రానున్నది చదువుల విప్లవం | Sakshi
Sakshi News home page

రానున్నది చదువుల విప్లవం

Published Wed, Dec 27 2017 1:57 AM

ys jagan's praja sankalpa yatra - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘పేదలు వారి పిల్లల చదువు కోసం వెనుకాడకూడదన్నదే నా ఉద్దేశం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చదువుల విప్లవానికి శ్రీకారం చుడతాం. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు, పై చదువులు చదివే పిల్లల హాస్టల్‌ ఖర్చు కింద రూ.20 వేలు ఇస్తాం. పిల్లలు ఎంత పెద్ద చదువు చదివితే అంత వరకు అయ్యే ఖర్చును మన ప్రభుత్వమే భరాయిస్తుంది’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు భరోసా ఇచ్చారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం 44వ రోజు అనంతపురం జిల్లా ధనియాని చెరువు గ్రామంలో వైఎస్‌ జగన్‌ మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అక్కా చెల్లెళ్ల ప్రశ్నలు, సందేహాలకు ఆయన ఓపికగా సమాధానమిచ్చారు. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని కష్టాలు తీరుతాయన్నారు. ఏ ఒక్కరూ రేషన్‌ కార్డు కోసమో, పింఛన్‌ కోసమో, మరేదైనా సర్టిఫికెట్‌ కోసమో గడపగడపా ఎక్కాల్సిన పని లేకుండా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి 72 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

చదువుల విప్లవానికే మన కార్యక్రమాలు
మన ప్రభుత్వం వస్తే మీ బిడ్డల భవిష్యత్‌ కోసం ఏమి చేస్తుందనేది వివరిస్తా. పేద పిల్లల పెద్ద చదువుల కోసం నాన్న గారు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చి భరోసా ఇచ్చారు. చదువుల విప్లవాన్ని సృష్టించారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కరన్నా ఇంజినీరో, డాక్టరో, కలెక్టరో, మరో పెద్ద చదువో చదవాలన్నది నాన్న గారి ఉద్దేశం. నాన్నగారు చనిపోయాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోత పడింది. ఏడాదిన్నర గడిచినా ఆ సొమ్ము రాలేదని విద్యార్థులు చెబుతున్నారు.

లక్ష రూపాయల ఫీజుంటే ముష్టి వేసినట్టు రూ.30, 35 వేలు ఇస్తే మనం మిగతా రూ.70 వేలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఏ ఇల్లో, పొలమో అమ్మితే తప్ప సాధ్యం కాదు. పేద పిల్లల చదువు కోసం నాన్న గారు ఆ వేళ ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారునిగా నేను రెండడుగులు ముందుకు వేస్తున్నా. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా సరే మొత్తం ఫీజును నేనే కట్టి చదివించడమే కాకుండా మెస్‌ చార్జీలు, హాస్టల్‌ ఖర్చుల కింద ప్రతి పిల్లవాడికీ రూ.20 వేలు ఇచ్చి తోడుగా ఉంటా. మీ పిల్లల్ని ఇంజినీర్లను చేస్తారో, డాక్టర్లను చేస్తారో మీ ఇష్టం. అంటే మీరు పిల్లల్ని చదివించాలి. బడికి పంపినందుకు ప్రతి తల్లికీ రూ.15వేలు ఇచ్చి తోడుగా నిలుస్తాం.

అవ్వా తాతలకు రూ.2 వేల పింఛన్‌..
ఈ వేళ లంచాల మయమైన జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పింఛన్లు ఇస్తున్నారు. రేషన్‌ కార్డు మొదలు చివరకు మరుగుదొడ్ల వరకు అన్నింటికీ లంచాలే. మనం అధికారంలోకి రాగానే ఇప్పుడున్న పెన్షన్‌ వయస్సు 65 ఏళ్లను 60 ఏళ్లకు తగ్గిస్తాం. అందరికీ నెలకు రూ.2 వేల పింఛన్‌ ఇస్తాం. అవ్వా తాతలకు నా భరోసా ఇది. ఇక, పనికి వెళితే తప్ప పూటగడవని స్థితిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం. వైఎస్సార్‌ చేయూత పెన్షన్‌ పథకం కింద నెలకు రూ.2 వేలు ఇచ్చి ఆ అక్కా చెల్లెమ్మలకు తోడుగా నిలుస్తాం.

ఇంకా ఇలాంటి పాలన కావాలా?
చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయింది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. ఈ తరుణంలో నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. మనకు ఇంకా ఇటువంటి పాలన కావాలా? మనకు ఎటువంటి పాలన కావాలన్నది మనం మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన దానికి, ఆ తర్వాత చేసిన దానికి పొంతనే లేదు. (చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమి చెప్పారో, పత్రికల్లో ఏమేమి ప్రకటనలు ఇచ్చారో, గోడల మీద ఏమేమి రాతలు రాయించారో, పొదుపు సంఘాల మహిళలకు ఏమేమి హామీలు ఇచ్చారో టీవీ క్లిప్పింగులను ప్రదర్శించి చూపించారు) పొదుపు సంఘాల రుణాలు అన్నీ మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పటికీ ఒక్క రూపాయి మాఫీ చేయలేదు.

రుణాలు మాఫీ కాకపోగా బంగారం వేలం నోటీసులు ఇళ్లకు వస్తున్నాయి. దీంతో పాటు సున్నా వడ్డీ రుణాలు రాకుండా పోయాయి. రైతులదీ ఇదే పరిస్థితి. ఇంతకన్నా మోసం, అన్యాయం, దగా ఉంటుందేమో మీరే చెప్పండి? రాష్ట్రంలో మహిళలకు రక్షణే లేకుండా పోయింది. పట్టపగలు, నట్టనడి బజారులో తెలుగుదేశం నాయకులు ఒక అమ్మాయిని బట్టలు ఊడదీసి కొడుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏమి చేయాలి? కఠినమైన చర్యలు తీసుకుని మరొకరెవ్వరూ అటువంటి హేయమైన పనులకు పాల్పడకుండా ఉండేలా గట్టి సందేశాన్ని ఇవ్వాలి. కానీ ఈ సీఎం అటువంటి పని చేయడానికి బదులు తెలుగుదేశం నాయకుల్నే వెనకేసుకువస్తున్నారు.

ఇసుక మాఫియా దురాగతాలను అడ్డుకుందన్న సాకుతో మహిళా తహసీల్దార్‌ వనజాక్షిని నడిరోడ్డు మీద తన పార్టీ ఎమ్మెల్యే చేయి చేసుకుంటే ఆయనపై చర్య తీసుకోలేదు. రిషితేశ్వరి అనే ఓ విద్యార్థినిని ర్యాగింగ్‌ చేసి చంపేసినా నిందితుల్ని అరెస్ట్‌ చేయలేదు. పైగా చంద్రబాబు వారిని దగ్గరుండి మరీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బాబు పాలనలో జరుగుతున్న ఇటువంటి దురాగతాలను మీరే అందరికీ చెప్పాలి. మోసాలు చేయడంలో చంద్రబాబు దిట్ట కాబట్టి ఆయన చేసిన మోసాలను మీరే నలుగురికీ అర్థమయ్యేలా చేయాలి.

అక్కాచెల్లెళ్లకు ఇదే నా హామీ..
చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలు మోసాలకు గురయ్యారు. ఎన్నికలు అయిపోయిన రెండు రోజుల తర్వాత బ్యాంకులకు వెళ్లి.. మీ అప్పు ఎంత ఉందో అడిగి రశీదు తీసుకోండి. ఆ తర్వాత మన ప్రభుత్వం రాగానే ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే ఇస్తాం. బ్యాంకులకు వడ్డీ లెక్కలు కడతాం. సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం. మనం ఇచ్చే డబ్బుకు, జీరో వడ్డీ రుణాలకు సంబంధం ఉండదు.

రాష్ట్రంలో తాగడానికి మంచి నీళ్లు దొరకడం లేదు. కానీ, ఫోన్‌ కొడితే చాలు మద్యం మాత్రం హోం డెలివరీ చేస్తున్నారు. బెల్ట్‌ షాపుల్ని రద్దు చేస్తానంటూ తొలి సంతకం చేసిన చంద్రబాబు ఆ తర్వాత మర్చిపోయారు. బెల్ట్‌షాపులు ఇప్పుడు మన ఇళ్ల పక్కకే వచ్చాయి. కుటుంబాలలో అనురాగం, ఆప్యాయతలు పెంచాలన్నది మన కార్యక్రమం. మూడు దఫాలుగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం. తాగే వాళ్లందరికీ తాగుడు వల్ల జరిగే నష్టం, అనర్ధాలను వివరిస్తాం. తాగుడు మానివేసి నప్పుడు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి చికిత్స చేయిస్తాం. అవగాహన కల్పిస్తాం.

తిరిగి మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాతే మళ్లీ ఓట్లేయండని అడుగుతాం. చంద్రబాబు 4 ఏళ్ల కిందట ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. ఒక్కటీ కట్టలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తాం. ఆ ఇంటిని అక్కా చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. దాంతో ఆ ఇల్లు మీ సొంతమవుతుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి పావలా వడ్డీకి అప్పు తీసుకునేలా ఏర్పాటు చేయిస్తాం. ఇదంతా జరగాలంటే మీ అందరి ఆశీర్వాదం కావాలి’’ అని జగన్‌ కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement