చిన్న చిత్రాలపెద్ద విజయం

24 May, 2014 00:30 IST|Sakshi
చిన్న చిత్రాలపెద్ద విజయం

 ఏ చిత్రానికి అయినా కథే కింగ్ అని ఇటీవల విడుదలైన చిత్రాలు మరోసారి నిరూపించాయి. ప్రేక్షకుల అభిరుచి మారుతుంది. కథ, కథనాల్లో వైవిధ్యం కనబరుస్తూ చిత్రాలను రూపొందిస్తే ప్రేక్షకాదరణ ఉంటుంది. స్టార్స్ చిత్రాలపై ఆసక్తి ఉంటుందన్నది ఎంత నిజమో అలాంటి చిత్రాల్లో కూడా నవ్యత లేకుంటే పక్కన పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడమని ఆడియన్స్ చేతల్లో చెబుతున్నారు. ఈ విషయం క్రియేటర్స్‌కు బాగా అర్థం అయ్యింది. దీంతో చాలా వరకు దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తగా చిత్రాలు నిర్మిస్తున్నారని చెప్పవచ్చు.
 
 చిత్ర విజయాల సంఖ్య పెరిగింది

 ఏదేమైనా ఈ ఏడాది విజయాల సంఖ్య పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పలు చిన్న చిత్రాలు విజయ విహారం చేయడం మంచి పరిణామం. ఈ ఏడాది రెండు స్టార్స్ చిత్రాలతో శుభారంభం అయ్యింది. వాటిలో ఒకటి విజయ్ జిల్లా, రెండోది అజిత్ వీరం చిత్రాలు. జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ రెండు చిత్రాలు భారీ లాభాలనే ఆర్జించి పెట్టాయి.
 
 చిన్న చిత్రాల హవా
 అయితే ఆ తరువాత స్టార్స్ చిత్రాలేవీ తెరపైకి రాకపోవడం విశేషం. రజనీకాంత్ కోచ్చడయాన్, కమలహాసన్ విశ్వరూపం-2 చిత్రాలు ఈ ఏడాది ఆదిలో తెరపైకి వస్తాయని ఆశించినా అలా జరగలేదు. అయితే ఆ చిత్రాలకు బదులు విడుదలైన చిన్న బడ్జెట్ చిత్రాలు మాన్‌కరాటే, నాన్ శిగప్పు మనిదన్, లాంటి చిత్రాలు విజయాలను సొంతం చేసుకున్నాయి. ఎలాంటి స్టార్ వాల్యూ లేని లోబడ్జెట్ చిత్రం గోలీసోడా సాధించిన వసూళ్లు తమిళ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచాయి. ఇక తేగిడి, ఇదు కదిర్‌వేలన్ కాదల్ వంటి చిన్న చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి.