కార్‌ డిజైనర్‌ థార్‌ డిజైనర్‌!

7 Oct, 2023 10:34 IST|Sakshi
క్రిపా అనంతన్‌

మహింద్రా థార్‌ను చూసి భలే ఉందే అనుకున్నారా? దానిని డిజైన్‌ చేసింది ఒక స్త్రీ అని చాలామంది అనుకోరు. ఎందుకంటే ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో మగవారి ప్రాబల్యం ఎక్కువ. కాని క్రిపా అనంతన్‌ గొప్ప కార్‌ డిజైనర్‌గా ఈ రంగంలో తన ప్రభావం చూపుతోంది. మహింద్రాలో హిట్‌ అయిన అనేక ఎస్‌యువీలను ఆమే డిజైన్‌ చేసింది. ఇపుడు ఓలాకు డిజైన్‌ హెడ్‌గా పని చేస్తూ ఉంది.

మహింద్రా సంస్థకు గొప్ప పేరు తెచ్చిన ‘థార్‌’ను క్రిపా అనంతన్‌ డిజైన్‌ చేసింది. ఆమె వయసు 53. పూర్తి పేరు రామ్‌క్రిపా అనంతన్‌ అయితే అందరూ క్రిపా అని పిలుస్తారు. ‘ఆటోమొబైల్‌ డిజైనర్‌ కూడా చిత్రకారుడే. కాకపోతే చిత్రకారుడు కాగితం మీద రంగులతో గీస్తే మేము లోహాలకు రూపం ఇస్తాం... శక్తి కూడా ఇచ్చి కదలిక తెస్తాం’ అంటుంది క్రిపా. బిట్స్‌ పిలానీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన క్రిపా ఆ తర్వాత ఐ.ఐ.టి ముంబైలో ఇండస్ట్రియల్‌ డిజైన్‌ చదివి 1997లో మహింద్రాలో ఇంటీరియర్‌ డిజైనర్‌గా చేరింది. ఆ సమయంలో తయారైన వాహనాలు– బొలెరో, స్కార్పియోలకు ఇంటీరియర్‌ డిజైన్‌ పర్యవేక్షించింది.

ఆమె ప్రతిభను గుర్తించిన సంస్థ కొత్త ఎస్‌యువిని తేదలిచి దాని డిజైనింగ్‌ బాధ్యతలు అప్పజెప్పింది. సాధారణంగా ప్రయాణాలంటే ఇష్టపడే క్రిపా తన టూ వీలర్‌– బజాజ్‌ అవెంజర్‌ మీద మనాలి నుంచి శ్రీనగర్‌ వరకూ ఒక్కతే ప్రయాణిస్తూ వాహనం ఎలా ఉండాలో ఆలోచించింది. అంతేకాదు దాదాపు 1500 మందిని సర్వే చేయించి ఎస్‌యువి ఎలా ఉంటే బాగుంటుందో సూచనలు తీసుకుంది. ‘మహింద్రా ఏ బండి తయారు చేసినా దాని రూపం ఘనంగా ఉండాలి. చిన్నబండి అయినా తన ముద్ర వేయాలి. నేను సాధారణంగా ప్రకృతి నుంచి అటవీ జంతువుల నుంచి వాహనాల డిజైన్లు చూసి ఇన్‌స్పయిర్‌ అవుతాను.

చీటాను దృష్టిలో పెట్టుకుని నేను అనుకున్న డిజైన్‌ తయారు చేశాను’ అందామె. ఆ విధంగా ఆమె పూర్తిస్థాయి డిజైన్‌తో మహింద్రా ఎస్‌యువి 500 మార్కెట్‌లోకి వచ్చింది. పెద్ద హిట్‌ అయ్యింది. దాంతో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో మహిళా డిజైనర్‌గా క్రిపా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇతర వాహనాల డిజైన్ల బాధ్యత కూడా ఆమెకే అప్పజెప్పారు. ‘ప్రతి మనిషికీ ఒక కథ ఉన్నట్టే ప్రతి వాహనానికీ ఒక కథ ఉండాలి. అప్పుడే జనానికి కనెక్ట్‌ అవుతుంది’ అంటుంది క్రిపా. ఆమె తయారు చేసిన ‘ఎస్‌యువి 300’ మరో మంచి డిజైన్‌గా ఆదరణ పొందింది. ఇక ‘థార్‌’ అయితే అందరూ ఆశపడే బండి అయ్యింది.

ఇప్పుడు థార్‌ అమ్మకాలు భారీగా ఉన్నాయి. మహింద్రా సంస్థ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ఉపక్రమిస్తుండగా 2021లో తన సొంత ఆటోమొబైల్‌ డిజైన్‌ స్టూడియో ఏర్పాటు కోసం సంస్థ నుంచి బయటకు వచ్చింది క్రిపా. అయితే ఇప్పుడు ఓలా గ్రూప్‌కు డిజైన్‌హెడ్‌గా పని చేస్తోంది. అంటే ఇకపై ఓలా గ్రూప్‌ నుంచి వెలువడే వాహనాలు ఆమె రూపకల్పన చేసేవన్న మాట. ఇరవైమంది డిజైనర్లతో కొత్త ఆలోచనలకు పదును పెట్టే క్రిపా తన బృందంలో కనీసం 5గురు మహిళలు ఉండేలా చూసుకుంటుంది.

మహిళల ప్రతిభకు ఎప్పుడూ చోటు కల్పించాలనేది ఆమె నియమం. క్రిపాకు  ఏ మాత్రం సమయం దొరికినా పారిస్‌కో లండన్‌కో వెళ్లిపోతుంది. అక్కడ ఏదైనా కేఫ్‌లో కూచుని రోడ్డు మీద వెళ్లే స్పోర్ట్స్‌ కార్లను పరిశీలిస్తూ ఉండటం ఆమెకు సరదా. ‘2050 నాటికి ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఇవాళ్టి నుంచి మన పనిని తీర్చిదిద్దుకోవాలి’ అంటుందామె.ఇంత దార్శనికత ఉన్న డిజైనర్‌ కనుక విజయం ఆమెకు డోర్‌ తెరిచి నిలబడుతోంది.

(చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్‌ సారా! చివరికి సుప్రీం కోర్టు..)
  

మరిన్ని వార్తలు