సభ్యత్వ నమోదులో విజయ్‌ అభిమానులు

7 Feb, 2018 07:18 IST|Sakshi
హీరో విజయ్‌

నూతన వెబ్‌సైట్‌ ప్రారంభం

తమిళసినిమా: తమిళనాడులో దాదాపు సినీ నటులే ప్రభుత్వాన్ని పాలించారు. తాజాగా నట దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్‌ సొంతంగా రాజకీ య పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని రజనీ ఇప్పటికే వెల్లడించారు. కమలహాసన్‌ ఈ నెల 21న పార్టీ పేరు, జెండా, అజెండానూ వెల్లడించి భారీ బహిరంగ సమావేశంతో ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. మరో పక్క నేను సైతం అన్నట్లు విశాల్‌ తన చేతలతో రాజకీయ ప్రవేవం చేయనున్నట్టు చెప్పకనే చెబుతున్నారు.

వీరందరి కంటే ముందే నటుడు విజయ్‌ రాజకీయాలపై ఆసక్తి కనబరచారన్నది నిజం. అందుకు తన అభిమాన సంఘాన్ని ప్రజాసంఘంగా మార్చా రు కూడా. తద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఆయన తండ్రి దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ తన కొడుకు రాజకీయాల్లో వస్తారని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. విజయ్‌ నటించిన పలు చిత్రాలు విడుదల సమయంలో రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నాయి. అందుకు కారణం విజయ్‌ను రాజకీయాల్లోకి రానీయకుండా అణగదొక్కలన్నదే అనే ప్రచారం సాగింది. అయితే ఇటీవల విజయ్‌ రాజకీయాల మాట ఎత్తడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో రజనీ, కమల్‌ అభిమానులు ఎవరి పరిధిలో వారు ప్రజలను తమ పార్టీ సభ్యులుగా చేర్చుకునే పనిలో మునిగిపోయారు. ఈ సెగ విజయ్‌ అభిమానుల్లోనూ తగిలింది. విజయ్‌ ప్రజా సంఘం పేరుతో నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించి తద్వారా ప్రజలను సభ్యులుగా చేర్చే పనికి అభిమానులు శ్రీకారం చుట్టారట. దీని గురించి విజయ్‌ అభిమాన సంఘం నిర్వాహకుడు ఒకరు మాట్లాడుతూ తమ హీరోకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఎప్పుడైనా రాజకీయరంగ ప్రవేశం గురించి వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. అందుకే తాము సభ్యత్య నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. 

మరిన్ని వార్తలు