వ్యూహం ఫలించిందా? 

25 Apr, 2018 00:27 IST|Sakshi

ఒకప్పుడు హాట్‌ గాళ్‌గా తెలుగువారిని సైతం పలు చిత్రాల్లో అలరించిన సుమా రంగనాథన్‌ (సుమన్‌ రంగనాథన్‌) ప్రస్తుతం కన్నడ, తమిళ చిత్రాలకే పరిమితమయ్యారు. దాదాపు 18 ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఆమె ‘దండుపాళ్యం 4’ చిత్రంతో తెలుగు స్క్రీన్‌పై కనిపించనున్నారు. కేటీ నాయక్‌ దర్శకత్వంలో వెంకట్‌ మూవీస్‌ పతాకంపై వెంకట్‌ నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గతంలో వచ్చిన ‘దండుపాళ్యం’ చిత్రాలకూ, మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. 40 మంది గ్యాంగ్‌లో ఎనిమిది మంది జైలులో ఉంటారు.

వారిని తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? అవి ఫలించాయా? లేదా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా? లేక విజయం సాధించారా? వంటి ఆసక్తికరమైన అంశాలతో మా ‘దండుపాళ్యం 4’ రూపొందుతోంది. 30 శాతం షూటింగ్‌ పూర్తి అయింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథలోని వైవిధ్యం, నా పాత్ర ఎంతగానో నచ్చాయి. అందుకే.. వేసవిలోనూ సెట్స్‌లో ఎంతో ఎంజాయ్‌ చేస్తూ నటిస్తున్నా’’ అన్నారు సుమా రంగనాథన్‌. సంజీవ్, విఠల్, అరుణ్‌ బచ్చన్, రిచా శాస్త్రి, బుల్లెట్‌ సోము, స్నేహ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్‌ రాజావిక్రమ్, కెమెరా: ఆర్‌. గిరి.  

మరిన్ని వార్తలు