సూయి ధాగా ట్రైలర్‌: మేడ్‌ ఇన్‌ చైనా ఎందుకు?

13 Aug, 2018 16:27 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ చాక్లెట్ బాయ్ వరుణ్ ధావన్, బ్యూటి క్వీన్ అనుష్క శర్మ జంటగా నటిస్తున్న‘ సూయి ధాగా’  సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదల అయిది. .‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేశంలో ఖాదీ పరిశ్రమల నేపథ్యంగా సినిమా సాగనుంది. విదేశీ ఉత్పత్పులు వద్దని జాతిపిత మహాత్మా గాంధీ చరకా ద్వారా ఖాదీ వస్త్రాలను రూపొందించిన అంశాలను ఇందులో ప్రస్తావిస్తూ భారతీయ వస్త్ర పరిశ్రమ గొప్పతనాన్ని చాటి చెప్పే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్‌లో అనుష్క అమాయకత్వం భావోద్వేగానికి గురి చేస్తుంది. 

ట్రైలర్‌లో ఏముంది
మౌజీ(వరుణ్‌), మమతా(అనుష్క) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. మౌజీ పెళ్లి వేడుకలు, కార్యక్రమాల్లో కుక్క, కోతి వేషాలు వేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అది మమతాకు నచ్చదు. ఇలా జంతువులుగా ప్రవర్తిస్తూ నలుగురిలో నవ్వుల పాలు అవ్వడం కన్నా ఉన్న ప్రతిభతో చిరు వ్యాపారం ప్రారంభించాలని మమతా తన భర్తకు సూచిస్తుంది. అలా ఇద్దరూ ఓ కుట్టు మెషీన్‌ను కొని దస్తులు కుట్టడం నేర్చుకుంటారు.

అలా ఇద్దరూ దుస్తులు కుట్టే కర్మాగారంలో పనిలో చేరతారు. కానీ కర్మాగారంలో కుట్టిన దుస్తులపై ‘మేడ్‌ ఇన్‌ చైనా’ అని ప్రింట్‌ చేయిస్తారు. అది చూసిన మౌజీ..‘ఇదేంటి మేడ్‌ ఇన్‌ చైనా అని కుట్టారు?’ అని తోటి ఉద్యోగిని అడుగుతాడు. ఇందుకు అతను స్పందిస్తూ..‘మేడ్‌ ఇన్‌ చైనా కాకపోతే మేడ్‌ ఇన్‌ ఘజియాబాద్‌ అని కుడతారా?’ అని చమత్కరిస్తాడు.అప్పుడు తానే స్వయంగా దుస్తులు కుట్టే చిన్న వ్యాపారం ప్రారంభించి వాటికి ‘మేడ్‌ ఇన్‌ భారత్‌’ అని ప్రింట్‌ చేయాలని అనుకుంటాడు మౌజీ. కనుమరుగైపోతున్న భారతీయ సంప్రదాయ దుస్తులను మళ్లీ ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటాడు. ఇందుకు మమతా కూడా సాయపడుతుంది. 

గాంధీజీ పాటించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అనే పాయింట్‌తో పాటుగా ఓ అద్భుతమైన లవ్‌ స్టోరీని కూడా చెప్పదలుచుకున్నారు. యశ్‌ రాజ్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని వార్తలు