రూటు మార్చిన భీమవరం బుల్లోడు

11 Mar, 2018 18:46 IST|Sakshi
సునీల్‌

తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది హాస్య నటులు వచ్చారు. నవ్వుల పువ్వులు పూయించారు. కమెడియన్‌గా వచ్చి హీరోలుగా మారారు కొందరు. కమెడియన్స్‌ అంటే హీరోలకి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు మరికొందరు. ఈ ప్రవాహంలో ఎంతో మంది తట్టుకుని నిలబడ్డారు. కొంతమందికి కలసిరాలేదు. బ్రహ్మానందం లాంటి హాస్యనటుడికి ప్రత్యామ్నాయాన్ని ఎవరైనా చూపగలరా? అన్న ప్రశ్నకు నటుడు సునీల్‌ ఒక జవాబులా కనిపించాడు. అతి కొద్ది కాలంలోనే విలక్షణ నటనతో, టైమింగ్‌తో, హావభావాలతో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టించాడు. కొన్ని పాత్రలు సునీల్‌ మాత్రమే చేయగలడు అనే స్థాయి నుంచి కేవలం సునీల్‌ కోసమే కొన్ని పాత్రలు ప్రాణం పోసుకున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తనకు ఎంతో పేరు తెచ్చిన హాస్యాన్ని వదిలి హీరోగా ట్రై చేశాడు. మొదట్లో రెండు హిట్‌లు పడినా, తరువాత సరైన విజయాలు లేక, సమయం కలిసిరాక రేసులో వెనకబడ్డాడు.

తిరిగి మళ్లీ ఎలాగైనా ఫాంలోకి రావాలనే ఉద్దేశంతో తనకు జీవితాన్నిచ్చిన హాస్యప్రధానమైన (కమెడియన్) పాత్రల్లో నటించాలని అనుకుంటున్నట్లు సమాచారం. తన ప్రాణ స్నేహితుడైన త్రివిక్రమ్‌- ఎన్టీఆర్‌, శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రాల్లో సునీల్‌ కమెడియన్‌గా కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాలతో మళ్లీ తన దశను మార్చుకోవాలనుకుంటున్న సునీల్‌కు ఎలాంటి ప్రతిఫలం వస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం అ‍ల్లరి నరేశ్‌ సుడిగాడు2 సినిమాలో సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా