40 ఏళ్లుగా నా ఆశ.. నా శ్వాస... నృత్యమే!

25 Oct, 2013 01:40 IST|Sakshi
40 ఏళ్లుగా నా ఆశ.. నా శ్వాస... నృత్యమే!
40 ఏళ్లుగా నా ఆశ.. నా శ్వాస... నృత్యమే!  నాట్యాన్ని శ్వాసిస్తారు శివశంకర్ మాస్టార్. ఆయనతో కాసేపు మాట్లాడు  తుంటే... చక్కని శాస్త్రీయ నృత్యాన్ని చూస్తున్న ఫీలింగ్. తన దేహాన్నీ, ప్రాణాన్నీ నాట్యంతో మమేకం చేశారాయన. 40 ఏళ్ల సినీ నాట్య  ప్రస్థానంలో ఎన్నో మలుపులు, ఎన్నో పురస్కారాలు, ఇంకెన్నో అభినం  దనలు. అవన్నీ... తనతో పనిచేసిన అందిరివీ అంటారు శివశంకర్. నాట్యం
 చేస్తుండగానే తుదిశ్వాస విడవాలని కోరుకుంటారాయన. ‘బెంగళూర్ అంత  ర్జాతీయ గ్లోబల్ ట్రస్ట్’ ఈ కళాకారుణ్ణి త్వరలో గౌరవ డాక్టరేట్‌తో సత్కరించ  నుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు శివశంకర్.
 
 డాక్టరేట్ అందుకోబోతున్నారు. ఆ అనుభూతిని చెప్పండి?
 నృత్య దర్శకులు డాక్టరేట్ అందుకోవడం అరుదు. అలాంటి అరుదైన గౌరవం నన్ను వరించడం ఆనందంగా ఉంది. అసలు నాకీ డాక్టరేట్ ఎందుకిస్తున్నారని వాళ్లను అడిగా. ‘మీ డాన్సులో పవిత్రత ఉంటుంది. మీ హావభావాలు ఈ తరంవారికి దుర్లభం... అందుకే మీకీ డాక్టరేట్’ అని చెప్పారు. అది వారి అభిప్రాయం. నేనైతే ఆ పొగడ్తలను తలకెక్కించుకోను. నా తల్లిదండ్రులు, నా శ్రేయోభిలాషులు, నా దర్శక, నిర్మాతలు, నా హీరోలు... ఇలా అందరి దీవెనలవల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. ‘మగధీర’తో జాతీయ పురస్కారం అందుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అనేకం అందుకున్నా. ఇవేమీ నాకు ఆనందాన్ని ఇవ్వలేవు. ఒక మంచి డాన్స్ స్కూల్ పెట్టిన రోజు, మన సంప్రదాయ నృత్యానికి ఒక విలువ తెచ్చిన రోజు అప్పుడు నేను నిజంగా ఆనందిస్తాను. 
 
 మీరు తెలుగువారా? తమిళంవారా?
 నేను భారతీయుణ్ణి. కళాకారుడికి ప్రాంతంతో పనిలేదు. నిజానికి నేను పెట్టింది, పెరిగింది తమిళనాటే. కానీ కళాకారుడిగా ఎదిగింది మాత్రం తెలుగునేలపై. ఇక్కడి ప్రజలు నన్ను సొంతం చేసుకున్నారు.
 
 మీ పూర్తి పేరు?
 పేరు ముందు ఇంటిపేరు పెట్టుకోవడం తెలుగువాళ్ల  ఆచారం. పేరుకు ముందు తండ్రిపేరు పెట్టుకోవడం తమిళుల ఆచారం. మా నాన్నపేరు కల్యాణసుందరం. నా పూర్తి పేరు ‘కల్యాణసుందరం శివశంకర్’. 
 
 నాట్యం వైపు మీ తొలి అడుగు ఎలా పడింది?
 అది నా పూర్వజన్మ సుకృతం.  నా ఆశ, నా శ్వాస నృత్యం. నిజానికి నా కుటుంబంలో ఎవరూ కళాకారులు కారు. దైవదత్తంగా నాకీ విద్య అబ్బింది. డాన్స్ మాస్టర్ కావాలని ఈ రంగంలోకొచ్చాను. కాళ్లకు గజ్జెకట్టి అరంగేట్రం చేయాలనే కోరిక ఉండేది. నా పాతికో ఏట ఆ కోరిక తీరింది. సలీంగారి వద్ద దాదాపు పదేళ్లు సహాయకునిగా పనిచేశాను. అలాగే చిన్ని సంపత్, హీరాలాల్, పసుమర్తి కృష్ణమూర్తి లాంటి ఉద్దండుల వద్ద కూడా పనిచేశాను. 
 
 నృత్య దర్శకునిగా తొలి అడుగు?
 పి.మాధవన్ దర్శకత్వం వహించిన ‘కురివిక్కూడు’ నా తొలి చిత్రం. తెలుగులో తొలి సినిమా ‘కాయ్ రాజా కాయ్’. పరుచూరి బ్రదర్స్ డెరైక్ట్ చేశారు. తొలినాళ్లలో క్రాంతికుమార్‌గారు బాగా ప్రోత్సహించారు. 
 
 నృత్య దర్శకునిగా నేటి తరం స్పీడ్‌ని ఎలా తట్టుకోగలుగుతున్నారు?
 దాని కోసం ప్రత్యేకమైన కసరత్తులేం చేయను. నా ప్రతిభే నన్ను నిలబెడుతోంది. శివశంకర్ అనగానే చాలామంది సంప్రదాయ నృత్యమే అనుకుంటారు. నేను అన్ని రకాల డాన్సులూ చేయగలను. బాలకృష్ణ, విజయశాంతి నటించిన ‘దేశోద్దారకుడు’లో నేను చేసిన బ్రేక్‌డాన్స్ మూమెంట్స్ అప్పట్లో ఓ సంచలనం. దాదాపు అందరు హీరోలతో పనిచేశాను. మహేష్, ప్రభాస్‌లతో తప్ప. త్వరలోనే వారితో కూడా పనిచేస్తా. 
 
 ప్రభాస్ ‘బాహుబలి’కి మీకు కచ్చితంగా పిలుపురావాలే?
 అదే జరిగితే నా పంట పండినట్లే. దర్శకుడు రాజమౌళి ఎవరిదగ్గరైనా అద్భుతంగా పని రాబట్టుకోగల దిట్ట. దాసరి, రాఘవేంద్రరావు తర్వాత తెలుగు సినిమాకు దొరికిన ఆణిముత్యం ఆయన. రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగ, మగధీర చిత్రాలకు పనిచేశాను. ‘బాహుబలి’ చేస్తే ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. 
 
 
 మీ అభ్యున్నతి విషయంలో కుటుంబం పాత్ర ఎంత?
 చాలానే ఉంది. నా భార్యపేరు సుకన్య శివశంకర్. నా ఎదుగుదలలో ఆమె పాత్ర చాలానే ఉంది. మా పెద్దబ్బాయి పేరు విజయ్ శివశంకర్, చిన్నబ్బాయి పేరు అజయ్ శివశంకర్. ఇద్దరూ డాన్సు మాస్టర్లే. 
 
 డాన్స్ మాస్టర్‌గా మీ లక్ష్యం?
 ఒక స్కూల్ పెట్టాలని ఉంది. తమిళనాడులో అది సాధ్యం కాదు. నృత్యాన్ని అమితంగా ఇష్టపడే తెలుగునాటే అది సాధ్యం. సరైన సహకారం లభిస్తే తప్పకుండా కోరిక తీర్చుకుంటా. అలాగే.. ప్రస్తుతం డాన్సులన్నీ ఒకేరీతిలో ఉంటున్నాయి. ఆ విధానానికి స్వస్తి పలకాలని ఉంది. నాట్యంలో వివిధ రకాల ప్రయోగాలు చేయాలని ఉంది.
 
>