ఐదుగురు సైనికులకు జీవితఖైదు

14 Nov, 2014 02:43 IST|Sakshi
ఐదుగురు సైనికులకు జీవితఖైదు
  • మాచిల్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో కోర్టు మార్షల్ తీర్పు
  • శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ను కుదిపేసిన 2010 నాటి మాచిల్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఐదుగురు సైనికులకు సమ్మరీ జనరల్ కోర్టు మార్షల్ (ఎస్‌జీసీఎం) జీవితఖైదు విధించింది. ఉద్యోగాలు ఇస్తామని ముగ్గురు నిరుద్యోగ యువకులను మాయమాటలతో నమ్మించి సరిహద్దు వద్దకు తీసుకెళ్లి కాల్చి చంపి పాకిస్థాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించినందుకు నాటి కల్నల్ డి.కె. పఠానియా, కెప్టెన్ ఉపేంద్ర, హవల్దార్ దేవిందర్, లాన్స్ నాయక్‌లు, లఖ్మీ, అరుణ్ కుమార్‌లకు ఈ శిక్ష విధించింది.

    మరో నిందితుడిని (సుబేదార్) మాత్రం నిర్దోషిగా విడిచిపెట్టింది. ఉత్తర కాశ్మీర్‌లోని ఎగువ ప్రదేశమైన మాచిల్ నుంచి కాశ్మీర్ లోయలోకి ఆయుధాలతో చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు మిలిటెంట్లను కాల్చి చంపామంటూ సైన్యం 2010 ఏప్రిల్ 30న వారి మృతదేహాలను చూపింది.

    అనంతరం వారిని పాక్ ఉగ్రవాదులుగా పేర్కొంది. అయితే దీనిపై దర్యాప్తు చేపట్టిన జమ్మూకాశ్మీర్ పోలీసులు మృతులను బారాముల్లా జిల్లాకు చెందిన మొహమ్మద్ షఫీ, షెజాద్ అహ్మద్, రియాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు. ఉద్యోగాల పేరిట సైనికులు వారిని తీసుకెళ్లి కాల్చి చంపారని నిరూపిస్తూ ఆరుగురు సైనికులు సహా తొమ్మిది మందిపై 2010 జూలైలో సోపోర్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో సమగ్ర విచారణ చేపడతామంటూ సైన్యం హామీ ఇవ్వడంతో కేసు బదిలీ అయింది. బూటకపు ఎన్‌కౌంటర్‌పై కాశ్మీర్ లోయలో భారీ స్థాయిలో చెలరేగిన హింసలో ఏకంగా 123 మంది మృతిచెందారు.
     
    తీర్పును స్వాగతిస్తున్నాం: సీఎం ఒమర్

    కోర్టు మార్షల్ తీర్పును జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. దీన్ని కీలక పరిణామంగా అభివర్ణించారు. ఇటువంటి కేసుల్లో న్యాయం జరుగుతుందని కాశ్మీరీలెవరూ ఇప్పటివరకూ నమ్మలేదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగరాదని ఆశిస్తున్నట్లు ‘ట్వీట్’ చేశారు. మరోవైపు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం ఈ తీర్పును స్వాగతించింది. కాగా, త్వరలో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీ వేసిన పన్నాగమే ఈ తీర్పు అని వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ ఆరోపించారు.
     

మరిన్ని వార్తలు