టాటా సన్స్‌ చైర్మన్‌గా ఆర్నాబ్‌ గోస్వామి?

1 Nov, 2016 20:37 IST|Sakshi
టాటా సన్స్‌ చైర్మన్‌గా ఆర్నాబ్‌ గోస్వామి?

న్యూఢిల్లీ: ‘టైమ్స్‌ నౌ’ టీవీ ఛానెల్‌ ఎడిటర్‌ పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్న ఆర్నాబ్‌ గోస్వామికి ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియాలో ఖాతా లేకపోయినా, ఫాలోవర్లు మాత్రం పుంఖానుపుంఖంగా ఉన్నారు. ఆర్నాబ్‌ తన పదవికి రాజీనామా చే సినట్లు వార్త వెలువడగానే ఆగమేఘాల మీద యూజర్లు స్పందించి తమదైన రీతిలో ట్వీట్లు చేశారు.  స్వీట్లు పంచారు.

‘ఇంతకాలం టీవీలో అనధికార జడ్జీగా వ్యవహరించిన ఆర్నాబ్‌ ఇప్పుడు అధికారికంగా సుప్రీం కోర్టు జడ్జీగా వెళ్లేందుకు రాజీనామా చేశారు......కాదు, కాదు, పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు....అదికాదు, టాటా సన్స్‌ చైర్మన్‌ పదవిని చేపట్టేందుకు వెళ్లారు....ఆర్నాబ్‌ నిష్క్రమణతో టైమ్స్‌ నౌ ‘వ్యాల్యూ’ సారీ, సారీ ‘వ్యాల్యూమ్‌’ తగ్గింది......మొన్న టాటా సన్స్‌లో, నిన్న ట్విట్టర్‌లో, నేడు టైమ్స్‌ నౌలో ఉన్నత పదవులు ఖాళీ, అర్హులు ధరఖాస్తు చేసుకోండి....ఆర్నాబ్‌ రాజీనామా ఎలా చేసి ఉంటారు? కచ్చితంగా అరచి, గీపెట్టి చెప్పే ఉంటారు.....ఆయన చెప్పా పెట్టకుండా రాజీనామా చేస్తే ఎలా? నా అభిప్రాయం ఎలా ఉండాలో ఇప్పుడు నాకెవరు చెబుతారు?....ఎస్‌ఎమ్మెస్‌ పోల్‌ లేకుండా ఎలా రాజీనామా చేస్తారు?.....

‘24 గంటలపాటు ఆర్నాబ్‌ను భరించే ఛానెల్‌ పెట్టే  దమ్ము ఎవరికైనా ఉందా?....దీపావళి అంటే నిజంగా ఇదే, పటాసుల పేలుళ్లు లేకుండా ప్రశాంతంగా ఉంది....నేను మాత్రం ఒక్క క్షణం టపాసులు పేలుస్తా కాలుష్యం పోయినందుకు....తూ కిత్నే ఆర్నాబ్‌కో మారేగా హర్‌ ఛానెల్‌ సే ఏక్‌ ఆర్నాబ్‌ నిక్లేగా.....ఆర్నాబ్‌ నిష్క్రమణకు ఆందోళనే అవసరంలేదు ఛానెల్, ఆర్కీవ్స్‌ నుంచి పాత న్యూస్‌ అవర్‌ కార్యక్రమాల వీడియోలు ప్రసారం చేస్తే చాలు, తేడా ఎవరూ గుర్తించరు...’ అంటూ ట్వీట్లు ఇలా సాగిపోతున్నాయి.

ఆర్నాబ్‌ గోస్వామి రాజీనామా గురించి తానుగానీ, టైమ్స్‌ నౌగాని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ పాశ్చాత్య మీడియాను కాలదన్నే స్థాయిలో భారత్‌ మీడియా సామ్రాజ్యం ఎదగాలని ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కనుక అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆయన బయటకు వెళ్లి ఉంటారని....తాను సొంతంగా ఎప్పటి నుంచో ఓ  మీడియా చానెల్‌ ప్రారంభించాలన్నది ఆయన కోరికని, ఆ ప్రయత్నాల్లోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఊహాగానాలు చెలరేగులుతున్నాయి.

మరిన్ని వార్తలు