ఆర్యతో సమంత బైక్ షికారు...

27 Jul, 2013 03:40 IST|Sakshi
ఆర్యతో సమంత బైక్ షికారు...
 సమంతకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట. అందుకే ఆర్యతో హైదరాబాద్ పురవీధుల్లో బైక్‌పై ఓ రేంజ్‌లో షికారు చేసేశారు. పైగా ‘హైదరాబాద్ వాతావరణం సూపర్బ్. ఈ వాతావరణంలో బైక్‌పై షికారు చేస్తుంటే... ఆ ఫీలే వేరు’ అని ట్విట్టర్ ద్వారా ఓ రేంజ్‌లో స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు. సమంత ఏంటి? తమిళ హీరో ఆర్యతో బైక్ రైడింగ్ ఏంటి? అది కూడా హైదరాబాద్ పురవీధుల్లోనా? అనుకుంటున్నారా!. ఇదే అనుమానం తర్వాత సమంతకు కూడా వచ్చినట్టుంది. 
 
 అయినవారందరూ ‘నీకు ఆర్యతో షికార్లేంటి?’ అని అడిగారో ఏమో కానీ, వెంటనే మళ్లీ తనే ట్విట్టర్‌లో అసలు విషయాన్ని పోస్ట్ చేశారు. ‘ఓ మై గాడ్. ఆర్య అంటే నా అసిస్టెంట్. తను, నేనూ సరదాగా హైదరాబాద్‌లో బైక్ రైడింగ్ చేశాం. ఆ విషయాన్నే ట్విట్టర్ ద్వారా చెప్పాను’ అని వివరణ ఇచ్చేశారు. ఏ విషయంలోనైనా  క్లారిటీ ముఖ్యం. అది లేకపోతే... ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి మరి.