వాహనదారులూ బీ అలర్ట్: కొంపముంచుతోంది అదే!

1 Nov, 2023 13:31 IST|Sakshi

ప్రతీ రోజు దేశం నలుమూలల్లో చోటుచేసుకునే అనేక వాహన ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. స్వయం కృతాపరాధంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్న సంఘటనలు కలిచి వేస్తాయి. డ్రైవింగ్‌పై క్రేజ్‌ తో స్పీడ్‌గా వెళ్లడం థ్రిల్ కావచ్చు, కానీ అది ప్రమాదకరం. మన ప్రాణాలకే కాదు ఇతరులకు కూడా. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూసే ఓపిక లేకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించడం ఈ రోజుల్లో సాధారణమై పోయింది. ‘‘స్పీడ్‌ థ్రిల్స్‌.. బట్‌ కిల్స్‌’’ అనే  మాటల్ని  తాజా ప్రభుత్వ ఒక సంచలన నివేదిక మరోసారి గుర్తు చేసింది.

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన “భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు 2022” నివేదిక ప్రకారం, భారతదేశంలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాలకు అత్యంత ప్రమాదకరమైన సంవత్సరంగా 2022 నిలిచింది. ప్రతీ పది లక్షల జనాభాకు 122 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు.  1970 నుంచి ఇదే  అత్యధిక రేటు

దేశవ్యాప్తంగా ప్రమాదాలు , మరణాల వెనుక అతివేగం ప్రధాన కారణాలలో ఒకటిగా  తేలింది. 2022లో 11.9శాతం పెరిగి  4,లక్షల 61వేల 312 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా  2021లో  వీటి సంఖ్య  4 లక్షల 12వేల 432గా ఉంది. 1 లక్షా 68వేల 491 మంది  ప్రాణాలు కోల్పోయారు.   4 లక్షల 43వేల 366 మంది గాయపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే  మరణాలు 9.4 శాతం ఎగిసి  క్షతగాత్రుల సంఖ్య 15.3శాతం పెరిగింది.  

2022లో 3.3 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలకు దారితీసిన కారణాల్లో అతివేగంతో పాటు, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్‌ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2022లో, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అతివేగం కారణంగా 71.2 శాతం మంది మరణించారు, ఆ తర్వాత స్థానం రాంగ్ సైడ్ డ్రైవింగ్‌ది (5.4శాతం) అని నివేదిక పేర్కొంది.

ఇక మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దాదాపు 10వేల ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.అంతేకాదు రెడ్‌సిగ్నల్‌ జంప్‌ వల్ల యాక్సిడెంట్లు గణనీయంగా పెరిగాయి.  2021లో ఇవి 2,203గా ఉంటే  2022లో  82.55 శాతం పెరిగి 4,021 ప్రమాదాలు నమోదైనాయి.  2022లో హెల్మెట్ ధరించని బైక్ ప్రమాదాల్లో 50వేల మంది మరణించారు. వీరిలో 71.3 శాతం మంది ( 35,692) డ్రైవర్లు, 14,337 (28.7శాతం)  వెనుక కూర్చున్న వారు అని నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు