కల్యాణ వైభోగమే...

19 Aug, 2016 23:49 IST|Sakshi
కల్యాణ వైభోగమే...

‘గురువారం మార్చి ఒకటి.. సాయంత్రం ఫైవ్ ఫార్టి తొలిసారిగా చూశానె నిన్ను..’ అని ‘దూకుడు’లో మహేశ్‌బాబు-సమంత కాంబినేషన్‌లో వచ్చిన పాట గుర్తుండే ఉంటుంది. మరి.. అనుకృతీ శర్మను నటుడు జేడీ చక్రవర్తి తొలిసారి ఎప్పుడు చూశారో తెలియదు కానీ, గురువారం ఆగస్టు పద్దెనిమిదిన పెళ్లి చేసుకున్నారు. అలాగే, వరుణ్ సందేశ్, వితాకా శేరుల వివాహం కూడా అదే రోజు జరిగింది.
 
  సీనియర్ నటుడు జేడీ.. తన  కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటే, యువనటుడు వరుణ్ మాత్రం వైభవంగానే చేసుకున్నారు. పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా, ‘ఏం ఆలోచించడంలేదు’ అని చెప్పుకుంటూ వచ్చారు జేడీ. అనుకృతీతో ప్రేమలో పడి, కుటుంబ సభ్యులను ఒప్పించి, పెళ్లి చేసుకున్నారు. రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించిన ‘శ్రీదేవి’ చిత్రంలో అనుకృతి కథానాయికగా నటించాల్సి ఉంది.

శ్రీదేవి జీవితం ఆధారంగా ఆ సినిమా తీస్తానని వర్మ ప్రకటించడం, ఆ చిత్రం కొన్ని వివాదాలు ఎదుర్కోవడం, చివరికి ప్రారంభం కాకుండానే ఆగిపోవడం తెలిసిందే. ఏదైతేనేం అనుకృతీకి బోల్డంత పాపులార్టీ వచ్చింది. ఇక.. వరుణ్, వితికాల గురించి చెప్పాలంటే ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రంలో జంటగా నటించిన సమయంలో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించారు. గత ఏడాది డిసెంబర్ 7న  వీరి ఎంగేజ్‌మెంట్ అయింది. గురువారం ఒకింటివారయ్యారు. ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా