షార్ట్‌ ఫిల్మ్‌ టు ఫీచర్‌ ఫిల్మ్‌

25 Mar, 2017 01:17 IST|Sakshi
షార్ట్‌ ఫిల్మ్‌ టు ఫీచర్‌ ఫిల్మ్‌

మనం మంచి చేయకపోయినా ఫర్వాలేదు, చెడు చేయకూడదు. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు, బాధ్యతలను గుర్తుంచుకోండనే కథతో రూపొందిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘మై జర్నీ’. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తీసిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు యూట్యూబ్‌లో విశేషాదరణ లభిస్తోంది. ప్రేక్షకులకు మంచి సందేశం అందించారని దర్శకుడు ఒ.ఎస్‌.ఆర్‌. కుమార్‌ను అభినందిస్తున్నారు. ఇప్పటివరకూ 28 వేలమంది నెటిజన్లు ‘మై జర్నీ’ని చూశారు.  ఒ.ఎస్‌.ఆర్‌. కుమార్‌ మాట్లాడుతూ – ‘‘నేను కడప – బెంగుళూరు మధ్య ఎక్కువ నైట్‌ జర్నీ చేస్తాను. నా జర్నీలో కొన్ని ఘటనల ఆధారంగా ఈ షార్ట్‌ ఫిల్మ్‌ తీశా.

చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తుంటే హ్యాపీగా ఉంది. మొదట స్మోకింగ్‌పై ‘ఓ నెమలి’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ చేశా. తర్వాత చేసిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘అయ్యో’కి దర్శకుడు పూరి జగన్నాథ్‌ చేతుల మీదుగా స్పెషల్‌ అవార్డు అందుకున్నా. లాభం ఆశించి, నేను షార్ట్‌ ఫిల్మ్స్‌ తీయలేదు. జాబ్‌ చేస్తూ తీశా. కానీ, నా ఫిల్మ్స్‌ చూసిన యునిసిటీ ప్రొడక్షన్స్‌ అధినేత సురేశ్‌ యాదవ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌కి ఛాన్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. 4 నెలల్లో సినిమా మొదలవుతుంది’’ అన్నారు.