ఏటీఎం కోసం పరుగో పరుగు!

28 Mar, 2019 03:58 IST|Sakshi

జాతినుద్దేశించి మోదీ ప్రసంగంపై మోతెక్కిన ట్వీట్లు

బుధవారం జాతినుద్దేశించి తాను చేసే ప్రసంగానికి సంబంధించి ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు విపరీతంగా స్పందించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రధాని ట్వీట్‌కు 20,663 రీట్వీట్‌లు, 57,674 లైక్‌లు, 15,000 కామెంట్లు వచ్చాయి. బుధవారం ఉదయం 11.23 గంటలకు ప్రధాని మోదీ తన ట్విటర్‌ నుంచి ‘ఈ రోజు పదకొండు ముప్పావు, పన్నెండు గంటల మధ్య నేను జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నాను. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. టీవీ, రేడియో, సామాజిక మాధ్యమాల్లో నా ప్రసంగాన్ని చూడండి’అని ట్వీట్‌ చేశారు. పలువురు నేతలు నెటిజన్లు వెంటనే స్పందించారు.  

► దేశంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తారని, దావూద్‌ ఇబ్రహీంను వెనక్కి తీసుకొచ్చినట్లు చెపుతారని, మసూద్‌ అజార్‌ను చంపేశా మని ప్రకటిస్తారని.. ఇలా వందల ట్వీట్లు వచ్చాయి.  

► మోదీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారంటూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు.

► 2016, నవంబర్‌ 8న మోదీ ఇలాగే పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు జాతినుద్దేశించి ప్రసంగంలో ప్రకటించారు. దాన్ని ప్రస్తావిస్తూ ఒక ట్విటర్‌ ‘మోదీజీ కొంచెం ఆగండి.. ఏటీఎం నుంచి రూ.100 నోట్లు డ్రా చేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశాడు.  

► ‘మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. నేను ఇప్పటికే ఏటీఎం దగ్గరికొచ్చా’అని అమీర్‌ పఠాన్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశాడు.  

► ‘కేజ్రీవాల్‌ ఊహించినట్టే మోదీ దేశంలో ఎన్నికలపై నిషేధం ప్రకటించనున్నారు’ అని మరో వ్యక్తి ట్వీట్‌ చేశాడు.

► ‘ ఓ మైగాడ్‌. అందరూ ఏటీఎంలవైపు పరుగెడుతున్నారు’ అని ఇంకొకరు ట్వీట్‌ చేశారు.

► ‘మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తానన్నపుడల్లా అవినీతిపరులందరికీ గుండెపోటు వస్తోంది’ అన్నది మరో ట్వీట్‌.

► మోదీ ప్రసంగం ప్రకటన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు బీపీ తెప్పిస్తోందనే క్యాప్షన్‌తో ‘ఇమ్రాన్‌ బీపీ చెక్‌ చేసుకుంటున్న ఫొటో’ మరొకరు ట్వీట్‌ చేశారు.
 

► మరొకరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటిం చినప్పటి ఫొటోను బ్లాగ్‌లో పెట్టారు.

► చివరికి మోదీ చెప్పిన సమయానికి 26 నిమిషాలు ఆలస్యంగా ప్రసంగం మొదలెట్టారు. భారతదేశం చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం గురించి ఆయన చెప్పారు. ఇదే ప్రధాని మోదీ చెప్పిన ‘ఆశ్చర్యకరమైన’విషయం.

మరిన్ని వార్తలు