‘అర్ధాంత‌రంగా వ‌దిలేసి వెళ్లిపోతావ‌ని అనుకోలేదు’

25 Nov, 2018 11:05 IST|Sakshi

కన్నడ నటుడు అంబరీష్‌ మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు, తమిళ భాషల సీనియర్‌ నటులతో ఎంతో సన్నిహితంగా ఉండే అంబరీష్ మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమిళ హీరో రజనీకాంత్ ఇప్పటికే అంబరీష్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. తెలుగు సీనియర్‌ హీరో మోహన్‌బాబు అంబరీష్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు.

‘35 ఏళ్ల స్నేహాన్ని ఇలా అర్ధాంత‌రంగా వ‌దిలేసి వెళ్లిపోతావ‌ని ఎప్పుడూ అనుకోలేదు.. నా ప్రతీ విజ‌యంలో తోడుగా ఉన్న నువ్వు ఈ రోజు లేవు అంటే న‌మ్మడానికి మ‌న‌సు క‌ష్టంగా అనిపిస్తుంది.. నువ్వు లేవ‌న్న నిజం తెలుసుకుని మ‌న‌సు న‌మ్మనంటుంది.. మూడున్నర ద‌శాబ్ధాల మ‌న ఈ స్నేహంలో నాకు ఎన్నో తీపి జ్ఞాప‌కాలు మిగిల్చి ఈ రోజు నువ్వు వెళ్లిపోయావు.

నీవు లేవ‌ని అంతా చెబుతున్నా నాకు మాత్రం ఎప్పుడూ నాలోనే ఉంటావ‌ని తెలుసు. స్నేహం అంటే ఎలా ఉంటుంది అని ఎవ‌రైనా అడిగితే అది మ‌న‌లాగే ఉంటుంద‌ని చూపిస్తాను.. అంత గొప్ప స్నేహాన్ని నువ్వు నాకు ఇచ్చావు. ప్రతీ చిన్న విష‌యంలోనూ తోడుగా ఉన్న నువ్వు.. ఈ రోజు ఇలా న‌న్ను ఒంట‌రి చేసి వెళ్లిపోవ‌డం బాధ‌గానే ఉన్నా.. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ.. నీ ప్రాణ స్నేహితుడు’ అంటూ మోహ‌న్ బాబు అంబరీష్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. (కన్నడ నటుడు అంబరీశ్‌ ఇక లేరు)

దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు : కృష్ణం రాజు
మరో సీనియర్‌ హీరో కృష్ణంరాజు కూడా అంబరీష్ మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ‘చిరకాల మిత్రుడు, కన్నడ రెబెల్ స్టార్ అంబరీష్ ఆకస్మిక మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది.అంబరీష్ మరణం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. అంబరీష్ గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మృతిపట్ల వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’నన్నారు కృష్ణంరాజు.

మరిన్ని వార్తలు