సక్సెస్‌ బాంబ్‌ ఎవరిది?

30 Aug, 2019 01:50 IST|Sakshi
‘బిగిల్‌’లో విజయ్‌, ‘సంగ తమిళన్‌’లో విజయ్‌ సేతుపతి ∙‘ఖైదీ’లో కార్తీ

ఈ ఏడాది దీపావళికి జోరుగా పేలడానికి మూడు బాంబు ( తమిళ సినిమా)లు రెడీ అవుతున్నాయి. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా విజయ్, ఖైదీగా కార్తీ, రాజకీయ నాయకుడిగా విజయ్‌ సేతుపతి.. ఈ ముగ్గురు హీరోలు దీపావళి బరిలో నిలిచారు. వీరి చిత్రాలతో పాలు పండక్కి ఇంకెన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. ప్రస్తుతం ఈ మూడు చిత్రాల వివరాల్లోకి వెళితే...

గత రెండేళ్లుగా దీపావళికి తన సినిమా విడుదలయ్యేలా చూసుకున్నారు విజయ్‌. 2017లో ‘మెర్సెల్‌’ (తెలుగులో ‘అదిరింది’), 2018లో ‘సర్కార్‌ చిత్రాలతో దీపావళికి తెరపై సందడి చేశారు. ఈ దీపావళిని కూడా ఆయన మిస్‌ కావడంలేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘బిగిల్‌’ సినిమాను దీపావళి విడుదలకు రెడీ చేశారు. విజయ్‌తో ఇదివరకు ‘తేరి, మెర్సెల్‌’ వంటి హిట్‌ సినిమాలను తీసిన అట్లీ ఈ ‘బిగిల్‌’ సినిమాకు దర్శకుడు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఫుట్‌బాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్లు అర్థం అవుతోంది.

ఈ సినిమాకు విజయ్‌ సుమారు 150 రోజులు కాల్షీట్స్‌ ఇవ్వగా ఆల్రెడీ ఈ సంఖ్య 200 దగ్గరకు చేరుకుంది. దీన్నిబట్టి రాజీ అనేది లేకుండా కాకుండా ఎంత శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇక ఇటీవలి కాలంలో కోలీవుడ్‌లో మంచి స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవడంలో సూపర్‌ సక్సెస్‌ అయ్యారు విజయ్‌ సేతుపతి. కేవలం హీరోగానే కాదు వీలు చిక్కినప్పుడల్లా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అవతారం కూడా ఎత్తి ఆడియన్స్‌ మనసు దోచుకునే పాత్రలు చేస్తున్నారు.

విజయ్‌ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘సంగ తమిళన్‌’. ‘స్కెచ్‌’ ఫేమ్‌ విజయ్‌ చందర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి రాజకీయ నాయకుడి పాత్రలో నటించారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కూడా దీపావళికే విడదుల కానుంది. ‘బిగిల్‌’లో విజయ్‌ రెండు పాత్రలు చేశారనే ప్రచారం జరుగుతున్నట్లుగానే ‘సంగ తమిళన్‌’లో విజయ్‌ సేతుపతి కూడా డ్యూయల్‌ రోల్‌ చేశారనే ప్రచారం జరుగుతోంది.

ఇక దీపావళికి వస్తున్న మరో హీరో కార్తీ. ‘ఖైదీ’ చిత్రంతో ఆయన పండక్కి తెరపై కనిపించబోతున్నారు. ‘మానగరం’ సినిమాతో ఆడియన్స్‌ను మెప్పించిన లోకేష్‌ కనగరాజన్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనింగ్‌ చిత్రం ఇది. ఈ సినిమాలో హీరోయిన్‌ లేకపోవడం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇలా మూడు సినిమాలు ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. మరి.. మూడు బాంబుల్లో మూడూ దిగ్విజయంగా పేలి, వసూళ్ల సౌండ్‌ బలంగా వినిపిస్తే ఇండస్ట్రీకి మంచిదే. మరి ఎవరిది సక్సెస్‌ బాంబ్‌ అవుతుందో వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా