ఏకగ్రీవం చేయాలనుకున్నాం: నాగబాబు

17 Apr, 2015 13:06 IST|Sakshi
ఏకగ్రీవం చేయాలనుకున్నాం: నాగబాబు

మా అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ముందునుంచి భావించినట్లు మా సీనియర్ సభ్యుడు, నటుడు నాగబాబు తెలిపారు. తాము జయసుధకు వ్యతిరేకం కాదని.. అయితే నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించి ఆయనకు మద్దతు తెలిపామన్నారు.

ఈ ఎన్నికలు ప్రతిసారీ ఏకగ్రీవంగా, ఏకపక్షంగా జరిగేవని, అయితే ఈసారి మాత్రం అలా జరగకూడదని భావించినట్లు నాగబాబు చెప్పారు. రాజేంద్రప్రసాద్ గెలవాలని కోరుకున్నాను గానీ.. చివరకు ఎవరు గెలిచినా మంచిదేనని భావించినట్లు నాగబాబు అన్నారు.

మా సభ్యత్వ రుసుము తగ్గించాలని, ఇది చాలామందికి దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. ఈ రుసుము ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలుందని, ఎక్కువమంది సభ్యులు చేరేలా చూడాలని తెలిపారు. పేద, వృద్ధ కళాకారులకు పింఛను అందించాలని, కనీసం 50-60 మంది వరకు ఇవ్వాలని అన్నారు. అలాగే మెడిక్లెయిమ్ సదుపాయం కూడా అవసరమని.. ఈ మూడూ తప్పనిసరిగా చేసి తీరాలని నాగబాబు ఆకాంక్షించారు.

మా ఎన్నికల సందర్భంగా తొలి దశలో జరిగిన కొన్ని పరిణామాలు తమకు మనస్తాపం కలిగించినా, కోర్టు వరకు వెళ్లాలన్న ఆలోచన రాలేదని నాగబాబు తెలిపారు. అయితే ఈ పరిణామాలు మరో నటుడు ఓ కళ్యాణ్కు నచ్చకపోవడంతో ఆయన కోర్టుకు వెళ్లారని తెలిపారు.