ఇద్దర్నీ టార్గెట్‌ చేశాం!

28 Oct, 2018 05:13 IST|Sakshi
శ్రీకాంత్‌

‘‘కెరీర్‌లో సరైన సక్సెస్‌ లేనప్పుడు వచ్చినవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ నటుడిగా ముందుకు వెళ్లడమే. ప్రస్తుతం డిఫరెంట్‌ సినిమాల్లో నటిస్తున్నాను. కథ నచ్చితే విలన్‌ క్యారెక్టర్స్‌ చేయడానికి సిద్ధమే’’ అన్నారు శ్రీకాంత్‌. కరణం బాబ్జీ దర్శకత్వంలో శ్రీకాంత్‌ హీరోగా టి. అలివేలు నిర్మించిన ‘ఆపరేషన్‌ 2019’ చిత్రం నవంబర్‌ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ చెప్పిన విశేషాలు...

► ఒక సామాన్య వ్యక్తి రాజకీయ నాయకుడు అయితే అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇందులో పక్కా పొలిటిషియన్‌ క్యారెక్టర్‌ చేశాను నేను. ఎలాగూ ఎలక్షన్స్‌ వస్తున్నాయి కదా అని ఈ సబ్జెక్ట్‌ని ప్లాన్‌ చేశాం. ఎలక్షన్స్‌ గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించినట్లు కూడా ఉంటుందనుకున్నాం. అటు రాజకీయ నాయకులను, ఇటు ప్రజలను... ఇద్దర్నీ టార్గెట్‌ చేసిన చిత్రమిది. ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు. కొన్ని కొన్ని సీన్స్‌ కనెక్ట్‌ అయ్యేలా ఉండొచ్చు. గతంలో వచ్చిన ‘ఆపరేషన్‌ దుర్యోధన’ చిత్రానికి ఇది సీక్వెల్‌ కాదు. స్క్రిప్ట్‌ నచ్చితేనే రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల్లో నటిస్తున్నాను. రాజకీయాల్లోకి రావాలని కాదు.

► గతంలో కరణం బాబ్జీతో ‘మెంటల్‌’ అనే చిత్రం చేశాను. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. కరణం బాబ్జీకి సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌ బాగా సహకరించారు. ఈ చిత్రంలో మంచు మనోజ్‌ ఓ కీలక పాత్ర చేశారు. మనోజ్‌ చాలా అంకితభావం ఉన్న వ్యక్తి. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ అమెరికాలో జరిగింది.

► మా అబ్బాయి యాక్టింగ్‌ కోర్సు పూర్తయింది. వచ్చే ఏడాది ఇండస్ట్రీ ఎంట్రీకి ప్లాన్‌ చేస్తున్నాం. ఎవరు లాంచ్‌ చేయాలి? ఏంటీ? అని ఇంకా అనుకోలేదు. మంచి కథలను బట్టి ముందుడుగు వేస్తాం.

► తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘తెలంగాణ దేవుడు’ అనే సినిమాలో నటిస్తున్నాను. హరీశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఉద్యమానికి సంబంధించిన పాటలు ఎక్కువగా ఉంటాయి. జయరాజ్‌గారి దర్శకత్వంలో ‘మార్షల్‌’ అనే సినిమా చేస్తున్నాను. ‘కోతలరాయుడు’ అనే మరో చిత్రం కూడా చేస్తున్నాను.

మరిన్ని వార్తలు