Kotabommali PS Review In Telugu: 'కోటబొమ్మాళి పీఎస్' రివ్యూ

24 Nov, 2023 14:36 IST|Sakshi
Rating:  

టైటిల్: కోటబొమ్మాళి పీఎస్
నటీనటులు: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు
దర్శకుడు: తేజ మార్ని
సంగీతం : మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్
సినిమాటోగ్రాఫర్: జగదీశ్ చీకటి
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్
నిర్మాత : బన్నీ వాస్, విద్య కొప్పినీడి
నిర్మాణ సంస్థ: జీఏ 2 పిక్చర్స్
విడుదల తేదీ: 2023 నవంబరు 24

రీమేక్ అనేది సేఫ్ గేమ్ లాంటిది. ఓ భాషలో హిట్టయిన మూవీని కాస్త మార్పులు చేర్పులు చేసి మరో భాషలో తీసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మలయాళంలో రిలీజై ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రం 'నాయట్టు'. దీన్ని తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేసి 'కోటబొమ్మాళి పీఎస్' అనే మూవీగా తీశారు. తాజాగా ఇది థియేటర్లలో వచ్చింది. మరి సినిమా టాక్ ఏంటి? అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ)

కథేంటి?
శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి. ఈ ఊరి పోలీస్ స్టేషన్‌లో రామకృష్ణ(శ్రీకాంత్) హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. ఇదే స్టేషన్‌లో రవికుమార్ (రాహుల్ విజయ్), కుమారి (శివాని రాజశేఖర్) కానిస్టేబుల్స్. కోటబొమ్మాళిలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఊరంతా చాలా హడావుడిగా ఉంటుంది. ఎన్నికల జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ ముగ్గురు కానిస్టేబుల్స్.. ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. దీంతో పోలీసులే ఈ పోలీసుల వెంటపడతారు? మరి హత్య చేసిన ముగ్గురిను.. పోలీసులకు దొరికారా? ఇందులో ఎస్పీ రజియా అలీ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

సినిమా ఎలా ఉందంటే?
రీమేక్ సినిమా తీయడం అనేది ఎంత సేఫో? అంత డేంజర్ కూడా! ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నవ్వులపాలైపోవడం గ్యారంటీ. ఈ విషయంలో 'కోటబొమ్మాళి పీఎస్' ఫస్ట్ క్లాస్‌లో పాసైపోయింది! రెండున్నర గంటల సినిమాలో డ్రామా, థ్రిల్, ఎమోషన్ బాగా కుదిరాయి. ముఖ్యంగా యాస విషయంలోనూ కేర్ తీసుకున్నారు. ప్రతి సీన్‌లో ఇది స్పష్టంగా కనిపించింది.

ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే.. మైనర్ బాలికని రేప్ చేశారనే కారణంతో నలుగురు కుర్రాళ్లని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసే సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. ఈ ఆపరేషన్‌ కోసం రామకృష్ణ(శ్రీకాంత్), ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మి శరత్ కుమార్) కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్, అందులో పనిచేసే కానిస్టేబుల్స్ రామకృష్ణ, రవి, కుమారి చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎష్టాబ్లిష్ చేశారు. మరోవైపు ఉపఎన్నికకు సంబంధించిన స్టోరీ నడుస్తోంది. అనుకోని పరిస్థితుల్లో ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో అదికాస్త రాజకీయం అవుతుంది. రెండు స్టోరీలకు లింక్ ఏర్పడుతుంది. ప్రమాదం అనుకున్నది హత్యగా మారిపోతుంది. ముగ్గురు కానిస్టేబుల్స్.. ఈ హత్య కేసులో ఇరుక్కుంటారు. తమ కార్నర్ చేస్తున్నారని తెలిసి తప్పించుకుని పారిపోతారు. మరి చివరకు వీళ్లు పోలీసులకు దొరికారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

రూరల్ బ్యాక్ డ్రాప్‌తో నడిచే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. 'నాయట్టు' చిత్రాన్ని అలా శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌కి మార్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఊరిలో యాస దగ్గర నుంచి పాత్రల మధ్య నడిచే డ్రామా వరకు బాగానే సెట్ చేసుకున్నారు. ప్రధానంగా ఓ నాలుగైదు పాత్రలు మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సీన్స్ రాసుకున్నారు. కాకపోతే ముగ్గురు కానిస్టేబుల్స్‌, పోలీసులు మధ్య ఛేజింగ్ డ్రామా అంతా కాస్త సాగదీసినట్లు ఉంటుంది. దాన్ని కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది.

మెయిన్ లీడ్స్‌లో శ్రీకాంత్ పాత్రకు రాసుకున్న సీన్స్ బాగున్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే మంచి థ్రిల్ ఇస్తాయి. ఆల్రెడీ పోలీసోడు కాబట్టి తనని ఛేజ్ చేస్తున్న ఎస్పీకే కౌంటర్స్ ఇస్తుంటాడు. సినిమా చూస్తున్నంతసేపు క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందా? పోలీసులు.. హత్య కేసులో ఇరుక్కున్న కానిస్టేబుల్స్‌ని పట్టుకుంటారా? లేదా అని టెన్షన్ క్రియేట్ అవుతుంది. అయితే మనం అనుకోని ఇన్సిడెంట్స్ క్లైమాక్స్‌లో జరుగుతాయి. 

ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో కథే హీరో. మిగిలిన వాళ్లంత పాత్రధారులు మాత్రమే. అలానే స్టార్ యాక్టర్స్ ఎవరు లేరు. ఉన్నంతలో శ్రీకాంత్ మాత్రమే చాలామందికి తెలిసిన ముఖం. అతడు తనకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ రోల్‌కి పూర్తి న్యాయం చేశాడు. కానిస్టేబుల్ రవిగా చేసిన రాహుల్ విజయ్‌కి ఉన్నంతలో మంచి సీన్స్ పడ్డాయి. కానిస్టేబుల్ కుమారిగా చేసిన శివాని.. స్టోరీ అంతా ఉంటుంది కానీ యాక్టింగ్‌కి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఎస్పీ రజియా అలీగా వరలక్ష్మి శరత్ కుమార్.. పోలీస్ విలనిజం చూపించింది. మంత్రి పాత్రలో మురళీ శర్మ పర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లంతా ఫరిది మేరకు నటించారు.

టెక్నికల్ విషయాలకొస్తే.. 'లింగి లింగి లింగిడి' పాట వల్ల ఈ సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఆ సాంగ్ మ్యూజిక్ హిట్. పిక్చరైజేషన్ జస్ట్ బాగుంది. పాటలేం లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథకు తగ్గట్లు సరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. చివరగా డైరెక్టర్ తేజ మార్ని గురించి చెప్పుకోవాలి. మాతృకని పెద్దగా చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీయడంలో పాసైపోయారు. ఓవరాల్‌గా 'కోటబొమ్మాళి పీఎస్'.. ఓ మంచి మూవీ చూసిన ఫీల్ ఇస్తుంది.

- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

(ఇదీ చదవండి: ‘సౌండ్‌ పార్టీ’ మూవీ రివ్యూ)

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు