సమావేశం ఫలప్రదం; కేంద్రానికి ఏపీ సూచనలు

26 Aug, 2019 18:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి జాతీయ స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సోమవారం నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. కాంట్రాక్టర్లు ముందుకురాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలకు అప్పగించడం, కమ్యూనికేషన్ టవర్ల ఏర్పాటుకు నిబంధనల సరళీకరణపై చర్చించారు. రూ. 50 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గిరిజనులకు ఇచ్చే దానిపై దృష్టి సారించారు. నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు ప్రతి గ్రామంలో పోస్టాఫీసు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు  రూపొందించాలని సూచించారు.

సమావేశం ఫలప్రదంగా ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల్లోని శాంతిభద్రతలు, అభివృద్ధి గురించి కీలకాంశాలు చర్చించినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, డీజీపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలు
యువత మావోయిజం వైపు ఆకర్షితులు కాకుండా చేపట్టాల్సిన తక్షణ చర్యల గురించి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ మెడికల్ కాలేజీ, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ నెలకొల్పాలని కోరారు. గిరిజన ప్రాంతమైన సాలూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస)

మరిన్ని వార్తలు