ఓటుకు 10 వేలు!

27 Dec, 2017 01:55 IST|Sakshi
నోట్లపై కోడ్‌ రాసి ఉన్న దృశ్యం

ఆర్కేనగర్‌లో ఎన్నికలకు ముందు రోజు టోకెన్ల పంపిణీ

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్‌  ఉపఎన్నికకు ముందు రోజు ఓటుకు రూ. 10 వేలు ఇస్తామని దినకరన్‌ అనుచరులు తమకు టోకెన్లు ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు. ఈ టోకెన్ల కోసం జరిగిన గొడవల్లో మంగళవారం పోలీసులు నలుగురు దినకరన్‌ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌కు రెండు రోజులకు ముందు కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు రూ.180 కోట్లు వచ్చాయని వ్యాపారస్తులు గుర్తించినట్లు సమాచారం.

ఈ ఎన్నికల్లో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన దినకరన్‌ అనుచరులు రూ.10 వేలకు బదులు రూ.20 నోటిచ్చి దానిపై ఉన్న కోడ్‌ రాసుకున్నారని, ఫలితాలనంతరం ఆ నోటు చూపితే డబ్బిస్తామని హామీ ఇచ్చారని ఓటర్లు వెల్లడించారు. రూ.20 నోట్లు పంచిన వారంతా ఆర్కేనగర్‌కు చెందిన వ్యక్తులే కావడంతో వ్యవహారం సజావుగా సాగింది. ఇప్పుడు ఫలితం తేలడంతో టోకెన్‌ ఇచ్చిన వాళ్లను ఓటర్లు నిలదీస్తున్నారు. కొందరు ఫోన్‌ స్విచాఫ్‌ చేయడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో టోకెన్‌ అందని కొందరికి సోమవారం వాటిని ఇస్తుండగా.. ఘర్షణ చోటు చేసుకుంది. దినకరన్‌ అనుచరులు కార్తికేయన్‌ అనే వ్యక్తిపై దాడిచేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు దినకరన్‌ అనుచరులను అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు