చెంబుతో కొట్టింది

23 Dec, 2017 00:57 IST|Sakshi

షాజాహాన్‌ తాజ్‌మహల్‌ కడితేఈ అభినవ షాజాహాన్‌ భార్య కోసంటాయ్‌లెట్‌ కడ్తున్నాడని వెక్కిరిస్తుంటారు.నువ్వు కట్టిస్తే మా భార్యలూ ఆ డిమాండ్‌ చేస్తారుఊరుకో అని బెదిరిస్తారు. అయినా పట్టించుకోనికేశవ్‌ చివరకు టాయ్‌లెట్‌ కట్టేస్తాడు.ఓ రాత్రి తన మనుషులతో దాన్నికూలగొట్టిస్తాడు తండ్రి.

యూజువల్లీ తప్పు చేస్తే చెప్పుతో కొడ్తారు. కాని ఇంట్లో టాయ్‌లెట్‌ ఏర్పాటు చేయకపోతే చెంబుతో కొడ్తుంది ఈ మహిళ ఈ సినిమాలో.  పదిమందికీ కనపడేలా భార్యనో, ఇష్టసఖినో ముద్దుపెట్టుకుంటే తప్పు మన దేశంలో. అదే భార్యను లేదా ఇష్టసఖిని పదిమంది తిరుగుతున్న చోటకు చెంబుతో పంపిస్తే తప్పు లేదు! ఇది మన న్యాయం! ఎంత అన్యాయం ఇది? అని నిలదీస్తుంది టాయ్‌లెట్‌. మహిళను పూజించే సంస్కారం మనదని చెప్తూనే ఆమె ఆత్మాభిమానాన్ని పోస్ట్‌మార్టమ్‌ చేస్తున్నాం ఇంట్లో టాయ్‌లెట్లు కట్టకుండా! ఆమె మొహం మీద నుంచి కొంగు తొలిగితే కొంపలేంటుకుపోవు.. కాని బహిర్భూమి కోసం ఆమె బయటకు వెళితేనే కాపురం కూలిపోతుంది అని చూపిస్తుందీ ఈ సినిమా! అవును.. ఇంట్లో టాయ్‌లెట్‌ కట్టించకపోతే మొగుడిని సైతం వదులుకోవడానికి సిద్ధపడుతుంది జయ (భూమి పడ్నేకర్‌).  ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రియాంక అనే అమ్మాయి అత్తింట్లో టాయ్‌లెట్‌ లేదని తెలిసి పీటల మీద పెళ్లిని వద్దనుకుంటుంది. తర్వాత ఆ అత్తామామా టాయ్‌లెట్‌ కట్టిస్తామని ప్రమాణం చేస్తే.. మూడు ముళ్లు వేయించుకుంది. ఈ నిజ జీవిత కథనే రీల్‌గా చుట్టుకుని వచ్చింది టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ. ఆ సినిమా కథ  క్లుప్తంగా...

ఎడ్డెం అంటే తెడ్డెం
 కేశవ్‌ (అక్షయ్‌ కుమార్‌)... ఇంటర్‌ ఫెయిల్డ్‌.. పెళ్లికాని ప్రసాద్‌ కేటగరీ 36 ఏళ్ల  క్యాండిడేట్‌. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వరుడు. ఎంతటి సనాతనం అంటే  అశుద్ధం ఇంట్లో జరక్కూడదని(ఉండకూడదని) టాయ్‌లెట్‌ కట్టించడు వాళ్ల నాన్న (సుధీర్‌ పాండే). సనాతనం పేరుతో అలాంటి చాలా అంధవిశ్వాసాలను పాటిస్తుంటాడు ఆయన. అందుకే 36 ఏళ్లు వచ్చినా కేశవ్‌ పెళ్లికాకుండా ఉంటాడు. ఆ సమయంలోనే కనిపిస్తుంది జయ. చదువుకున్నది, లోకజ్ఞానం తెలిసింది. ఈ ఇద్దరిదీ ఎడ్డెం అంటే తెడ్డం అనే వ్యవహారం. పట్టణంలో పుట్టి పెరిగిన పిల్ల. ఇంట్లో కాస్త ఆధునిక వాతావరణం.. అటాచ్డ్‌ బాత్‌ వగైరాతో సహా! ఆ  పరిచయం ప్రేమగా మారి పెళ్లికీ దారితీస్తుంది.

