నెట్ కు లేనిది.. సినిమాకు ఎందుకు?

17 Apr, 2017 18:36 IST|Sakshi
నెట్ కు లేనిది.. సినిమాకు ఎందుకు?

న్యూఢిల్లీ: భారత్ లో సెన్సార్ షిప్ చట్టాలను మార్చాలంటూ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత 47 సంవత్సరాలుగా సెన్సార్ షిప్ ను ఎవరూ ప్రశ్నించలేదని.. మారుతున్న కాలంతో పాటు అందులోని నిబంధనలు కూడా మారాలని పాలేకర్ అన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఎక్కువ మొత్తం కట్స్ లో పోతున్నాయని, కొన్ని సినిమాలైతే సర్టిఫికేషన్ కు నోచుకోవడం లేదని గుర్తు చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను ఎక్కువగా ఇవ్వమని కోరడం లేదని అయితే  సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రస్తుత కాలంలో మాస్ మీడియా పలు రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటోందని చెప్పుకొచ్చిన ఆయన.. నిబంధనలు కూడా ప్రజల అవసరాలకు తగిన విధంగా ఉండాలన్నారు. కాగా టీవీలు, ఇంటర్నెట్ లో కంటెంట్ పై సెన్సార్ షిప్ లేదని.. అదే సమాచారంతో రూపొందే సినిమా దగ్గరకు వచ్చేసరికే మాత్రం సెన్సార్ షిప్ పేరుతో కట్స్ ఎక్కువగా చేస్తున్నారని పిటిషన్ లో పాలేకర్ వాదించారు.

ఈ మధ్య కాలంలో విడుదల కోసం తిప్పలు పడిన సినిమాలను గురించి పిటిషన్ లో వివరించారు. జాలీ ఎల్ఎల్బీ2 సినిమాలో కట్స్ విధించాలంటూ అలహాబాద్ హైకోర్టు చేసిన డిమాండ్ ను కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలపై శ్యాం బెనగల్ కమిటీ సూచనలను అమలయ్యేలా చూడాలని పిటిషన్ లో కోరారు.

మరిన్ని వార్తలు