తాగి బండి నడిపితే.. 25వేల జరిమానా!!

15 Sep, 2014 15:06 IST|Sakshi
తాగి బండి నడిపితే.. 25వేల జరిమానా!!

మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అయ్యేవాళ్ల మీద కొరడా ఝళిపించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకమీదట ఎవరైనా తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ. 25వేల జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష లేదా రెండూ, వాటితో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధించే అవకాశం ఉంటుంది. అదే రెండోసారి అయితే 50వేల రూపాయల జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష, లేదా రెండూ, వాటితో పాటు  ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధిస్తారు.

మూడోసారి కూడా అలా పట్టుబడ్డారో.. ఇక లైసెన్సును శాశ్వతంగా రద్దుచేయడంతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు. మోటారువాహనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్తగా మార్పుచేర్పులు చేస్తోంది. స్కూలు బస్సు డ్రైవర్లు తాగి పట్టుబడితే వారికి రూ. 50వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. దాంతోపాటు తక్షణం వాళ్ల లైసెన్సు రద్దుచేస్తారు.

ట్రాఫిక్ ఉల్లంఘనుల మీద కఠినచర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.  ప్రమాదాల్లో ఎవరైనా చిన్నపిల్లల మృతికి కారణమైతే వాళ్లకు రూ. 3లక్షల జరిమానా, కనీసం ఏడేళ్ల జైలుశిక్ష విధించాలని తలపెట్టింది. వాహనాన్ని సురక్షితం కాని పరిస్థితుల్లో ఉపయోగిస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష లేదా రెండూ విధించొచ్చట. ట్రాఫిక్ సిగ్నళ్లను మూడుసార్లు ఉల్లంఘిస్తే.. రూ. 15వేల జరిమానా, లైసెన్సు నెలరోజుల పాటు సస్పెన్షన్, తప్పనిసరి శిక్షణ ఉండాలట.

మరిన్ని వార్తలు