లోటా పార్టీ
శోభనం తెల్లవారు ఝామున ఊసులాడుకుంటున్న ఈ జంటను కొందరు ఆడవాళ్లు కిటికీలోంచి చూసి డిస్టర్బ్‌ చేస్తారు. ఆ అంతరాయం సహజంగానే జయకు చిరాకు తెప్పించి వాళ్లను అడుగుతుంది ‘‘ఏంటీ’’ అని. అప్పుడు వాళ్ల చేతుల్లో ఉన్న లోటాలను చూపించి ‘‘రావా.. తెల్లవారితే వెళ్లలేవు.. రా త్వరగా వెయిట్‌ చేస్తాం’’ అంటారు. అర్థంకాని జయ అయోమయంగా భర్త వంక చూస్తుంది. నీళ్లు నమిలి చెప్తాడు.. ‘‘వాళ్లు పొలాల్లోకి టాయ్‌లెట్‌కి వెళ్తున్నారు. నువ్వూ వెళ్లు త్వరగా’’ అని. ‘‘ పొలాల్లోకి వెళ్లడం ఏంటీ? ఇంట్లో టాయ్‌లెట్‌ లేదా?’’ అని అడుగుతుంది అంతే అమాయకంగా. తల అడ్డంగా ఊపుతాడు. కోపాన్ని దిగమింగి లోటాతో ఆ పార్టీలో జాయిన్‌ అవుతుంది జయ. అక్కడి నుంచి ఆమెకు, ఆమెతో కేశవ్‌కూ కష్టాలు మొదలవుతాయి టాయ్‌లెట్‌ కోసం!

తండ్రి.. తాను.. భార్య
జయ కోసం లోటా పార్టీ వస్తుందంటే చాలు కేశవ్‌లో వణుకు మొదలయ్యేది.  చేత్తో లాంతరు, ఇంకో చేత్తో లోటాతో ఆ పార్టీతో కలవడం... అసలు బహిర్భూమికి ఊరు అవతలున్న చేను, చెలకలను ఎంచుకోవడం జయకు అసహ్యంగా అనిపించేది. దాంతో కేశవే భార్యను బయటకు తీసుకెళ్లడం మొదలుపెడ్తాడు.అలా ఒకసారి  గుబురు పొద మాటున జయ ఉండగా.. బండీ మీద హెడ్‌లైట్‌తో ఆమె మామగారు వస్తుంటారు... ఆయన కంట కోడలు పడ్తుంది... ఆ కంగారులో బండీ బ్యాలెన్స్‌ తప్పి ఆయనా పడిపోతాడు. ఆ సమయంలో మామగారు తనను చూడ్డంతో సిగ్గు, అవమానంతో దహించుకుపోతుంటుంది జయ. అత్తలేని సంసారం కావడంతో వంటిల్లు జయదే. లోటా అవమానాన్ని కోపంగా వంటింటి పాత్రల మీద తీరుస్తుంటుంది. నిస్సహాయ స్థితిలో కేశవ్‌ ఉంటాడు. అప్పుడే మామగారూ వస్తారు బయట నుంచి. తనను చూసి కోడలు తల మీదకు పైట లాక్కోలేదని, లాక్కోమని కొడుకుకు సైగలతో చెప్తుంటాడు. కేశవ్‌  భార్యను హెచ్చరిస్తాడు. పొద్దున పూట జరిగిన విషయాన్ని ఎత్తిపొడుస్తుంది  జయ ‘అప్పుడు పోని మర్యాద ఇప్పుడు తల మీద పైట లాక్కోకపోవడం వల్ల పోతుందా?’’ అని. అది కోడలి పొగరుగా వినిపిస్తుంది, కనిపిస్తుంది మామగారికి. కొడుకుకు చెప్తాడు భార్యను హద్దుల్లో పెట్టుకోమని. భార్యా చెప్తుంది ఇంట్లో టాయ్‌లెట్‌ కట్టించమని.

ట్రైన్‌లో..
భార్య ఎలాంటి అభాసుపాలవకుండా.. హాయిగా పనికానిచ్చుకునే మార్గాన్ని అన్వేషించడంలోనే కేశవ్‌ జీవితం తెల్లారుతుంటుంది. అలాంటి ప్లాన్స్‌లోనిదే ట్రైన్‌. ఒక ట్రైన్‌ తెల్లవారు జామునే వాళ్ల ఊళ్లో ఏడు నిమిషాలు ఆగుతుంది. ఆ ట్రైన్‌ టాయ్‌లెట్లోకి వెళ్లొచ్చని భార్యకు సలహా ఇవ్వడమే కాక రోజూ తీసుకెళ్తుంటాడు. అలా ఒకరోజు టాయ్‌లెట్‌లో ఉన్నప్పుడునే ఆ బాత్రూమ్‌ బయట కొంతమంది ప్యాసెంజర్స్‌ తమ సామానంతా నింపేసి నిలబడ్తారు కంపార్ట్‌మెంట్లో జాగ దొరక్క. ఈలోపు ట్రైన్‌ కదుల్తుంది. ఆమె లోపలి నుంచి ఎంత ప్రయత్నించినా తలుపు రాదు. అరుస్తుంది. అయినా ఇవతల వాళ్లకు వినిపించదు.  ట్రైన్‌ ప్లాట్‌ఫామ్‌ వీడి పోతుంటే అప్పుడు బాత్రూమ్‌ డోర్‌ దగ్గర ఉన్న వాళ్లకు తెలుస్తుంది లోపల ఎవరో ఉన్నట్లు. గబగబ సామానంత తీసి తలుపు తెరుచుకునే వెసులుబాటు చేస్తారు. అప్పటికే రైలు వేగం పుంజుకుంటుంది. బాత్రూమ్‌లోంచి కంపార్ట్‌మెంట్‌ ఎగ్జిట్‌ దగ్గరకు  వస్తుంది జయ.. ఎర్రబడ్డ మొహంతో. ప్లాట్‌ఫామ్‌ మీద నుంచి అరుస్తుంటాడు కేశవ్‌.. చైన్‌ లాగమని. కాని జయ లాగదు.  ఆ రైలు ఆగి తాను దిగితే తన అత్తింట్లో టాయ్‌లెట్‌ రాదని ఆమెకు తెలుసు. అందుకే లాగదు.. భర్త మాటలను వింటూ అలాగే ఆ రైల్లో సాగిపోతుంది తన ఊరికి.

అభినవ షాజాహాన్‌..
ఇంట్లో టాయ్‌లెట్‌ కట్టించేంత వరకు రానని భీష్మించుకుంటుంది జయ. తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా తనేం చేయనని స్పష్టం చేస్తాడు కేశవ్‌. అయితే అత్తింటికి వచ్చే సమస్యే లేదని అంతకన్నా స్పష్టంగా చెప్తుంది ఆమె. పంతానికి సరే అన్నా చింత పడుతుంటాడు కేశవ్‌ పండిత్‌. టాయ్‌లెట్‌ సమస్య తీర్చి భార్యను రప్పించడం కోసం ప్లాన్స్‌ వేస్తూ ఉంటాడు. అలాంటి టైమ్‌లోనే ఆ ఊళ్లో షూటింగ్‌ అవుతుంటుంది. అక్కడ రెడీమేడ్‌ టాయ్‌లెట్స్‌ను చూస్తాడు. మనసు పారేసుకుంటాడు. ఓ రాత్రి వాటిల్లో ఒకదాన్ని ఎత్తుకొచ్చి ఇంట్లో పెడ్తాడు. సినిమావాళ్లకు తెలిసి పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తారు. ఈ విషయం తెలియని కేశవ్‌ భార్యకు ఫోన్‌ చేసి టాయ్‌లెట్‌ వచ్చేసింది ఇంటికి రమ్మంటాడు. ఆమె ఆ ఏర్పాట్లలో ఉన్నప్పుడే కేశవ్‌ను పోలీసులు లాకప్‌లో వేస్తారు.

ఈ సంగతి తెలిసిన జయ భర్తను అసహ్యించుకుంటుంది. టాయ్‌లెట్‌ కట్టించకపోతే విడాకులు ఇస్తాను అని అల్టిమేటం జారీ చేస్తుంది.  తన చేతకాని తనానికి  కేశవ్‌ సిగ్గుపడ్తాడు. లాభంలేదు.. సీరియస్‌గానే తీసుకోవాలి  అని అనుకొని తండ్రి కట్టుబాటును ధిక్కరిస్తూ ఇంట్లో టాయ్‌లెట్‌ ఉండాలనే అభిప్రాయాన్ని చెప్తాడు. తండ్రి కోపగించుకుంటాడు. అయినా కొడుకు లెక్క చేయడు. ఊళ్లో వాళ్లంతా కూడా కేశవ్‌ను గేలి చేస్తుంటారు.. పెళ్లామ్‌కు బానిస అని. షాజాహాన్‌ తాజ్‌మహల్‌ కడితే ఈ అభినవ షాజాహాన్‌ భార్య కోసం టాయ్‌లెట్‌ కడ్తున్నాడని వెక్కిరిస్తుంటారు. నువ్వు కట్టిస్తే మా భార్యలూ ఆ డిమాండ్‌ చేస్తారు ఊరుకో అని బెదిరిస్తారు. అయినా పట్టించుకోని కేశవ్‌ చివరకు టాయ్‌లెట్‌ కట్టేస్తాడు. ఓ రాత్రి తన మనుషులతో దాన్ని కూలగొట్టిస్తాడు తండ్రి.

డైవోర్స్‌..
ఇది తెలిసిన  జయ  విడాకులు ఖాయం చేస్తుంది. అది దేశమంతా వార్త అవుతుంది. టాయ్‌లెట్‌ కోసం ఓ భార్య విడాకులిస్తోందని టీవీలు, పేపర్లు ఊదరగొడ్తాయి. అత్తగారి ఊరు  ఆడవాళ్లు జయను కలుస్తారు. ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతమా అంటారు. ‘‘కాదు  సిగ్గుచేటు.  మీరూ నాతో కలిస్తే ఇంటింటికీ టాయ్‌లెట్‌ వస్తుంది లేకపోతే నా ఇంట్లోనే వస్తుంది. అదీ లేకపోతే టాయ్‌లెట్‌ ఉన్న మా అమ్మవాళ్లిల్లే నా సొంతిల్లు అవుతుంది’’ అని అంటుంది. భార్య అంటే ఆలోచన ఉన్నవాడు ఇంట్లో టాయ్‌లెట్‌ కడ్తాడు అని నినదిస్తుంది జయ. సోచ్‌ హోతో శోచాలయ్‌ హోగా అని. అది ఊరంతా వ్యాపిస్తుంది ఓ ఉద్యమంలా. చివరకు టాయ్‌లెట్‌ సాధిస్తుంది. ఆ ప్రేమ కథ సుఖాంతమవుతుంది.

టాయ్‌లెట్‌.. నాలుగు అడుగుల విస్తీర్ణంతో నాలుగు గోడల గది మాత్రమే కాదు. స్త్రీ మానాభిమానాలు, ఆమె ఆరోగ్యం, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడే ఓ చూరు అని చాటుతుంది ఈ సినిమా! అంతేకాదు స్వచ్ఛ్‌భారత్‌కి అసలైన నిర్వచనం.. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండడమే అనీ చెప్తుంది! మూఢనమ్మకాలను మరుగుదొడ్లలో వేసి ఒంటిని, ఇంటిని శుభ్రపరిచే తీరును చూపిస్తుంది. కేశవ్‌గా అక్షయ్‌కుమార్, జయగా భూమి పడ్నేకర్‌లు జీవించారు. మిగిలిన వాళ్లూ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. రిషికేష్‌ ముఖర్జీ కిసీసే నా కహెనా తరహాలో  ఈ సినిమాను ఫ్రేమ్‌ చేయాలనుకున్న నారాయణ్‌ సింగ్‌ ప్రయత్నమూ కనిపిస్తుంది. ఈ సినిమాకు సహ నిర్మాతలు అక్షయ్‌ కుమార్, ప్రముఖ దర్శకుడు నీరజ్‌ పాండేలు. ఒక కమర్షియల్‌ హీరో ఇలాంటి సామాజిక అంశాలను తెరకెక్కించడంలో చూపించిన చొరవ ప్రశంసనీయం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా