మాల్యా అప్పగింత అభ్యర్థనకు బ్రిటన్‌ ఓకే.. | Sakshi
Sakshi News home page

మాల్యా అప్పగింత అభ్యర్థనకు బ్రిటన్‌ ఓకే..

Published Sat, Mar 25 2017 1:15 AM

మాల్యా అప్పగింత అభ్యర్థనకు బ్రిటన్‌ ఓకే..

త్వరలో వారంట్‌ జారీ చేసే అవకాశం  
న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను అప్పగించాలన్న భారత్‌ అభ్యర్థన దరఖాస్తును బ్రిటన్‌ హోం శాఖ ఆమోదించింది. ఇందుకు సంబంధించి వారంట్‌ జారీ చేసే అవకాశాలు పరిశీలించాలంటూ వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును కోరింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి గోపాల్‌ బాగ్లే శుక్రవారం ఈ విషయం తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం మాల్యాను అప్పగించాలంటూ ఫిబ్రవరి 8న బ్రిటీష్‌ హై కమిషన్‌కు అధికారికంగా నోట్‌ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

‘‘మాల్యాపై కేసు కరెక్టేనని ఈ సందర్భంగా చెప్పాం’’ అని బాగ్లే తెలిపారు. మాల్యాకి చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌.. బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్లు బకాయిపడిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరుగుతుండగానే గతేడాది మార్చ్‌ 2న మాల్యా భారత్‌ విడిచి బ్రిటన్‌ వెళ్లిపోయారు. మరోవైపు, ఐడీబీఐ బ్యాంకు ఇచ్చిన రూ. 720 కోట్ల రుణం ఎగవేత కేసులో సీబీఐ కోర్టు ఈ ఏడాది జనవరిలో మాల్యాపై నాన్‌–బెయిలబుల్‌ వారంట్‌ కూడా జారీ చేసింది.  

బ్రిటన్‌లో నిందితుల అప్పగింత ప్రక్రియలో పలు దశలు ఉంటాయి. ముందుగా అరెస్టు వారంటు జారీ చేయాలా లేదా అన్నది న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఒకవేళ వారంట్‌ జారీ అయిన పక్షంలో.. సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేసి ప్రాథమిక విచారణ కోసం కోర్టు ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత అప్పగింతపై విచారణ జరుగుతుంది. చివరిగా హోం మంత్రి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఆయా నిర్ణయాలను సవాల్‌ చేస్తూ.. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement