హిట్లర్ బలహీనత చుట్టూ అల్లుకున్న కథ | Sakshi
Sakshi News home page

హిట్లర్ బలహీనత చుట్టూ అల్లుకున్న కథ

Published Wed, Apr 6 2016 10:21 PM

హిట్లర్ బలహీనత చుట్టూ అల్లుకున్న కథ - Sakshi

హాలీవుడ్ సినిమా / ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్

 

క్వైంటిన్ టొరంటినో సినిమాలంటేనే విపరీతమైన యాక్షన్, హింస, రక్తపాతంతో నిండి ఉంటాయి. నిజం చెప్పాలంటే ‘గన్‌స్మోక్’ అనే క్రైమ్ సీరియల్‌లోని ఓ పాత్ర పేరు (క్వింట్ అస్పర్) ఆధారంగానే క్వైంటిన్ అని అతనికి పేరుపెట్టారు.  పోర్న్ థియేటర్‌లో పనిచేసినా, వీడియో రెంటల్ షాప్ నిర్వహించినా, అతని దృష్టంతా సినిమాల మీదే. ‘ట్రూ రొమాన్స్’ సినిమాకి స్క్రీన్‌ప్లే రాసినా, దర్శకుడిగా ‘రిజర్వాయర్ డాగ్స్’, ‘పల్ప్ ఫిక్షన్’, ‘జాకీ బ్రౌన్’, ‘కిల్ బిల్’, ‘డిజాంగో అన్‌చెయిన్డ్’, ‘హేట్‌ఫుల్ ఎయిట్’ సినిమాలు తీసినా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. అలాంటి టొరంటినోని 1998 నుంచి ఓ సబ్జెక్ట్, 1978 నుంచి ఓ టైటిల్ ‘ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ (ఇటాలియన్ సినిమా)’ వెంటాడసాగాయి. హిట్లర్ మీద హత్యా ప్రయత్నంతో సినిమా తీద్దామనుకున్నాడు టొరంటినో. ’98లోనే కథ రాయడం మొదలుపెట్టాడు. కాని క్లైమాక్స్ సంతృప్తికరంగా దొరకలేదు. పక్కన పడేసినా, మనసులో నుంచి ఆ సబ్జెక్ట్ మాయం కాలేదు.

 

స్క్రిప్టు లీకయింది!
ప్రపంచాన్ని గడగడలాడించి, యూదులను జాతి పేరిట ఊచకోత కోసి, మారణహోమం సృష్టించిన హిట్లర్‌కి ఓ పిచ్చి ఇష్టం ఉంది. జర్మనీ దేశపు గొప్పతనాన్ని, తన గొప్పతనాన్ని చాటి చెప్పే డాక్యుమెంటరీ చిత్రాలంటే హిట్లర్‌కి విపరీతమైన అభిమానం. ప్రజలని చేరుకోవడానికి, ఆకర్షించడానికి ఫిల్మ్ మీడియా శక్తిమంతమైన సాధనంగా ఆ రోజుల్లోనే నమ్మాడు హిట్లర్. కొన్ని ప్రచార చిత్రాల్లో తనే స్వయంగా నటించాడు కూడా. ఆ బలహీనత ఆధారంగా కథలోని ఓ మలుపుని అల్లుకున్నాడు టొరంటినో. 2002 నాటికి - అంతవరకూ హాలీవుడ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన సినిమాల కన్నా భారీగా తీయాలనుకున్నాడు. 2005లో నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించాడు. 2008లో షూటింగ్‌కి శ్రీకారం చుట్టాడు. ఈలోగా సినిమా స్క్రిప్ట్ మొత్తం నెట్‌లో లీకయ్యింది. ఇక అభిమానులు, విమర్శకులు ఎవరికి తోచిన సలహాలు, విమర్శలు వాళ్లు ఇచ్చేవారు. ఇలాంటి ఆటంకాలన్నీ పక్కకు పెట్టి సినిమా మీదే దృష్టి నిలిపాడు టొరంటినో. జర్మనీ-అమెరికా దేశాల నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. 70 మిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మాణమైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 322 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది.

 

ఇదీ కథ
యూదులు ఏ మారుమూల దాక్కున్నా వెతికి, దారుణంగా చంపే కిరాతకుడు హేన్స్ లాండా. జర్మనీ ఫ్రాన్స్ దేశాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో ఓ పల్లెటూరు చేరుకుంటాడు లాండా. అతని దృష్టిని తప్పించుకుని ఒకే ఒక్క యూదు కుటుంబం ఆ ఊళ్లో బతికి ఉంటుంది. ఓ రైతు ఇచ్చిన సమాచారంతో నేలమాళిగలో దాక్కున్న యూదు కుటుంబాన్ని (డ్రైఫ్వూస్ ఫ్యామిలీ)ని కిరాతకంగా చంపేస్తాడు లాండా. డ్రైఫ్వూస్ కుమార్తె షోసన్నా మాత్రం తప్పించుకుంటుంది.

 
షోసన్నా ధ్యేయం ఒక్కటే - తన కుటుంబాన్ని చంపిన కల్నల్ లాండాని, వీలైతే అతని పైఅధికారుల్ని, హిట్లర్‌తో సహా చంపాలనేది. (క్వైంటిన్ సక్సెస్‌ఫుల్ ఫార్ములాయే పగ ప్రతీకారాలు కదా!) షోసన్నా ప్యారిస్ చేరుకుని ఓ సినిమా థియేటర్‌లో పనిచేస్తుంటుంది. ఒకే యుద్ధంలో రెండొందల యాభై మందికి పైగా సైనికులను చంపిన ఓ జర్మన్ సైనికుడు షోసన్నాకి తగులుతాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ జర్మన్ సైనికుడు ఫ్రెడరిక్ జోలర్ వీరోచిత గాథ ఆధారంగా నాజీలు ఓ ప్రచార చిత్రం నిర్మిస్తారు. ఆ సినిమా ప్రీమియర్‌ని షోసన్నా థియేటర్‌లోనే వేయాలని, ఆ షోకి నాజీ ప్రముఖులంతా రావాలని హిట్లర్ ప్రచార కర్త అయిన గోబెల్స్‌ని ఒప్పిస్తాడు ఫ్రెడరిక్.



సినిమా తెరని తగలబెట్టి వాళ్లందరినీ చంపడానికి ప్లాన్ చేస్తుంది షోసన్నా. మరోవైపు లెఫ్టినెంట్ అల్డో రెనె అనేవాడికి నాజీలంటే విపరీతమైన ద్వేషం. అమెరికన్, యూదు సైనికులని కలిపి, బాస్టర్డ్స్ అనే బృందంగా ఏర్పరుస్తాడు. జర్మన్ సైనికులని అత్యంత పాశవికంగా చంపడమే ఈ బాస్టర్డ్స్ ధ్యేయం! (మెడ దగ్గర కాకుండా చెవుల పైన డిప్ప దగ్గర తల నరికే దృశ్యాలు బీభత్సంగా, భయానకంగా ఉంటాయి). పదమూడు మంది గైసోసో అధికారులను చంపిన ఓ జర్మన్ సైనికుడు హ్యాగో స్టిగ్లిట్జ్‌ని కూడా తమ బృందంలో చేర్చుకుంటారు. అయితే అతను జర్మన్ అనే విషయం గుర్తుండేలా హ్యాగో నుదుటి మీద స్వస్తిక్ ముద్ర వేస్తాడు రెనె. ఈ బాస్టర్డ్స్ బృందంలోని అర్బీ హికాక్స్, జర్మన్ నటి బ్రిగెట్ వాన్‌ని కలుస్తాడు. అయితే ఓ జర్మన్ అధికారికి అనుమానం రావడంతో వాళ్లు ఉన్న రెస్టారెంట్‌లో కాల్పులు జరుగుతాయి. ఆ హీరోయిన్ ద్వారా హిట్లర్ ప్రీమియర్ షోకి వస్తున్నాడని బాస్టర్డ్స్ లీడర్ రెనెకి తెలుస్తుంది.

 

హిట్లర్ తదితరులని చంపడానికి బాస్టర్డ్స్ కూడా అదే థియేటర్‌ని వేదికగా చేసుకుంటారు. లాండా రెస్టారెంట్‌లో దొరికిన హీరోయిన్ షూతో తన అన్వేషణ కొనసాగిస్తాడు. థియేటర్‌లో జరగబోతున్న హత్యాపథకం లాండాకి తెలుస్తుంది. ఆశ్చర్యకరంగా లాండా రెనెతో చేతులు కలుపుతాడు.

 

థియేటర్‌లో షో ప్రారంభమవుతుంది. ఫ్రెడరిక్.. షోసన్నాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అతడ్ని చంపేస్తుంది. ఫ్రెడరిక్ చనిపోతూ షోసన్నాని చంపేస్తాడు. సినిమా చివరికొస్తుంది. తెరపై షోసన్నా ప్రత్యక్షమౌతుంది. ఓ యూదు చేతిలో వాళ్లందరి చావు రాసిపెట్టి ఉందని ఆనందంగా ప్రకటిస్తుంది. తెరలోని నైట్రేడ్ ఫిలిమ్‌ని ఆపరేటర్ మార్సెల్ తగలబెడతాడు. థియేటర్‌లో అగ్నిప్రమాదం - కొద్దిలో హిట్లర్ తప్పించుకుంటాడు. మిగిలినవారందరూ చనిపోతారు. లాండా రెనెకి లొంగిపోతాడు. అతని నుదుటిమీద ముద్ర వేసి, ‘నా మాస్టర్ పీస్ ఇదే’ అంటాడు బాస్టర్డ్స్ లీడర్ రెనె. బహుశా క్వైంటిన్ టొరంటినో తన సినిమాల్లో ఇదే మాస్టర్ పీస్ అని చెప్పడానికి కూడా ఈ మాట వాడి ఉంటాడు.

 

లాండా పాత్రలో నటించిన ఆస్ట్రియా దేశ నటుడు క్రిస్టోఫర్ వాల్జ్‌కి కాన్స్ ఫిలిమ్స్ ఫెస్టివల్ (2009)లో ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడి అవార్డ్ లభించింది. {బాడ్‌పిట్ రెనె పాత్రలో అద్భుతంగా నటించాడు. {ఫెడరిక్ ఫోర్సిల్ రాసిన ‘ది డే ఆఫ్ ది జాకాల్’ ఆధారంగా హాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయి. మళయాళంలో మమ్ముట్టి హీరోగా ‘ఆగస్ట్ 1’ అనే సినిమా (తెలుగులో అక్కినేని, కృష్ణల ‘రాజకీయ చదరంగం’) వచ్చింది. పెరేడ్‌లో ముఖ్యమంత్రిని ప్రొఫెషనల్ కిల్లర్ చంపడానికి ప్రయత్నించడం ఆ సినిమా క్లైమాక్స్. అయితే 2001లో ఇదే కథని మమ్ముట్టి హీరోగా షాజీ కైలాష్ ‘ఆగస్ట్ 15’ పేరిట రీమేక్ చేశాడు. ‘ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్’ ప్రేరణతో ‘ఆగస్ట్ 15’ సినిమాలో ముఖ్యమంత్రిని కిల్లర్ ప్రివ్యూ థియేటర్‌లో చంపడానికి ప్లాన్ చేసినట్లు క్లైమాక్స్ డిజైన్ చేశారు దర్శకుడు షాజీ కైలాష్.    క్వైంటిన్ టొరంటినో సినిమాలని కాపీ కొట్టకుండా ఉండటం కష్టం!

 

 - తోట ప్రసాద్

 

Advertisement
Advertisement