్ చేశారనుకుంటున్నారు?
నాన్నగారితో పోలికా? ‘హీ ఈజ్ గ్రేట్’. అందుకే నాన్నగారి చేసినదాంట్లో మనం ఎంత చేశాం? అని ఎప్పుడూ ఆలోచించలేదు. బట్.. నా కెరీర్ ప్రోగ్రెస్ అవుతున్న విధానం చూసి, ఆయన చాలా ఆనందపడతారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది.
 
ఈ మధ్య ఓ ఫుట్‌బాల్ ట్రైనర్ ట్రైనప్ అయినట్లుగా అయ్యారట. రోజు రోజుకీ యంగ్‌గా కనిపించడానికి అదే రీజనా?

బేసిక్‌గా నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. కొత్త కొత్త ఎక్స్‌ర్‌సైజులు ట్రై చేస్తుంటాను. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’కి అనే కాదు.. ‘శ్రీమంతుడు’ అప్పుడు కూడా వర్కవుట్స్ చేశాను. ఎప్పుడూ చేస్తూ ఉంటాను.
 
హ్యాండ్‌సమ్‌గా పుట్టినందుకు ఆ దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పుకున్నారా?
యస్.. ఐయామ్ వెరీ మచ్ బ్లెస్డ్. గాడ్‌కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. నాకూ, నా సిస్టర్, బ్రదర్..  అందరికీ నాన్నగారి జీన్స్ వచ్చింది. నేను నాన్నగారిలా ఉంటాను.
 
మీ మేనరిజమ్స్‌లో మీ అబ్బాయి గౌతమ్ ఫాలో అయ్యేవి...
తల్లిదండ్రుల దగ్గర్నుంచి పిల్లలకు కొన్ని మేనరిజమ్స్ వస్తాయి. నేను ఒక రకంగా నవ్వుతాను. గౌతమ్ నవ్వు అచ్చంగా అలానే ఉంటుంది. నేను మాట్లాడేటప్పుడు చేతులు ఎలా ఊపుతానో గౌతమ్ కూడా అంతే. గౌతమ్ ఎక్కువగా నాన్నగారిలా ఉంటాడు.
 
ఎక్కువగా హాలిడే ట్రిప్స్ వెళుతుంటారు.. ఆ ప్లేసెస్‌ని ఎవరు సెలక్ట్ చేస్తారు?
పిల్లలే అడుగుతారు. ముఖ్యంగా గౌతమ్.. ‘ఆ ప్లేస్’కి వెళదాం అని సెలక్ట్ చేస్తాడు. వాళ్ల ఇష్టానికి తగ్గట్టే హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటాం.
 
చదువులో మీ పిల్లలు మీకన్నా బెటరా? మీరే బాగా చదివేవారా?
నేను బ్యాడ్ స్టూడెంట్‌ని కాదు. కానీ, నా పిల్లలు నాకన్నా బాగానే చదువుతారని చెప్పొచ్చు.
 
చదువు విషయంలో ఒత్తిడి చేస్తుంటారా?
అస్సలు లేదు. ఎందుకంటే పదేళ్ల లోపు పిల్లలను జడ్జ్ చేయకూడదు. చిన్నప్పుడు బాగా చదవకపోతే పెద్దయ్యాక కూడా చదవరనీ, చిన్నప్పుడు బాగా చదివితే పెద్దయ్యాక కూడా చదువుతారనీ అనలేం. పిల్లల్ని జస్ట్ వాళ్ల లైఫ్ వాళ్లని ఎంజాయ్ చేయనివ్వాలి.రేవతి, సత్యరాజ్, మహేశ్బాబు, రజిత, ఈశ్వరీ రావ్, జయసుధ

మూడు చక్రాల బుల్లెట్‌కి ఇన్‌స్పిరేషన్ అదే!
‘‘ప్రతి ఊరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అలా ఓ ఊరిలో జరిగిన బ్రహ్మోత్సవాలను తీసుకొని మా ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తెరకెక్కించాం. కుటుంబంతో కలిసి సంతోషంగా చూసేలా తీర్చిదిద్దాం’’ అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ చిత్రం గురించి శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ - ‘‘కుటుంబ కథా చిత్రమిది. అందులోనే లవ్‌స్టోరీ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ గురించి చూపించాం. రాజస్థాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్ర టూరిజం వాళ్ల వద్ద మూడు చక్రాల బుల్లెట్ ఉండేది. చూసేందుకు డిఫరెంట్‌గా ఉండటంతో బాగుంటుందనిపించి, అలాంటి వెహికల్ తయారు చేయించాం. హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులందరితో తీసిన ‘సంగీత్’ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. మా చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది.
 
‘24’ సినిమా మీదాకా వచ్చింది కదా.. ఎందుకు అంగీకరించలేదు?
ఆ సినిమా సూర్యగారు మాత్రమే చేయగలరని నా ఫీలింగ్. ఎవరెవరికి ఏది సూట్ అవుతుందో తెలుసుకోవాలి. నేను ‘24’ చేయలేను. అలాగే, ‘శ్రీమంతుడు’ క్యారెక్టర్ నాకు బాగా సూట్ అవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికే సూట్ అవుతాయి. ప్రతి యాక్టర్‌కి ఒక్కో సినిమా అలా ఉండిపోతుంది.
 
మీ ‘ఎంబి కార్పొరేషన్’పై తీసిన మొదటి సినిమా ‘శ్రీమంతుడు’ మంచి సక్సెస్‌నిచ్చింది. ఇప్పుడు రెండో సినిమాకి కూడా ఓ నిర్మాతగా చేశారు కదా.. ప్రతి సినిమాకీ అలా చేస్తారా?
అలా ఏం లేదు. డెఫినెట్‌గా నేను నమ్మిన సినిమాలకు నేను అసోసియేట్ అవుతాను. నమ్మనంత మాత్రాన అది బ్యాడ్ మూవీ అనలేం. కథ విన్నప్పుడు ఎక్కడో కనెక్ట్ అయిపోతాం. ‘బ్రహ్మోత్సవం’ నచ్చింది. అందుకే అసోసియేట్ అయ్యాను.
 
ప్రొడక్షన్ చూసుకోవడం ఇబ్బందిగా అనిపించిందా?
నేనా సైడ్ పట్టించుకోను. వేరే టీమ్ చూసుకుంటారు. పీవీపీగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కూడా  కథని నమ్మారు. ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ పెట్టారు. ఆయనలాంటి నిర్మాత లేకపోతే ఇలాంటి మంచి సినిమాలు రావు.
 
ఫైనల్లీ మీ తదుపరి సినిమా గురించి?
తెలుగు, తమిళ భాషల్లో మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. ఇప్పట్నుంచీ ఓ పదిహేను, ఇరవై రోజులు బ్రేక్ తీసుకుని, ఆ తర్వాత ఆ సినిమాలో బిజీ అయిపోతా.
 - డి.జి. భవాని