సంగీత ఈజ్‌ బ్యాక్‌

16 Mar, 2019 12:53 IST|Sakshi

సినిమా: నటి సంగీత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. బహుభాషా నటి.  కథానాయకిగానే కాకుండా ప్రతినాయకి ఛాయలున్న పాత్రలనైనా సమర్థవంతంగా పోషించి మెప్పించగల సత్తా ఉన్న నటి. అలాంటి నటి గాయకుడు క్రిష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత నటనను తగ్గించుకుంది. ఆ మధ్య అడపాదడపా నటించినా రెండేళ్ల నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే బుల్లితెర కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలా పాల్గొంటూ ఆ వర్గ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. తాజాగా మళ్లీ సంగీత బ్యాక్‌ అంటూ ఒక బ్యాంగ్‌ పాత్రలో వెండితెరపై కనిపించబోతోంది. అవును నటుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తిమిళరసన్‌ చిత్రంలో సంగీత ప్రధాన పాత్రల్లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎస్‌ఎన్‌ఎస్‌.మూవీస్‌ పతాకంపై కౌసల్యరాణి నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఇది. బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఇందులో  విజయ్‌ఆంటోని సరసన నటి రమ్యానంబీశన్‌ నటిస్తోంది.

ఇతర ముఖ్య పాత్రల్లో సురేశ్‌గోపి, రాధారవి, సోనూసూద్, యోగిబాబు, రోబోశంకర్, కస్తూరి, చాయాసింగ్, మధుమిత, వైజీ.మహేంద్రన్, కదిర్, శ్రీలేఖ, శ్రీజా, కేఆర్‌.సెల్వరాజ్, సెండ్రాయన్, కుంకీ అశ్విన్, మేజర్‌ గౌతమ్, స్వామినాథన్, మునీశ్‌కాంత్, రాజ్‌కృష్ణ, రాజేంద్రన్‌ నటిస్తున్నారు. వీరితో పాటు దర్శకుడు మోహన్‌రాజా కొడుకు మాస్టర్‌ ప్రణవ్‌ కీలక పాత్రలో పరిచయం అవుతున్నాడు. ఇందులో ఒక ప్రధాన పాత్రలో నటి సంగీత నటిస్తోంది. రెండేళ్ల క్రితం నెరుప్పుడా చిత్రంలో ప్రతినాయకిగా నటించిన సంగీత ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఇదే విషయాన్ని ఈ అమ్మడిని అడగ్గా తనకు తగ్గ పాత్రలు అనిపించకపోవడంతో వచ్చిన చాలా అవకా>శాలను తిరస్కరించినట్లు తెలిపింది. ఇప్పుడు నటించడానికి కారణం తమిళరసన్‌ చిత్రంలో తన పాత్ర చర్చనీయాంశంగా ఉంటుందని చెప్పింది. అందుకే ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. ఈ చిత్రంలో తాను ఒక పెద్ద ఆస్పత్రిని నిర్వహించే డాక్టర్‌గా నటిస్తున్నానని చెప్పింది. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని నటి సంగీత పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా బాణీలు కట్టడం మరో విశేషం. ఆర్‌డీ.రాజశేఖర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తమిళరసన్‌ చిత్ర షూటింగ్‌ చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటోంది.

మరిన్ని వార్తలు