ముందస్తు బెయిల్‌ కోసం హనీప్రీత్‌

26 Sep, 2017 12:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దత్త పుత్రిక, మోస్ట్‌ వాంటెడ్‌ హనీప్రీత్‌ సింగ్‌ ఇండియాలోనే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ముందస్తు బెయిల్‌ కోసం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించబోతుందని సమాచారం. ఈ మేరకు బెయిల్‌ దరఖాస్తు దాఖలు చేయనున్నట్లు ఆమె తరపు న్యాయవాది ప్రదీప్‌ ఆర్య  మీడియాకు వెల్లడించారు. 

‘‘గుర్మీత్‌ శిక్ష, తర్వాత పరిస్థితులు, బాబాకు ఆమెకు మధ్య ఉన్న సంబంధం గురించి చెడుగా వార్తలు రావటంపై హనీప్రీత్‌ బాధపడ్డారు. అల్లర్లకు ఆమె కారణమన్న పోలీసుల వాదన ముమ్మాటికీ తప్పు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నాం’’ అని ప్రదీప్‌ ఆర్య తెలిపారు. అంతేకాదు బెయిల్‌ అప్లికేషన్‌పై సంతకం చేసేందుకు హనీప్రీత్‌ లజ్‌పత్‌ నగర్‌లోని తన కార్యాలయానికి వచ్చినట్లు ప్రదీప్‌ చెప్పారు. అయితే ఆమె ఎక్కడ ఉందన్న సమాచారం తనకు ఖచ్ఛితంగా తెలీదని ఆయన చెబుతున్నారు.   

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బెయిల్‌ ఆలస్యం కావొచ్చని, కానీ, పిటిషన్‌ను త్వరగా పరిశీలించాలని తాను న్యాయమూర్తిని కోరతానని ప్రదీప్‌ తెలిపారు. ఆగష్టు 25న పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అత్యాచార కేసుల్లో డేరా సచ్ఛా సౌధా చీఫ్‌ గుర్మీత్‌కు 20 ఏళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. అనంతరం చెలరేగిన అల్లర్లలో 41 మంది చనిపోగా, 250 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు కారణమని పేర్కొంటూ 43 మంది మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాను హర్యానా పోలీస్‌ శాఖ ప్రకటించగా, అందులో హనీప్రీత్‌ పేరు టాప్‌లో ఉంది. దీంతో లుక్‌ అవుట్‌ నోటీసుల నేపథ్యంలో బిహార్‌సహా పలు రాష్ట్రాల్లో పోలీసులు ఆమె కోసం జల్లెడ పడుతున్నారు.

మరిన్ని వార్తలు