అసుర.. అసుర.. చంద్రాసుర..! | Sakshi
Sakshi News home page

అసుర.. అసుర.. చంద్రాసుర..!

Published Sun, Oct 28 2018 5:19 AM

Senior leaders comments on Chandrababu Conspiracy Politics - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అనంతరం సీఎం చంద్రబాబు అమానవీయంగా వ్యవహరించడంపై సీనియర్‌ రాజకీయ నేతలు, పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను ‘వర్గ’ శత్రువులుగా పరిగణించి కక్ష తీర్చుకోవాలనే విష సంస్కృతికి ఆద్యుడైన చంద్రబాబు.. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించిన వారిని తప్పు పట్టకుండా సగటు మనిషిలా ఎలా వ్యవహరిస్తారని టీడీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన సీనియర్‌ నేత ఒకరు ప్రశ్నించారు. విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సం‘కుల’ సమరాన్ని రాజేసి.. విద్యాలయాలను భ్రష్టుపట్టించారని నాటి విద్యార్థులు చెబుతున్నారు. కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు రాజకీయ అరంగేట్రం చేశారు.

గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ సాధించి.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడికి తీవ్రద్రోహం చేశారనే విమర్శలూ ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత కనీసం కృతజ్ఞత ప్రదర్శించని స్వార్థపరుడని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్‌టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. 1983లో ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నాడు జరిగిన ఎన్నికలలో తన మామ ఎన్‌టీ రామారావుపైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు.. చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయ అస్థిత్వం కోసం ఎన్‌టీ రామారావును బతిమాలి టీడీపీలో చేరారు. వద్దని వారించినా అల్లుడనే ప్రేమతో చంద్రబాబును ఎన్‌టీ రామారావు చేరదీశారని టీడీపీ సీనియర్‌ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  

కుట్రలు, కుయుక్తులకు మరింత పదును 
టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజ లక్షణాలైన కుట్రలు, కుయుక్తులకు మరింత పదును పెట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎన్‌టీ రామారావు మంత్రివర్గంలో, టీడీపీలో నాదెండ్ల భాస్కర్‌రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. వారిని అడ్డు తొలగించుకోకపోతే తాను ఎదగలేననే భావనతో.. ఆ ముగ్గురిని టీడీపీ నుంచి సాగనంపడానికి బాబు కుట్రలు చేశారు. 1984 జనవరి నాటికి రామారావు సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్‌టీ రామారావుపై మల్లెల బాబ్జీని ఉసిగొలిపి.. హత్యాయత్నం చేయించి, ఆ నెపాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నించారని నాదెండ్ల భాస్కర్‌రావు అనేక సందర్భాల్లో చెప్పారు.

ఆ తర్వాత మల్లెల బాబ్జీకి ఇస్తానన్న రూ.3 లక్షల సుపారీ ఇవ్వకుండా చంద్రబాబు ద్రోహం చేశారని.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మల్లెల బాబ్జీ 1988లో ఆత్మహత్య చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటుతో రామారావు ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి నిరసనగా ఎన్‌టీ రామారావు శాంతియుతంగా ప్రజా పోరాటం చేశారు. కానీ.. రామారావుకు తెలియకుండా అప్పట్లో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించి, అగ్నిగుండం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు ఆరోపించారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీ రామారావు దన్నుతో కర్షక పరిషత్‌ చైర్మన్‌గా దొడ్డిదారిన పదవిని పొంది.. ఓ వర్గం నేతలను చేరదీసి వర్గ రాజకీయాలకు తెరతీశారని అప్పట్లో పలువురు నేతలు అధినేతకు ఫిర్యాదులు చేశారు. కాగా, ఎన్‌కౌంటర్‌ పత్రిక ఎడిటర్‌ పింగళి దశరథరాం హత్యకూ బాబే కారకుడనే విమర్శలు ఉన్నాయి.  

రంగాను కడతేర్చడంతో హత్యా రాజకీయాలకు ఆజ్యం 
రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహనరంగా ప్రజా పోరాటాలతో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డు తొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారనే విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాపై కుట్ర చేసి.. 1988 డిసెంబర్‌ 26న హత్య చేయడంలో చంద్రబాబు ప్రధాన పాత్ర పోషించారని సీనియర్‌ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ఏకరవు పెట్టారు. నాడు సీఎం ఎన్‌టీ రామారావు కార్యదర్శిగా పనిచేస్తున్న రాఘవేంద్రరావును కూడా ఇదే చంద్రబాబు కుట్ర చేసి యాక్సిడెంట్‌లో చంపేశారనే ఆరోపణలున్నాయి. కుట్రలతో టీడీపీలో ఎదిగిన చంద్రబాబు.. 1995లో రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారు. వైశ్రాయ్‌ హోటల్‌లో నిర్బంధించిన తన ఎమ్మెల్యేలను విడిపించుకోవడానికి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులతో దాడి చేయించిన నైజం చంద్రబాబుది. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది ఎన్‌.హరికృష్ణల సహకారంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారిద్దరినీ ఇంటికి సాగనంపారు. బాబుకు సహకరించి తప్పు చేశానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్‌ ఆ క్షోభతోనే కన్ను మూశారు. 

తొమ్మిదేళ్ల పాలనలో రక్తపుటేరులు 
ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడవడం ద్వారా సీఎం పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు 1995 – 2004 మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరగణిస్తూ వచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను రాజేసి.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన 415 మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇలా హత్యకు గురైన వారిలో 300 మంది మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇదే రీతిలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే విమర్శలు ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డిని 1998 మే 23న చంపడంలో ప్రధాన పాత్ర పోషించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. హత్య చేసిన వారికి చంద్రబాబు ఆశ్రయం కల్పించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. వైఎస్‌ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డికి ఇటీవల క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది. 2003లో బాబు సర్కారు హయాంలోనే తనకు రక్షణ కల్పించాలని పరిటాల రవి కోరారు. కానీ.. పరిటాల రవికి భద్రత కల్పించ లేదు. 2004లో పరిటాల రవి హత్యకు గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేలా టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆ పార్టీ నేతలే వివిధ సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చినా, కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. హత్యా రాజకీయాలను మరింత తీవ్రం చేశారనే విమర్శలు వస్తున్నాయి. 

Advertisement
Advertisement