మోగ్లీ... మన హైదరాబాదీ!

7 Apr, 2016 06:07 IST|Sakshi
మోగ్లీ... మన హైదరాబాదీ!

 హాలీవుడ్ ‘జంగిల్‌బుక్’కీ, హైదరాబాద్‌కీ సంబంధం ఏంటి? లేదనుకోకండి... ఉంది. తెలుగు, తమిళ, హిందీల్లోకి కూడా అనువాదమై వస్తున్న ఈ చిత్రంలో అడవిలో పెరిగిన పసిబాలుడు మోగ్లీ పాత్రే హీరో. భారత సంతతికి చెందిన నీల్ సేథీ ఆ పాత్ర పోషించారు. విశేషం ఏమిటంటే, తెలుగులో వాయిస్ ఇచ్చింది అక్షరాలా మన హైదరాబాద్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి - పదేళ్ల సంకల్ప్.
 
 హాలీవుడ్ సంస్థ డిస్నీ వరల్డ్ నిర్మించిన ఈ మోగ్లీ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలామంది పోటీపడ్డారు. చెన్నై సహా పలు ప్రాంతాల్లోని చిన్నారుల వాయిస్‌ను ఆడిషన్ చేశారు. చివరకు క్యాలిఫోర్నియా దాకా వెళ్ళి, సంకల్ప్ వాయిస్ పోటీలో గెలిచింది. సీనియర్ డబ్బింగ్ కళాకారుడైన నాగార్జున వాయుపుత్ర కుమారుడే సంకల్ప్. ఈ పిల్లాడి వాయిస్ మోగ్లీ పాత్రకు బాగా సూట్ అయిందట. దాంతో, చెన్నై దాకా వెళ్ళి డబ్బింగ్ చెప్పారు.
 
 యాక్టర్ అవ్వాలని యాంబిషన్‌తో పాటు సంగీతం, డ్రాయింగ్ నేర్చుకుంటున్న సంకల్ప్ ‘‘తొలిసారిగా డబ్బింగ్ చెబుతున్నా, సంకల్ప్ గొంతు బాగుంది. మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు’’ అని డిస్నీవరల్డ్ ప్రశంసించడం విశేషం. తండ్రి బాటలో నడుస్తున్న ఈ పసివాడికి ఆల్‌ది బెస్ట్. అన్నట్లు ఈ శుక్రవారమే ‘జంగిల్ బుక్’ తెలుగు వెర్షన్ రిలీజ్.