మోదీకి ప్రాణహాని; ఎవరినీ దగ్గరకు రానివొద్దు

26 Jun, 2018 12:21 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : 2019 ఎన్నికల దృష్టా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాణహాని అధికంగా ఉందని నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎన్‌ఎస్‌సీ) ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోదీ పర్యటనల సందర్భంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాక మోదీ పర్యటించే సమయంలో ఎవరిని ఆయనకు సమీపంగా వెళ్లడానికి అనుమతించకూడదని.. ఒకవేళ అనుమతించినా పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే పంపించాలని తెలిపింది.

ఇది కేవలం సామన్యులకే మాత్రమే కాక మంత్రులకు, అధికారులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. మోదీకి సమీపంగా వెళ్లాలనుకుంటే మంత్రులు, అధికారులను కూడా ప్రత్యేక భద్రతా దళాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తాయని తెలిపారు. రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ రోడ్‌ షోలలో పాల్గొనకపోవడమే మంచిదంటున్నాయని సూచించాయి. తప్పనిసరైతే రోడ్‌ షో నిర్వహించే సమయాన్ని, దూరాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలన్నాయి.

కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర పూణెలో మావోయిస్టు సానుభూతిపరుల నుంచి స్వాధీనం చేసుకున్న ‘రాజీవ్‌ గాంధీ తరహా ఘటన’ పేపర్ల నేపధ్యంలో మోదీ భద్రతా గురించి కేంద్ర హోం శాఖ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యం​లో అనుకోని ప్రమాదాల జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అన్ని రాష్ట్ర ముఖ్య పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మోదీకి ఆరు వలయాల భద్రతా ఏర్పాట్లను కల్పిస్తున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు