స్వరమే ఇం‘ధనం’

3 Nov, 2019 09:30 IST|Sakshi

వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టు కెరీర్‌పై యువత మొగ్గు

వినసొంపైన స్వరం ఉంటే దూసుకుపోవచ్చు

వాయిస్‌ అరువిచ్చే వారు.. వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టులు. డాక్యుమెంటరీలు, ప్రకటనలు, రైల్వే స్టేషన్‌లలో, బస్‌ స్టాపుల్లో వినిపించే ఆడియోలు, వీడియోలు, రేడియోల్లో.. తెర వెనకాల నుంచి వచ్చే వినసొంపైన గాత్రం ప్రేక్షకుల మదిని గెలుస్తోంది. ఈ తియ్యటి గొంతుకలు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంటున్నాయి. ఇదే ఇప్పుడు ఎంతోమందికి కెరీర్‌ మార్గంగా మారుతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో డిజిటల్‌ కంటెంట్‌ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా అంతే స్థాయిలో వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టులకు అవకాశాలు లభిస్తున్నాయి. వినసొంపైన స్వరం, మాటల్లో స్పష్టత, భాషపై పట్టు, గొంతుకలో వైవిధ్యం ప్రదర్శించగలిగితే చాలు..‘వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌’గా రాణించొచ్చు.

స్వరాల సవరింపు
ముఖ్యంగా వినసొంపైన, విలక్షణమైన స్వరం ఉన్నవారికి ఈ కెరీర్‌ నప్పుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎంచుకున్న భాషపై ప్రావీణ్యత తప్పనిసరి. ఉచ్ఛారణ కచ్చితంగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి తప్పులు దొర్లకుండా డైలాగ్‌ డెలివరీ చెప్పగలగాలి. అన్నిటికంటే ముఖ్యంగా స్వరాలను క్యారెక్టర్‌కు తగిన విధంగా సవరించుకోవాలి. ఉదాహరణకు డాక్యుమెంటరీకి చెప్పే వాయిస్‌ ఓవర్‌కు, కార్టూన్‌లకు చెప్పే వాయిస్‌ ఓవర్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి పాత్రకు తగ్గట్టు వాయిస్‌ను మాడ్యులేట్‌ చేసుకునే నైపుణ్యం ఉండాలి. చేసే ప్రాజెక్టుకు తగ్గట్లు యాసను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. యానిమేషన్‌లో బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా భావోద్వేగాలను పండించడానికి లిప్‌ సింక్రనైజేషన్‌ చాలా అవసరం. చుట్టు పక్కల వారిని గమనిస్తూ విభిన్నమైన మాట తీరును అర్థం చేసుకోగలగాలి. 

సాధనకు మించిందిలేదు
వాయిస్‌ ఒవర్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగేందుకు ప్రాక్టీస్‌కు మించిన సాధనం మరొకటి లేదు. డెమో టేపులలో వాయిస్‌ రికార్డింగ్‌ చేసుకొని వినడం ద్వారా.. వాయిస్‌ క్లారిటీ, డిక్షన్, డైలాగ్‌ డెలివరీ, టోన్, ఎమోషన్‌లలో దొర్లిన తప్పులను గుర్తించవచ్చు.   

విద్యార్హతలు
వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా మారేందుకు మన దేశంలో ప్రత్యేకమైన కోర్సులంటూ ఏమీ లేవు. అయితే కొన్ని ఫిలిం ఇన్‌స్టిట్యూట్లు మాత్రం వాయిస్‌ సంబంధిత సర్టిఫికేషన్‌లు నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. కానీ, ఫొనెటిక్స్‌ కోర్సులు చేసినవారు గొంతును అరువిచ్చే కళాకారులుగా కెరీర్‌లో రాణించొచ్చు. సాధారణంగా ఆర్టిస్టులకు అడిషన్స్‌ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే అవకాశం లభిస్తుంది. 

అవకాశాలు
టీవీ ప్రకటనల్లో కనిపించే కళాకారులకు గొంతును అరువిచ్చేందుకు వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. కాబట్టి ప్రకటనల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. కార్పొరేట్‌ వీడియోలు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు, రేడియో ప్రకటనల తయారీలో వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టులకు అవకాశం లభిస్తుంది. టీవీ సీరియళ్లు, వార్తా ఛానళ్లు, ఎఫ్‌ఎం రేడియోలలో కూడా డిమాండ్‌ ఉంది. ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతుండటంతో.. పోడ్‌కాస్ట్స్, ఈ–లెర్నింగ్‌ యాప్స్‌లో వివరించే వారు, ఆడియో బుక్స్, ఐవీఆర్‌కు వాయిస్‌ ఓవర్, వాయిస్‌ మెయిల్‌ మొదలైన వాటిల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వాయిస్‌ ఓవర్‌ డబ్బింగ్‌కు కూడా ప్రాధాన్యం కనిపిస్తోంది. టీవీ, వెబ్, రేడియో, అడ్వర్టయిజ్‌మెంట్, కార్పొరేట్‌ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్‌ వంటి వాటిల్లో వాయిస్‌ ఓవర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టులకు అవకాశాలు లభిస్తాయి.

వేతనాలు

  • మన దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ కెరీర్‌ను ఎంచుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వీరు ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగులుగా రాణించవచ్చు. వీరికి వేతనాలు సైతం ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. ప్రాజెక్ట్‌ను బట్టి రెమ్యూనరేషన్‌ అందుతుంది. ఎపిసోడ్స్‌ ఆధారంగా జీతాలు చెల్లిస్తున్నారు. 
  • పని చేస్తున్న ప్రాజెక్టును బట్టి రోజుకు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు సంపాదించుకోవచ్చు. డాక్యుమెంటరీలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అందుకోవచ్చు. డబ్బింగ్‌ ఆర్టిస్టులు కూడా చక్కటి వేతనాలు దక్కించుకోవచ్చు. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే ఒక ఎపిసోడ్‌కు సంక్లిష్టత, క్యారెక్టర్‌ను బట్టి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అందుతుంది.
  • సినిమాల్లో మంచి బడ్జెట్‌ ఫిలింలో క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ చెబితే రూ.1 లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు తీసుకోవచ్చు. ఒకసారి సక్సెస్‌ అయిన గొంతుకు మళ్లీమళ్లీ అవకాశం లభిస్తుంది.

స్వరం.. జాగ్రత్త
ఈ రంగంలో రాణించాలంటే.. గొంతును (స్వరం) జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అందుకోసం ఆరోగ్యంగా ఉండేందుకు యోగాసనాలు, ధ్యానంతోపాటు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. చల్లని పదార్థాలు, పానీయాలు, చాక్లెట్లు, పికిల్స్, చిల్లీస్‌కు దూరంగా ఉండాలి.

మాడ్యులేషన్‌ ముఖ్యం
వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా రాణించాలనుకునే వారు వాయిస్‌ మాడ్యులేషన్స్‌పై అవగాహన పెంచుకోవాలి. నైపుణ్యాలుంటే.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా రాణించే అవకాశం లభిస్తుంది. రేడియో, టీవీ, మీడియా హౌసెస్‌ తమ అవసరాల మేరకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకుంటున్నాయి. పదాలపై పట్టు ఉన్నవారు వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టులుగా రాణించవచ్చు. వీరికి ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉంటోంది.–సునిత ఆర్‌జే, 91.1

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు