ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

21 Aug, 2019 02:10 IST|Sakshi
‘సైరా’ పోస్టర్‌

– చిరంజీవి

‘‘సైరా: నరసింహారెడ్డి’ చరిత్ర మరచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన సినిమా. దేశంలోని ప్రజలందరూ ఇలాంటి వీరుడి కథ తెలుసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. బడ్జెట్‌ పరిమితుల కారణంగా ఒకటిన్నర దశాబ్దంగా ‘సైరా’ వాయిదా పడుతూనే ఉంది. సురేందర్‌రెడ్డి, చరణ్‌ ‘సైరా’ చిత్రం చేయడానికి ముందుకు రావడంతో నా కల నెరవేరింది’’ అన్నారు చిరంజీవి. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’.

చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార కథానాయికగా నటించారు. అమితాబ్‌ బచ్చన్, విజయ్‌ సేతుపతి, సుదీప్, రవికిషన్, తమన్నా కీలక పాత్రధారులు. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌ 2న విడుదల చేయాలనుకుంటున్నారు. హిందీ వెర్షన్‌ను ఫర్హాన్‌ అక్తర్, రితీష్‌ అద్వానీ విడుదల చేస్తున్నారు. గురువారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా టీజర్‌ను మంగళవారం ముంబైలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆజ్‌కా గూండారాజ్‌’ (1992) సినిమా తర్వాత బాలీవుడ్‌లో నాకు ఎందుకు గ్యాప్‌ వచ్చిందో తెలియడం లేదు. సరైన కంటెంట్‌ ఉన్న సబ్జెక్ట్‌ రాలేదు. ఆ కారణంగానే కొంత గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వెళ్లాను. మళ్లీ 2016లో సినిమాల్లోకి వచ్చాను. ఆ సమయంలో కొత్త వాతావరణం కనపడింది. మళ్లీ బాలీవుడ్‌కి రావాలన్నప్పుడు ‘సైరా’ సినిమా అయితే సరిపోతుందనిపించింది. అమితాబ్‌గారు నా రియల్‌ లైఫ్‌ మెంటర్‌. నాకు తెలిసి ఇండియాలో మెగాస్టార్‌ అంటే అమితాబ్‌ బచ్చన్‌గారే.

ఆయన దగ్గరకు ఎవరూ రీచ్‌ కాలేరు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. సినిమాలో నా గురువుగారి పాత్రలో చేయాలని అమితాబ్‌ని కోరినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారు. ఆయనకు రుణపడి ఉంటాను’’ అని అన్నారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయడం చాలెంజింగ్‌గానే అనిపించింది. అమితాబ్‌గారు, చిరంజీవిగారు నాకు కంఫర్ట్‌ జోన్‌ను క్రియేట్‌ చేశారు. నా వెనక చిరంజీవిగారు, చరణ్‌గారు ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చేయగలిగాను’’ అన్నారు.

‘‘అమితాబ్‌ బచ్చన్, చిరంజీవి వంటి గొప్ప స్టార్స్‌తో కలిసి నటించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు విజయ్‌ సేతుపతి. ‘‘అద్భుతమైన నటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని గొప్ప వరంగా భావిస్తున్నా. ప్రతిసారీ ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం రాదు. వచ్చినప్పుడు కాదనుకుండా చేయడమే’’ అన్నారు సుదీప్‌. ‘‘మెగాస్టార్‌ చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన దగ్గర్నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు రవికిషన్‌. ‘‘దక్షిణాది భాష అర్థం కావడమే కష్టం. కానీ సంగీతానికి భాష లేదు.

దర్శకుడు, రైటర్స్‌ నా పనిని సులభం చేశారు’’ అన్నారు సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది. ‘‘నాన్నగారు ఇంట్లో ఒకలా, మేకప్‌ వేసుకున్నప్పుడు ఒకలా ఉంటారు. ఈజీగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయిపోతారు’’ అన్నారు రామ్‌చరణ్‌. ‘‘చిరంజీవిగారితో కలిసి నటించాలనే నా కల నెరవేరింది’’ అన్నారు తమన్నా. ‘‘సినిమాకు భాష లేదు. ‘సైరా’ ఒక గొప్ప చిత్రం. ‘వార్‌’ (హృతిక్‌ రోషన్‌–టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తున్న హిందీ సినిమా), ‘సైరా’ (ఈ రెండు సినిమాలు అక్టోబరు 2న విడుదల అవుతున్నాయి) రెండు వేర్వేరు సినిమాలు. ప్రేక్షకులు రెండు సినిమాలను చూడొచ్చు’’ అన్నారు ఫర్హాన్‌ అక్తర్‌. ‘‘సైరా’ గురించి రామ్‌చరణ్‌ చెప్పగానే నేను టీజర్‌ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. మరికొన్ని రషెస్‌ చూశాను. దాంతో హిందీలో సినిమాను రిలీజ్‌ చేయాలనుకున్నాం’’ అన్నారు రితీష్‌ అద్వాని.

నా కమ్‌ బ్యాక్‌ మూవీ అనుకుంటా
‘జంజీర్‌’ (2013... తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం) తర్వాత బాలీవుడ్‌లో మరో సినిమా ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నకు రామ్‌చరణ్‌ బదులు చెబుతూ – ‘‘ఎంత పెద్ద నటుడికైనా కంటెంట్‌ ఉన్న సినిమా కుదరాలి. వచ్చే ఏడాది రాజమౌళిగారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మీ ముందుకు (హిందీ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ) రాబోతున్నాను. బాలీవుడ్‌లో నా కమ్‌ బ్యాక్‌ మూవీ ఇది.

రామ్‌చరణ్, చిరంజీవి, ప్రభాస్‌

‘సైరా’తో ‘సాహో’!
‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్‌ విడుదల వేడుక మంగళవారం ముంబైలో జరిగింది. ‘సాహో’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్‌ కూడా ముంబైలోనే ఉన్నారు. ఇలా చిరంజీవి, రామ్‌చరణ్, ప్రభాస్‌ కలిసి ఓ ఫొటోకు ఫోజు ఇచ్చి, అభిమానుల దిల్‌ ఖుషీ చేశారు.



ఫర్హాన్‌ అక్తర్, రితేష్‌ అద్వానీ, రామ్‌చరణ్, తమన్నా, చిరంజీవి, సురేందర్‌ రెడ్డి, సుదీప్‌

>
మరిన్ని వార్తలు