బాంబుల ఏకనాథ్‌ ఇకలేరు

16 May, 2019 02:56 IST|Sakshi
జి. ఏకనాథ్‌

సినీ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడు జి. ఏకనాథ్‌ (69) ఇక లేరు. ఐదు నెలలుగా కేన్సర్‌ వ్యాధితో పోరాడిన ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని వలసరవాక్కం లక్ష్మీనగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్టణానికి చెందిన ఏకనాథ్‌ 55 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి సినీరంగంలో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ శాఖలో చేరారు. బాంబుల ఏకనాథ్‌గా పేరు పొందిన ఆయన 45 ఏళ్ల పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఏడువందలకు పైగా చిత్రాలకు పని చేశారు. ‘అల్లూరి సీతారామ రాజు, అగ్నిపర్వతం, జగన్మోహిని, తాండ్ర పాపారాయుడు, నాయకుడు’ వంటి ఎన్నో సినిమాలకు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చేశారు.

  సీనియర్‌ కెమెరామేన్‌ మోహనకృష్ణకు ఏకనాథ్‌ తమ్ముడు. దాసరి, కె.రాఘవేంద్రరావు, బాపయ్య, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, తమిళంలో కె.బాలచందర్‌ వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఏకనాథ్‌ పనిచేశారు. కృష్ట, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల చిత్రాలకు పనిచేశారు. అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘ఆఖరిరాస్తా’కి ఏకనాథ్‌ పని చేశారు. ఈయనకు భార్య అన్నపూర్ణ, కొడుకు అనంత్‌నాగ్, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. గురువారం పోరూర్‌లోని శ్మశాన వాటికలో ఏకనాథ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు