లైట్‌గా తీసుకోండి... హాయిగా ఉండండి!

6 Apr, 2016 22:49 IST|Sakshi
లైట్‌గా తీసుకోండి... హాయిగా ఉండండి!

ఏ సీజన్‌లో ఉండాల్సిన కష్టాలు ఆ సీజన్‌కి ఉంటాయి. చలికాలం వణికించేస్తుంది. వర్షాకాలం పనులకు ఆటంకం కలగజేస్తుంది. ఎండాకాలం అయితే చెమటలు కక్కించేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ సీజన్‌ని అయినా హాయిగా గడిపేయొచ్చంటున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి, చర్మ సౌందర్య గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలనీ, ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలనీ ఆమె అన్నారు. ఇక, సమ్మర్‌లో శ్రుతీహాసన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుందాం...
 
సమ్మర్‌లో స్కిన్ డ్యామేజ్‌ని తప్పించలేం. అందుకే మిగతా సమయాలకన్నా రెట్టింపు కేర్ తీసుకోవాలి. బయటికు వెళ్లేటప్పుడు మొహం, మెడ, చేతులు.. ఇలా ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యే చోట సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. అందరు చెప్పేదే నేనూ చెబుతున్నా. ఈ సీజన్‌లో ఆయిలీ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది.
 
 ► మా ప్రొఫెషన్‌కి మేకప్ చేసుకోకపోతే కుదరదు. ఎండలో మేకప్ అంటే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవచ్చు. చర్మానికి ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది. అందుకే, ఈ సీజన్‌లో షూటింగ్స్ లేనప్పుడు స్కిన్‌ని ఫ్రీగా వదిలేస్తా.
 
ఎండలో తిరిగినప్పుడు చర్మం కమిలిపోతుంది. అది ఒక పట్టాన తగ్గదు. స్కిన్ ట్యాన్‌ని పోగొట్టాలంటే బంగాళదుంప తొక్కుని ఉపయోగించవచ్చు. ఆ తొక్కుని గుజ్జుగా చేసి, శెనగపిండి, పాలు కలిపి ట్యాన్ అయిన చోట పట్టించాలి. ఎండిపోయిన తర్వాత కడిగేయాలి. ట్యాన్ పోయేంతవరకూ ఇలా చేయొచ్చు.
 
మార్కెట్లోకి ఎన్ని సౌందర్య సాధనాలైనా రానివ్వండి. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్‌ప్యాక్‌లే బెటర్. శెనగపిండి, మీగడ కలిపి మొహానికి పట్టించుకుంటే చర్మానికి మంచిది. వేసవికి ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్.
 
సమ్మర్‌లో నా డైట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ బాగా తాగుతాను. కొబ్బరి నీళ్లు కూడా తీసుకుంటాను. తేలికపాటి ఆహారమే తింటాను. మధ్యాహ్నం భోజనానికి పాస్తా, వెజిటబుల్ సలాడ్స్ లేకపోతే అన్నం, పప్పు తీసుకుంటాను. సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో పండ్ల ముక్కలు తింటాను. రాత్రి ఏడు గంటల లోపే డిన్నర్ ముగించేస్తాను. సూప్, కూరగాయలు, పప్పు, రోటీ తింటాను. సమ్మర్‌లో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది.