చిన్నవాళ్లను తొక్కేస్తున్నారనడం కరెక్ట్‌ కాదు

2 Sep, 2018 01:36 IST|Sakshi
సురేశ్‌బాబు

‘‘ఈ సినిమాను నాకు దర్శకుడు వెంకటేశ్, విజయ ఆరేడు నెలల క్రితం చూపించారు. సినిమా చాలా బాగా నచ్చింది. అయితే ప్రమోట్‌ చేయడం చాలా కష్టం అనుకున్నాను. ఎందుకంటే మంచి మనలోకి వెళ్లడానికి టైమ్‌ పడుతుంది కదా. మంచి చెప్పులు వేసుకొనే లోపే చెడు ఊరు చుట్టి వస్తుంది అంటాం కదా.. అలాగ. అప్పట్లో సినిమాలకు మూడు వారాల లైఫ్‌ ఉండేది. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. దానికి మౌత్‌ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్‌ అని నమ్ముతాను’’ అని సురేశ్‌బాబు అన్నారు. వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో నూతన నటీనటులతో విజయా పరుచూరి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’. ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్‌ కానుంది ఈ సందర్భంగా సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు...

► స్పాట్‌బాయిగా ఇక్కడ పని చేసి దర్శకుడుగా మారదాం అని ఒక కథ తయారు చేసుకొని, ఆ కథకి టీజర్‌ రెడీ చేసుకొని నిర్మాతను వెతికి పట్టుకొని, కంచెరపాలెం అనే ఊరికి వెళ్లిపోయాడు వెంకట్‌ మహా. అక్కడ నటీనటులతో సినిమా తీశాడు. అది చాలా కష్టం. విజయా పరుచూరి అమెరికాలో డాక్టర్‌. తెలుగు సినిమాలకు తను చాలా దూరం. సాధారణంగా అందరూ ఫారిన్‌ సినిమాల గురించే మాట్లాడతారు.. తెలుగు సినిమాల గురించి ఎందుకు మాట్లాడుకోరు? అనే ఉద్దేశంతో తెలుగు సినిమా తీద్దామనుకుంది. కానీ ఇంట్లో డాక్టర్‌ అవ్వాలన్నారు. డాక్టర్‌ అయ్యి, దాచుకున్న డబ్బులతో ఈ పెద్ద చిన్న సినిమా తీసింది.  

► ఈ సినిమా ప్రీమియర్స్‌కి సెలబ్రిటీలను మేం ‘మీరు తప్పక రావాలి’ అని ఆహ్వానించలేదు. ఫస్ట్‌ చూసినవాళ్లే మిగతా వాళ్లను తీసుకువచ్చారు. చంద్రశేఖర్‌ యేలేటి చూసి కీరవాణిని తీసుకువచ్చాడు. కీరవాణి రాజమౌళిని తీసుకొచ్చాడు. వాళ్లు కూడా ప్రీమియర్‌ చూశాం కదా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పలేదు. సినిమా చుసి తర్వాత మాట్లాడతాం అన్నారు. ఇంటికి వెళ్లిపోయి మరుసటి రోజు పిలిచి సినిమా గురించి వివరంగా మాట్లాడారు. ఈ ప్రీమియర్స్‌ కాన్సెప్ట్‌ అంతా మౌత్‌ పబ్లిసిటీ కోసం.

► ఇది ఫుల్‌ కమర్షియల్‌ సినిమా. నాలుగు జంటల లవ్‌ స్టోరీలు ఈ సినిమా కథ. ఇందులో మ్యూజిక్‌ బావుంటుంది. మన డైలీ లైఫ్‌లో చూసే తమాషా సంఘటనలుంటాయి. మానవత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే ఇలాంటి పెద్ద చిన్న సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలను బ్యాక్‌ చేయడం ముఖ్యం అని ఫీల్‌ అయ్యాను.

► విశేషం ఏంటంటే ఈ సినిమా రిలీజ్‌ తర్వాత  దర్శకుడు వెంకటేశ్‌ మహా న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో జాయిన్‌ అవుతున్నాడు. నేనేదో గొప్ప సినిమా తీశాను అని కూర్చోవడం లేదు. తన క్రాఫ్ట్‌లో ఇంప్రూవ్‌ అవ్వాలని క్రాఫ్ట్‌ నేర్చుకోవాలనే తపన. అలాంటి వాళ్లంటే నాకు చాలా ఇష్టం.

► సినిమాలో ఆల్మోస్ట్‌ 52 మంది కొత్తవాళ్లు నటించారు. సినిమా అయిపోగానే వాళ్ల పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఓ నలుగురైదుగురు యాక్టింగ్‌ మీద ఆసక్తితో ఉండి ఉంటారు. ఇందులోని క్యారెక్టర్స్‌ను ఆధారం చేసుకొని వెబ్‌ సిరీస్‌ కూడా రూపొందించొచ్చు. రానాకు సినిమా విపరీతంగా నచ్చింది. వాళ్లందర్నీ కలవడానికి కంచరపాలెం కూడా వెళ్లాడు. అలాంటి చిన్న ఫిల్మ్‌ మేకర్స్‌ షైన్‌ అయితేనే ఇండస్ట్రీ బావుంటుంది. చిన్న వాళ్లను తొక్కేస్తున్నారు అని అనడం కరెక్ట్‌ కాదు. ఆర్ట్‌కి ఎప్పుడూ ఎంకరేజ్‌మెంట్‌ ఉంటుంది. అవకాశాలు అందరికీ ఉన్నాయి.

► ఇలాంటి సినిమాలను ఎప్పుడైనా మా సంస్థ ప్రమోట్‌ చేస్తుంది. ఈ మధ్య యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కేవలం కమర్షియల్‌ పం«థాలోనే సినిమాలు చెప్పాలనుకోవడం లేదు. కొత్త కొత్తగా స్టోరీ టెల్లింగ్‌ చేస్తున్నారు.

► నేను ఇలాంటి కథలు విని రిజెక్ట్‌ చేసినవి ఏమీ లేవు. ఓ కథ విని వద్దని, ఆ తర్వాత అబ్బా ఈ కథ మిస్‌ అయ్యానని ఫీలైన సందర్భాలు తక్కువ. అలా అయితే మన జడ్జిమెంట్‌లో తేడా ఉన్నట్టు లెక్క. ‘పటాస్‌’ కథ నచ్చింది. రానా కోసం రెడీ చేసిన కథ. తను ‘బాహుబలి’తో బిజీగా ఉండటంవల్ల కుదర్లేదు.

మరిన్ని వార్తలు