బెజవాడ గడపలో ‘శ్రీనివాస కల్యాణం’

9 Aug, 2018 13:33 IST|Sakshi
సమావేశంలో హీరో నితిన్, హీరోయిన్‌లు రాశీ ఖన్నా, శ్వేత, రాజేంద్రప్రసాద్, దిల్‌రాజు తదితరులు

అందరూ మెచ్చే ‘శ్రీనివాస కల్యాణం’  

సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌

నగరంలో చిత్ర యూనిట్‌ సందడి

‘శ్రీనివాస కళ్యాణం’ చిత్ర యూనిట్‌ సభ్యులు బుధవారం  విజయవాడ నగరంలో సందడి చేశారు.  సినిమా గురువారం విడుదలవుతున్న నేపథ్యంలో నటీనటులు నగరానికి విచ్చేశారు.  విజయవాడ మురళిఫార్చూన్‌ హోటల్‌లో చిత్రం  హీరో నితిన్, హీరోయిన్‌ రాసిఖన్నా, నందిత శ్వేత సందడి చేస్తున్న చిత్రమిది.

లబ్బీపేట(విజయవాడతూర్పు): మంచి కుటుంబ కథాచిత్రం ‘శ్రీనివాస కల్యాణం’ అని సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శ్రీనివాస కల్యాణం చిత్రం గురువారం విడుదల కానున్న నేపథ్యంలో, ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు బుధవారం నగరంలో సందడి చేశారు. ఈ సందర్భంగా మురళీ పార్క్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ దిల్‌రాజ్‌ క్లాసికల్‌ సినిమాలు తీస్తారని, ఈ చిత్రంలో నటించేందుకు తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. నితిన్‌ మొదటి సారి కొడుకుగా నటించాడని, నటీనటులు అంతా చక్కగా నటించినట్లు ఆయన పేర్కొన్నారు. సినిమా హీరో నితిన్‌ మాట్లాడుతూ ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమన్నారు.

ఈ సినిమాలో అనేక మంది సీనియర్‌ నటులు ఉన్నారని, వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు హీరోయిన్‌లు చక్కగా నటించారని, తన జీవితంలో గుర్తుండుపోయే చిత్రం శ్రీనివాస కల్యాణం అన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. చిత్ర దర్శకులు వేగేశ్న సతీష్‌ మాట్లాడుతూ శతమానం భవతి సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, కుటుంబ కథాచిత్రం తీయాలని ప్రేక్షకులు కోరడంతో ఈ సినిమా తీసినట్లు తెలిపారు. సంప్రదాయం, కుటుంబ విలువలను ప్రేక్షకులకు తెలియచేయాలనేదే ఈ చిత్రం ఉద్దేశం అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ 378 రోజుల కిందట ఫిదా తీశానని, ఇప్పుడు ఈ చిత్రం సూపర్‌హిట్‌ కానుందన్నారు. శ్రీనివాస కల్యాణం చిత్రాన్ని సెన్సార్‌ వాళ్లు చూసి తమను అభినందించారని, డిస్ట్రిబ్యూటర్స్‌ చూసి సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒక మంచి చిత్రం తీశామని, ప్రేక్షకులు ఆదరించాలన్నారు. హీరోయిన్‌ రాశీకన్నా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం శ్రీనివాస కల్యాణం అన్నారు. మరో హీరోయిన్‌ నందినీ మాట్లాడుతూ తనకు ఈ చిత్రంలో ఒక చక్కని పాత్ర ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో నటుడు అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు..
ఇంద్రకీలాద్రి(విజయవాడ వెస్ట్‌) : శ్రీనివాస కల్యాణం చిత్ర బృందం బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుంది. హీరో నితిన్, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేతల పాటు నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు సతీశ్‌ వేగేశ్న, నటులు రాజేంద్రప్రసాద్, అజయ్‌లు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఇన్‌చార్జి ఈవో అచ్యుతరామయ్య, సూపరిండెంటెంట్‌ చందు శ్రీనివాస్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. గురువారం సినిమా విడుదల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు బృందం పేర్కొంది. పాలక వర్గ సభ్యుడు పద్మశేఖర్, ప్రొటోకాల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసమూర్తిలు పాల్గొన్నారు. హీరో నితిన్, హీరోయిన్లను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు