అమర్‌నాథ్‌ యాత్రల ఘోర విషాదం

17 Jul, 2017 04:28 IST|Sakshi
అమర్‌నాథ్‌ యాత్రల ఘోర విషాదం

- కశ్మీర్‌లో లోయలోపడ్డ బస్సు
- ఇద్దరు మహిళలు సహా 17 మంది దుర్మరణం
- 29 మందికి గాయాలు.. వారిలో 19 మంది పరిస్థితి విషమం


రంబన్‌/జమ్మూ/న్యూఢిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. జమ్మూ–కశ్మీర్‌ జాతీయ రహదారిపై యాత్రికులతో అమర్‌నాథ్‌ వెళుతున్న బస్సు రంబన్‌ వద్ద అదుపుతప్పి లోతైన లోయలో పడింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు సహా 17 మంది మరణించారు. మరో 29 మంది గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 19 మందిని ప్రత్యేక చికిత్స కోసం హెలికాప్టర్‌లో జమ్మూలోని ఆస్పత్రికి తరలించినట్టు రంబన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్పీ) మోహన్‌లాల్‌ చెప్పారు.

మృతులు ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, అస్సాం, హరియాణా, మధ్యప్రదేశ్‌లకు చెందినవారని తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ దళాలు మృతదేహాలతో పాటు గాయపడినవారిని బయటకు తీశారన్నారు. జమ్మూకశ్మీర్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (జేకేఎస్‌ఆర్టీసీ) 3,603 మంది అమర్‌నాథ్‌ యాత్రికులను ప్రత్యేక బస్సుల్లో జమ్మూ నుంచి బల్టాల్, పహల్గామ్‌ బేస్‌ క్యాంపులకు తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇందులోని ఓ బస్సు రంబన్‌ జిల్లాలోని నచ్‌లానా వద్ద అదుపు తప్పిందని, అనంతరం కొండపై నుంచి దొర్లుకుంటూ లోయలోని నీటిలో పడిందని ఎస్‌ఎస్పీ చెప్పారు. టైరు పంక్చర్‌ కావడంతో బస్సు అదుపుతప్పినట్టు తెలుస్తోంది.

మోదీ విచారం... రాజ్‌నాథ్‌ ఆరా...
బస్సు ప్రమాదంలో యాత్రికులు మరణించడం ఎంతో బాధాకరమని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా, సీఎం మెహబూబా ముఫ్తీతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనా స్థలికి వెళ్లిన వోహ్రాను అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్‌ ప్రభుత్వం యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు 0191–2560401, 0191–2542000ను ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.   

పెరిగిన ‘ఉగ్రదాడి’మృతులు...
శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై ఈ నెల 10న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న లలిత (47) ఆదివారం మృతిచెందారు. దీంతో ఈ దాడిలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగినట్టు పోలీసులు తెలిపారు. కాగా, బల్టాల్‌ బేస్‌క్యాంప్‌లో మహారాష్ట్రకు చెందిన వృద్ధుడు సదాశివ (65) శనివారం రాత్రి మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వెల్లడించారు. మొత్తం 40 రోజుల అమర్‌నాథ్‌ యాత్ర గత నెల 29న ప్రారంభమైంది. ఆగస్టు 7తో ముగుస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్టు అంచనా.

మరిన్ని వార్తలు