బెల్జియమ్‌లో బాహుబలి

3 Nov, 2014 23:56 IST|Sakshi
బెల్జియమ్‌లో బాహుబలి

అనేక సంచలనాలకు తెర తీస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’ ఇప్పుడు సౌండ్ రికార్డింగ్‌లోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా ఈ పని కోసం ఏకంగా బెల్జియమ్‌కు వెళ్ళింది. అక్కడ ‘ఫోలే’ రికార్డింగ్ చేస్తోంది. ‘ఫోలే’ అంటే... షూటింగ్ అంతా పూర్తయిపోయాక, పోస్ట్ ప్రొడక్షన్‌లో తెర మీది దృశ్యాలకు అనుగుణంగా రోజువారీగా మనం వినే శబ్దాలను పునఃసృష్టించడం! సామాన్యభాషలో వివరించాలంటే, అద్దం బద్దలైనప్పుడు, ఖణేల్‌మంటూ కత్తులు దూసినప్పుడు, గాలికి దుస్తులు రెపరెపలాడినప్పుడు, తలుపులు తెరిచినప్పుడు.. ఒక్కో సందర్భానికి ఒక్కో రకమైన శబ్దం ఉంటుంది. లైవ్ రికార్డింగ్ లేకుండా లొకేషన్లో సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు, ఆయా దృశ్యాల్లోని శబ్దాలను ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌లో ప్రత్యేకంగా సృష్టించి, జత చేస్తారు.
 
 వీటినే సౌండ్ ఎఫెక్ట్స్ అంటాం. శబ్ద నాణ్యత కోసం ఇప్పుడు ‘బాహుబలి’ చిత్రానికి రెండు వారాల పాటు బెల్జియమ్‌లోని డేమ్ బ్లాంచే కాంప్లెక్స్‌లో ఈ పని చేస్తున్నారు. సుప్రసిద్ధ ‘ఫోలే ఆర్టిస్ట్’ ఫిలిప్ వాన్ లీర్ ఈ రికార్డింగ్ చేస్తున్నారు. సోమవారం ఆరంభమైన ఈ రికార్డింగ్ ఈ నెల 14 వరకు జరుగుతుంది. ఫిలిప్‌తో కలిసి సౌండ్ డిజైనర్ పీయమ్ సతీశ్ కూడా పని చేస్తున్నారు. అలా ‘బాహుబలి’ ఓ అరుదైన ఘనతను దక్కించుకోనుంది. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా తదితర భారీ తారాగణంతో, అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ చిత్రం తయారవుతున్న విషయం తెలిసిందే. కె. రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

>