నిరుద్యోగులకు గూగుల్‌ బాసట | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు గూగుల్‌ బాసట

Published Wed, Apr 25 2018 12:30 AM

Google launches new job search feature in India - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా నిరుద్యోగుల కోసం కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చింది. సెర్చ్‌ పేజ్‌లోనే ఉద్యోగార్థులు తమకు అనువైన ఉపాధి అవకాశాల వివరాలను పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇందుకోసం ఆసాన్‌జాబ్స్, ఫ్రెషర్స్‌ వరల్డ్, హెడ్‌ హాంకోస్, ఐబీఎం టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్, లింక్డ్‌ ఇన్, క్వెజెక్స్, క్వికర్‌జాబ్స్, షైన్‌డాట్‌కామ్, టి–జాబ్స్, టైమ్స్‌జాబ్స్, విజ్డమ్‌ జాబ్స్‌ తదితర సంస్థలతో గూగుల్‌ జట్టుకట్టింది.

గతేడాది నాలుగో త్రైమాసికంలో ఉద్యోగాల కోసం అన్వేషించే సెర్చ్‌ల సంఖ్య 45% పెరిగిందని, ఇందులో సగభాగం మొబైల్‌ ఫోన్స్‌ ద్వారానే నమోదైందని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ ఆనందన్‌ పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా సంస్థలు.. తమ దగ్గరున్న ఉద్యోగావకాశాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు, ఉద్యోగార్థులకు మధ్య వారధిలా ఉపయోగపడేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.

సెర్చి ఇంజిన్‌ బార్‌లో ’సమీపంలో ఉన్న ఉద్యోగాలు’, ’ఫ్రెషర్స్‌ కోసం ఉద్యోగాలు’ లాంటి కీవర్డ్స్‌ టైప్‌ చేస్తే.. సంబంధిత ఉద్యోగావకాశాలు సెర్చి పేజీలో డిస్‌ప్లే అవుతాయి. సదరు ఉద్యోగావకాశంపై క్లిక్‌ చేస్తే.. హోదా, ప్రాంతం, ఫుల్‌ టైమా లేదా పార్ట్‌–టైమా మొదలైన వివరాలు సంక్షిప్తంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తు చేసుకోదలిస్తే.. సదరు ఉద్యోగం లిస్ట్‌ అయిన గూగుల్‌ భాగస్వామ్య వెబ్‌సైట్లో అప్లై చేయొచ్చు.

Advertisement
Advertisement