భారతదేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్‌.. ఎవరీ పల్వంకర్‌ బాలూ

20 Nov, 2023 13:33 IST|Sakshi

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. లీగ్‌ మ్యాచుల్లో అదరగొట్టి ఓటమి ఎరుగని జట్టుగా పేరుతెచ్చిన భారత్‌.. ఫైనల్‌లో చతికిలబడింది. తుదిపోరులో ఆరు వికేట్ల తేడాతో రోహిత్‌ సేన జట్టు కంగారుల చేతిలో ఘోర పరాజయపాలైంది. 

అయితే హోం గ్రౌండ్‌లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 12 తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడుతుందనుకున్న భారత్‌కు ఇలా జరగడంపై తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్‌ కుమార్‌ అహింస చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్రికెట్‌లో కూడా రిజర్వేషన్లు ఉండాలని, ఒకవేళ ఇప్పటికే రిజర్వేషన్లు ఉంటే భారత్‌ వరల్డ్‌కప్‌ సులువగా గెలిచేదని తెలిపారు.

వరల్డ్‌ కప్‌ జరిగే రోజు చేతన్‌ మరో ట్వీట్‌ కూడా చేశాడు. డబ్బు, కీర్తి కోసం కాకుండా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లు దేశానికి అవసరమని.. 1876లో కర్ణాటకలోని ధర్వాడ్‌లో జన్మించిన భారత దేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్‌ పల్వకంర్‌ బాలూ ప్రస్తావన తీసుకొచ్చారు. వందేళ్ల క్రితం పల్వంకర్‌ బాలూ క్రికెటర్‌(బౌలర్‌)గా, సామాజిక, రాజకీయ కార్యకర్తగా చురుకుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చేతన్‌ అహింస ప్రస్తావనతో పల్వంకర్‌ బాలూ గురించి బయటకొచ్చింది. పల్వంకర్‌ బాలూ భారతీయ క్రికెటర్‌, రాజకీయ కార్యకర్త. 1876 మార్చి 19న కర్ణాటకలోని ధార్వాడ్‌లో(ఒకప్పటి బాంబే ప్రెసిడెన్సీ) జన్మించాడు.  ప్రపంచ క్రీడల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన దళిత సమాజానికి చెందిన మొదటి వ్యక్తిగా బాలూ చరిత్రకెక్కాడు. అతడు పరమానందాస్ జీవందాస్ హిందూ జింఖానా, బాంబే బెరార్, కేంద్ర రైల్వేశాఖకు చెందిన కార్పొరేట్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. ఎడమ చేతి స్పిన్‌ బౌలర్‌ అయిన బాలూ.. మొత్తం 33 ఫస్ట్‌-క్లాస్‌మ్యాచ్‌లలో (15.21 బౌలింగ్‌ సగటుతో) 179 వికెట్లు పడగొట్టాడు. 1911 ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ‘రోడ్స్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు సంపాదించాడు.

అయితే బాలూ తన సామాజిక వర్గం కారణంగా కెరీర్‌లో అనేక వివక్షతను ఎదుర్కొన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.  తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా ముద్ర పడటంతో సమాన అవకాశాలు దక్కలేదనే విమర్శ ఉంది. ఒకసారి పుణెలో మ్యాచ్‌ ఆడుతుండగా.. టీ విరామం సమయంలో అతనికి టీం సభ్యులందరితో కాకుండా బయట డిస్పోజబుల్‌ కప్పులో అందించినట్లు, అతనికి భోజనం కూడా ప్రత్యేక టేబుల్‌పై వడ్డించినట్లు వార్తలొచ్చాయి. పల్వంకర్‌ తన ముఖం కడక్కోవాలనుకున్నా అణగారిన వర్గానికి చెందిన అటెండర్‌ అతనికి ఒక మూలన నీళ్లు తెచ్చి పెట్టేవాడని తెలుస్తోంది. అయితే బాలూ బొంబాయికి మారిన తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. క్వాడ్రాంగ్యులర్ టోర్నమెంట్‌లో అతనికి హిందూ జట్టు కెప్టెన్సీ నిరాకరించారు.

భారత క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా  పల్వంకర్‌ పేరు గాంచారు. గాంధీ భావజాలంతో ప్రభావితమై.. దేశంలో హోమ్ రూల్ తీసుకురావడానికి కృషి చేశాడు. 1910లో పల్వంకర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను తొలిసారి కలిశాడు. అనంతరం ఇరువురు మంచి మిత్రులుగా మారారు. వీరిద్దరూ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం దెబ్బతింది.

1932లో అణగారిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన డిమాండ్‌ను బాలూ వ్యతిరేకించాడు. అనంతరం అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ‘రాజా-మూంజే ఒప్పందం’పై సంతకమూ చేశాడు. అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పుడు.. అణగారిన వర్గాలను ఇతర మతాల్లోకి మార్చడాన్ని 'ఆత్మహత్య'గా అభివర్ణించాడు.

1933లో బాలూ హిందూ మహాసభ టికెట్‌పై బొంబాయి మున్సిపాలిటీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమి చెందాడు. నాలుగు సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌లో చేరి బొంబాయి శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి మరోసారి పరాజయం పొందాడు. స్వాతంత్ర్యం అనంతరం 1955 జూలై4న బాంబే స్టేట్‌లో మరణించాడు. డాయన అంత్యక్రియలకు పలువురు జాతీయ నాయకులు మరియు క్రికెటర్లు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు