నాన్నతో దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా!

24 Jan, 2017 23:26 IST|Sakshi
నాన్నతో దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా!

– దర్శకుడు రాజమౌళి
‘‘తాతగారు సంపాదించిన ఆస్తులన్నీ పోయిన తర్వాత పెదనాన్నగారు (శివశక్తి దత్తా), నాన్నగారు (విజయేంద్రప్రసాద్‌) ఘోస్ట్‌ రైటర్స్‌గా డబ్బులు సంపాదించేవారు. రైటర్స్‌గా వారి పేర్లు  ఎప్పుడు తెరపై పడతాయా? అని ఎదురు చూసేవాణ్ణి. చాలా సంవత్సరాల తర్వాత ‘జానకిరాముడు’ సినిమాకు వారి పేర్లు తెరపై పడ్డప్పుడు నాకు గర్వంగా అనిపించింది’’ అని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మించిన చిత్రం ‘శ్రీవల్లీ’. ఎం.ఎం. శ్రీలేఖ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని రాజమౌళి విడుదల చేసి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఇచ్చారు.

రాజమౌళి మాట్లాడుతూ– ‘‘రెండు వారాల గ్యాప్‌లో ‘బాహుబలి’, ‘భజరంగీ భాయ్‌జాన్‌’ వంటి హిట్స్‌ ఇచ్చిన రచయితగా నాన్నగారికి పేరు వచ్చినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. రైటర్‌గా నాన్న ఎంత గొప్పవారో తెలుసు. డైరెక్టర్‌గా సినిమాను అంత గొప్పగా తీసినప్పుడు కొడుకుగా గర్వపడతా. నా సినిమాల్లో నాన్న తప్పలు వెతుకుతుంటారు. ‘శ్రీవల్లీ’ విషయంలో కొడుకుగా గర్వపడ్డా, డైరెక్టర్‌గా నాన్నతో దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘మా చిత్రంలో స్టార్ట్స్, డ్యాన్సులు, ఫైట్స్‌ లేకున్నా మంచి కథ, గ్రాఫిక్స్‌ ఉన్నాయి.

ఏ వ్యక్తీ పుట్టుకతో చెడ్డవాడు కాదు. పరిస్థితుల ప్రభావంతో మారతాడు. దానికి కారణం మనసే. ఆ మనసును మనం చూడగలిగితే మనలోని ఎన్నో సిండ్రోమ్స్, ఫోబియోలను దూరం చేయవచ్చు. మానవాళిని గొప్పగా మార్చవచ్చు అనే నేపథ్యంలో ఉంటుందీ చిత్రం. ఓ మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు విజయేంద్ర ప్రసాద్‌. దర్శకుడు కొరటాల శివ, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, శివశక్తి దత్తా, నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.