ఆ ఆస్పత్రి మృత్యు కుహరం..

2 Sep, 2017 11:40 IST|Sakshi

♦ 40 ఏళ్లలో 25వేల మంది చిన్నారుల మృతి
♦ నేటికి కొనసాగుతున్న వైనం
♦ పాలకులు మారినా మారని తీరు
♦ వైద్యుల నిర్లక్ష్యం తల్లిదండ్రులకు శాపంగోరఖ్‌పూర్‌ అంటే మృతి చెందుతున్న పసిబిడ్డలు గుర్తుకు వస్తారు. ఒకరు..ఇద్దరు.. వందలు కాదు.. వేల సంఖ్యలో ఇక్కడ చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకూ మృతుల సంఖ్య 1400 వరకూ ఉంది. అదే గత 40 ఏళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఎంతో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది.

గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ​దాస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో ఆగస్టు నెల్లో 60 మంది చిన్నారులు ఒక్కసారిగా మృతిచెందారు. ఈ ఘటనపై దేశమంతా స్పందించింది. జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అప్పటినుంచే బీఆర్‌డీ ఆసుపత్రి పేరు అందరి నోళ్లలో నానుతోంది. కానీ బీఆర్‌డీలో చిన్నారుల మృతి అనేది 40 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది.సెప్టెంబర్‌ 1న కూడా..!
పిల్లల మృతుల పరంపర బీఆర్‌డీలో నేటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా సెప్టెంబర్‌ 1న కూడా ఈ ఆసుపత్రిలో 35మంది చిన్నారులు చనిపోయారు.

మొత్తం మృతులు
బీఆర్డీ ఆసుపత్రిలో గడచిన 40 ఏళ్లలో 25 వేల మంది చిన్నారులు మృతి చెందారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చనిపోయిన వారిలో అత్యధికులు మెదడు వాపుకు గురైనవారే.

చర్యలేవీ?
మెదడువాపు వ్యాధితో చిన్నారులు ఆసుపత్రిలో చేరడం సర్వసాధారణం​. ఏళ్లుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాధి ప్రబలకుండా ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే. అదే సమయంలో ఈ వ్యాధికి సంబంధించిన వైద్య సౌకర్యాలు కూడా ఇక‍్కడ పెద్దగా లేవు.    

తాజా పరిస్థితి
ప్రస్తుతం బీఆర్డీ ఆసుపత్రిలో 344మంది చిన్నారులు మెదడు వాపు, న్యుమోనియా వంటి వ్యాధులతో చేరారు. వీరికి వీలైనంత మంచి వైద్యాన్ని అందిస్తున్నామని, గతంతో పోలిస్తే మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆసుపత్రి డైరెక్టర్‌ రాజేష్‌ మణి చెబుతున్నారు.  

ధనార్జనలో డాక్టర్లు
గోరఖ్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి అధికంగా ఉండడంతో గతంలో ఇక్కడ 100 వైద్య కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే డాక్టర్లలో ధనార్జన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ వైద్యులు.. సర్కార్‌ దవాఖానాల్లో కాకుండా సొంత క్లినిక్‌లలో అధికంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ వైద్య కేంద్రాలకు పంపే మందులు, ఇతర సామగ్రిని ఆ వైద్యులు తమ సొంత క్లినిక్స్‌కు తరలించడం ప్రధాన సమస్య.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా