‘సూపర్ హీరో’లకు గౌరవం!

10 Feb, 2014 00:26 IST|Sakshi
‘సూపర్ హీరో’లకు గౌరవం!
 అదో వింత ఆకారం. దూరం నుంచి చూస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అదే ఏ స్పైడర్‌మేనో, సూపర్‌మేనో, బాట్‌మేనో, ఐరన్‌మేనో అయితే గాల్లో ఎగిరెగిరి ఆ ఆకారం షేపులు మార్చేస్తారు. ఈ సూపర్ హీరోలు చేసే విన్యాసాలను చూసి, పిల్లలు థ్రిల్ అయిపోతారు. పెద్దల పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంటుంది. ‘మనం కూడా ఓసారి అలా మారిపోతే ఎంత బాగుండు’ అనుకుంటాం. వాస్తవానికి స్పైడర్‌మేన్, సూపర్‌మేన్, బాట్‌మేన్, ఐరన్‌మేన్ కాల్పనిక పాత్రలని తెలిసినా, నిజం అన్నట్లుగా నమ్మేస్తాం. అంతగా ప్రేక్షకుల హృదయాలను ఈ పాత్రలు టచ్ చేశాయి. అందుకే, ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. వీక్షకులను ఎంతగానో ప్రభావితం చేస్తున్న ఈ ‘సూపర్ హీరో’ యానిమేషన్ కేరక్టర్స్‌ను, ఎంతో రిస్క్‌తో కూడుకున్న ఆ పాత్రలను పోషించే నటులను, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి  ఈ తరహా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలను గౌరవించాలనుకుంది.
 
 మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరగనుంది. ఈ లోపు ఆ ప్రాంగణంలో ఓ భారీ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేశారు. గత తొమ్మిది దశాబ్దాల్లో కాల్పనిక పాత్రలతో రూపొందిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అలాగే, వెండితెరపై ఈ సూపర్ హీరోలు చేసిన విన్యాసాల తాలూకు వీడియో క్లిప్పింగ్స్‌ని కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌కి భారీ ఎత్తున స్పందన లభిస్తోందట. సుమారు 80 చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ప్టోసర్లను పొందుపరచడంతో చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదని హాలీవుడ్‌వారు అంటున్నారు. ఆస్కార్ అవార్డ్ కమిటీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని మెచ్చుకుంటున్నారు కూడా.